చిన్నసినిమానా మజాకా!
సినిమాలో కంటెంట్ బలంగా ఉంటే ఎదురుగా ఎంత పెద్ద పోటీ ఉన్నా సరే పట్టించుకోవాల్సిన పని లేదు. ఆ విషయాన్ని తాజాగా మలయాళ మూవీ ఒకటి రుజువు చేసింది.
By: Ravindar Gorantla | 24 March 2026 6:00 AM ISTసినిమాలో కంటెంట్ బలంగా ఉంటే ఎదురుగా ఎంత పెద్ద పోటీ ఉన్నా సరే పట్టించుకోవాల్సిన పని లేదు. ఆ విషయాన్ని తాజాగా మలయాళ మూవీ ఒకటి రుజువు చేసింది. అదే `ఆడు 3 వన్ లాస్ట్ రైడ్ పార్ట్ 1`. జయసూర్య, వినాయకన్ ప్రధాన పాత్రల్లో నటించగా మిథున్ మాన్యుయేల్ థామస్ రూపొందించాడు. మార్చి 19న విడుదలైన ఈ ఇనిమా అక్కడ సంచలనం సృష్టిస్తోంది. మార్చి 19న సెన్సేషనల్ మూవీ `ధురంధర్ 2` విడుదలై బాక్సాఫీస్ వద్ధ భీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీ రిలీజ్ అవుతోందంటే చాలా వరకు తమ సినిమాల వసూళ్లపై ప్రభావం పడుతుందని రిలీజ్‌లు వాయిదా వేసుకున్నాయి. అలాంటి తరుణంలో ఎలాంటి బెరుకు లేకుండా `ధురంధర్ 2`తో పాటు చిన్న సినిమా `ఆడు 3 వన్ లాస్ట్ రైడ్ పార్ట్ 1` కూడా థియేటర్లలోకి వచ్చేసి కేరళనాట బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రూ.12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా రూ.85 కోట్లకు పైనే రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేస్తోంది.
త్వరలోనే ఈ సినిమా వంద కోట్ల మార్కుని క్రాస్ చేస్తుందని మలయాళ వర్గాలు అంటున్నాయి. `ధురంధర్ 2` దెబ్బకి పెద్ద పెద్ద స్టార్లే బెంబేలెత్తిపోతూ చేతులెత్తేస్తుంటే చిన్న హీరో జయసూర్య నటించిన ఫషాంటసీ కామెడీ మూవీ `ఆడు 3 వన్ లాస్ట్ రైడ్ పార్ట్ 1` బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ సెంచరీకి చేరువవుతుండటం పలువురిని షాక్‌కు గురి చేస్తోంది. 2017లో `ఆడు 2` విడుదలైంది. అప్పట్లో ఇది బాక్సాఫీస్ వద్ద రూ.35 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. దీనికి ముందు 2015లో `ఆడు` విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పుడు విడుదలైన సీక్వెల్ థార్డ్ ఇన్స్టాల్‌మెంట్. ఇదొక టైమ్ ట్రావెల్ స్టోరీ. భూత, వర్తమాన, భివిష్యత్ కాలాల్లో సాగుతుంది. 1750, 2026, 2370 కాలాల నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ మూడు కాలాల్లోని పాత్రల నేపథ్యంలో చిత్ర విచిత్రమైన సంఘటనల సమాహారంగా దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు. ఈ ఫ్రాంచైజీ సిరీస్ సినిమాలపై మలయాళ ప్రేక్షకుల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అవే `ఆడు 3 వన్ లాస్ట్ రైడ్ పార్ట్ 1`కి ప్రధాన బలంగా నిలిచి సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టేలా చేస్తోంది.
ఒక కాలంలో మరిణించిన వారు మరో కాలంలో పుడతారని చెబుతూ ఈ మూవీలో దర్శకుడు కొన్ని మ్యాజిక్‌లు చేశాడు. అదే ఇప్పుడు మలయాళ తంబీలను విశేషంగా ఆకట్టుకుంటూ ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. చిన్న సినిమాగా విడుదలై కేవలం మౌత్ టాక్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఓ పక్క `ధురంధర్ 2` ర్యాంపేజ్ చేస్తున్నా వసూళ్ల పరంగా ఈ చిన్న సినిమా తగ్గేదేలే అన్నట్టుగా వసూళ్లని రాబడుతూ వంద కోట్ల మార్కుకి దగ్గరలో ఉండటం అందరిని షాక్‌కు గురి చేస్తోంది. ఈ మూవీ గురించి తెలిసిన ట్రేడ్ వర్గాలు చిన్న సినిమానా మజాకా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
