ఆది సాయికుమార్ మిస్టరీ శంబాల.. వచ్చేది ఎప్పుడంటే..
టాలీవుడ్‌లో ప్రస్తుతం కొత్త కథలకు, డిఫరెంట్ కాన్సెప్ట్‌లకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.
By: M Prashanth | 18 Oct 2025 6:38 PM ISTటాలీవుడ్‌లో ప్రస్తుతం కొత్త కథలకు, డిఫరెంట్ కాన్సెప్ట్‌లకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా మిస్టికల్ థ్రిల్లర్ జానర్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ కోవలోనే యంగ్ హీరో ఆది సాయికుమార్ కూడా ఓ సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. రొటీన్ కథలకు భిన్నంగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఆయన చేస్తున్న శంబాల సినిమాపై ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే శంబాల చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, ముఖ్యంగా టైటిల్ లోగో, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఏదో తెలియని రహస్యాన్ని ఛేదించే కథాంశంతో ఈ సినిమా రాబోతుందని అందరూ భావిస్తున్నారు. అసలు ఆ మిస్టరీ ఏంటి? దాని వెనుక ఉన్న ప్రపంచం ఎలా ఉండబోతోంది? అనే దానిపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే చిత్రయూనిట్ పండగ పూట ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.
దీపావళి సందర్భంగా, 'శంబాల' చిత్ర బృందం మోస్ట్ అవైటెడ్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ మిస్టికల్ థ్రిల్లర్‌ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీంతో క్రిస్మస్ బరిలో 'శంబాల' కూడా ఓ గట్టి పోటీదారుగా నిలవనుంది. కొత్తగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.
చేతిలో బ్యాగ్‌తో ఇంటెన్స్ లుక్‌లో ఆది కనిపిస్తుండగా, ఆయన పక్కనే డాగ్, వెనుక మంటల మధ్య ఓ ఆకారం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 'శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా విజువల్‌గా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆది సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం, తన ప్రత్యేకమైన కథాంశంతో ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఆది సాయికుమార్ కెరీర్‌లో ఈ సినిమా ఒక బిగ్ హిట్ గా నిలుస్తుందని కూడా చెబుతున్నారు. మరి ఈ సినిమా ఆడియెన్స్ అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.
