Begin typing your search above and press return to search.

ఓ వైపు విల‌న్ గా.. మ‌రోవైపు హీరోగా.. ఆది రేర్ ఫీట్

కెరీర్ స్టార్టింగ్ నుంచే డిఫ‌రెంట్ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ అంద‌రిలా కాద‌నిపించుకున్న ఆది తెలుగు వాడైన‌ప్ప‌టికీ అత‌ని డెబ్యూ జ‌రిగింది మాత్రం త‌మిళంలోనే.

By:  Sravani Lakshmi Srungarapu   |   12 Dec 2025 1:00 AM IST
ఓ వైపు విల‌న్ గా.. మ‌రోవైపు హీరోగా.. ఆది రేర్ ఫీట్
X

ఆది పినిశెట్టి గురించి కొత్త‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. డైరెక్ట‌ర్ ర‌విరాజా పినిశెట్టి కొడుకుగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది, ఆ త‌ర్వాత త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుని ఆడియ‌న్స్ ను అల‌రిస్తూ వ‌స్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచే డిఫ‌రెంట్ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ అంద‌రిలా కాద‌నిపించుకున్న ఆది తెలుగు వాడైన‌ప్ప‌టికీ అత‌ని డెబ్యూ జ‌రిగింది మాత్రం త‌మిళంలోనే.

వైరం ధ‌నుష్ గా భ‌య‌పెట్టిన ఆది పినిశెట్టి

పుట్టింది పెరిగింది కూడా చెన్నైలోనే. త‌మిళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసి స‌క్సెస్ అందుకున్న త‌ర్వాత తెలుగులో కూడా సినిమాలు చేయ‌డం మొద‌లుపెట్టి ఇక్క‌డ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలుగులో ప‌లు సినిమాలు చేసిన ఆది, వాటిలో ఎక్కువ‌గా విల‌న్ క్యారెక్ట‌ర్లే చేశారు. వాటిలో ముఖ్యంగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌రైనోడు మూవీలో వైరం ధ‌నుష్ గా న‌టించి అంద‌రికీ త‌న యాక్టింగ్ తో భ‌యం పుట్టించారు.

అఖండ‌2లో బాల‌య్య‌కు విల‌న్ గా..

త‌ర్వాత కూడా ఆది విల‌న్ గా ప‌లు సినిమాలు చేశారు. ఇప్పుడు ఈ టాలెంటెడ్ న‌టుడు విల‌న్ గా న‌టించిన మ‌రో సినిమా ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే అఖండ‌2. స‌రైనోడు సినిమాను డైరెక్ట్ చేసిన బోయ‌పాటి శ్రీనునే ఈ సినిమాకు కూడా డైరెక్ట‌ర్. స‌రైనోడు సినిమాతో ఆదికి వ‌చ్చిన పేరు కంటే అఖండ‌2 తో అత‌నికి ఎక్కువ పేరొస్తుంద‌ని చిత్ర యూనిట్ ఎంతో న‌మ్మ‌కంగా చెప్తోంది.

అఖండ‌2తో పాటే డ్రైవ్

ఇదిలా ఉంటే అంద‌రూ అఖండ‌2 కోసం ఎంతో వెయిట్ చేస్తున్న నేప‌థ్యంలో అదే రోజున ఆది హీరోగా న‌టించిన మ‌రో సినిమా కూడా రిలీజవుతుంది. అదే డ్రైవ్. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ఆనంద్ ప్ర‌సాద్ నిర్మాత‌గా జెనూస్ మ‌హ్మ‌ద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఎన్నో ఏళ్ల కిందటే మొద‌లైంది కానీ రిలీజ్ మాత్రం లేటైంది. అఖండ‌2 డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో వ‌స్తుంద‌నుకుని ఎన్నో చిన్న సినిమాలు ఆ త‌ర్వాత వార‌మైన డిసెంబ‌ర్ 12న రిలీజ్ ను ఫిక్స్ చేసుకోగా వాటిలో డ్రైవ్ కూడా ఒక‌టి. మొత్తానికి ఓ ప‌క్క హీరోగా, మ‌రోవైపు విల‌న్ గా ఒకే రోజున ఆది సినిమాలు థియేట‌ర్ల‌లోకి రావ‌డం అతి త‌క్కువ మందికి మాత్ర‌మే ద‌క్కే అవ‌కాశం. అఖండ‌2తో డ్రైవ్ కు పోలిక పెట్ట‌లేం కానీ ఆది చేసిన సినిమా కాబ‌ట్టి అందులో ఏదో గ‌ట్టి కంటెంటే ఉండే ఛాన్సుంది. మ‌రి అఖండ‌2 ఫీవ‌ర్ లో డ్రైవ్ సినిమా ఎంత‌మంది వ‌ద్ద‌కు రీచ్ అవుతుందో చూడాలి.