Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసి దెబ్బ.. మళ్లీ అలా ఎందుకు చేస్తారు?

ఆ ఫ్లాప్ త్రివిక్రమ్‌ను ఆర్థికంగానూ ఇబ్బంది పెట్టింది. సినిమా నష్టాల కారణంగా తన రెమ్యునరేషన్ తిరిగిచ్చినట్లు స్వయంగా చెప్పారు.

By:  M Prashanth   |   26 Oct 2026 11:09 PM IST
అజ్ఞాతవాసి దెబ్బ.. మళ్లీ అలా ఎందుకు చేస్తారు?
X

ఒకసారి ఎదురైన చేదు అనుభవాన్ని అంత త్వరగా మర్చిపోవడం ఎవరికైనా కష్టమే. ముఖ్యంగా వందల కోట్ల బిజినెస్ జరిగే సినిమా విషయంలో పొరపాటు జరిగితే దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది. దర్శకుడు త్రివిక్రమ్ కూడా గతంలో అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఇప్పుడు వెంకటేష్‌తో తీసిన 'ఆదర్శ కుటుంబం'పై కాపీ ప్రచారం మొదలవడంతో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ వివాదం మళ్లీ గుర్తుకొస్తోంది. అయితే అప్పట్లో ఎదురైన దెబ్బ తర్వాత త్రివిక్రమ్ మళ్లీ అదే తరహా రిస్క్ తీసుకుంటారా అనేది ఆలోచించాల్సిన విషయం.

2018లో పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అజ్ఞాతవాసి' విడుదలకు ముందే కాపీ ఆరోపణలు ఎదుర్కొంది. ఫ్రెంచ్ సినిమా 'లార్గో వించ్' కథను పోలి ఉందంటూ అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. ఆ సినిమా రీమేక్ హక్కులు కలిగిన టీ సిరీస్‌తో కాపీరైట్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. చివరకు ఆ సమస్యను పరిష్కరించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ భారీ అంచనాలతో విడుదలైన 'అజ్ఞాతవాసి' బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.

ఆ ఫ్లాప్ త్రివిక్రమ్‌ను ఆర్థికంగానూ ఇబ్బంది పెట్టింది. సినిమా నష్టాల కారణంగా తన రెమ్యునరేషన్ తిరిగిచ్చినట్లు స్వయంగా చెప్పారు. నిర్మాత, పవన్ కళ్యాణ్‌తో కలిసి డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను భర్తీ చేసిన విషయాన్ని కూడా వెల్లడించారు. ఇటీవల మరోసారి ఆ రోజుల గురించి మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో కట్టుకుంటున్న ఇంటిని అమ్మేయాలని కూడా అనుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. అంత పెద్ద సినిమా ఫెయిలైతే పరిస్థితి ఎంతవరకు వెళ్తుందో త్రివిక్రమ్‌కు అప్పుడే అనుభవమైంది.

ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' విషయంలోనూ తమిళ చిత్రం 'బ్లాస్ట్' పేరు వినిపిస్తోంది. అర్జున్ నటించిన ఆ సినిమాలో మాదిరిగానే వెంకటేష్ సినిమాలోనూ ఒక కుటుంబానికి నేరస్తుల నుంచి ప్రమాదం ఎదురవుతుందని కొందరు పోలుస్తున్నారు. దీనిపై త్రివిక్రమ్, వెంకటేష్ ఇప్పటివరకు ప్రత్యేకంగా స్పందించలేదు. కానీ హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాత్రం క్లారిటీ ఇచ్చింది. తాను 'బ్లాస్ట్' చూశానని, ఆ సినిమాకు 'ఆదర్శ కుటుంబం'తో ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.

పైగా ఈసారి త్రివిక్రమ్ పనిచేస్తున్నది కూడా 'అజ్ఞాతవాసి' నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లోనే. నిర్మాత రాధాకృష్ణకు అప్పటి నష్టాల గురించి తెలుసు. అలాంటి అనుభవం ఉన్న దర్శకుడు, నిర్మాత మళ్లీ అదే తరహా వివాదానికి అవకాశం ఇచ్చే కథను ఎందుకు ఎంచుకుంటారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్‌లో చూపించిన కొన్ని సన్నివేశాల ఆధారంగానే ప్రస్తుతం ఈ పోలికలు వస్తున్నాయి. ఏదేమైనా త్రివిక్రమ్ మళ్ళీ అలాంటి పరిస్థితికి. ఏమాత్రం చాన్స్ ఇవ్వరు అనేది కొందరు చెబుతున్న మాట. ఇక సినిమా రిలీజ్ తర్వాత కథ ఎలా ఉంటుందో చూడాలి.