వెంకీ, త్రివిక్రమ్ భారీ ఓపెనింగ్స్.. ఈసారి ఎంత రాబడతారో..
ఇక వెంకటేష్ గత సోలో సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయమే అందుకుంది.
By: M Prashanth | 27 Oct 2026 7:00 AM ISTఒక దర్శకుడి గత సినిమా భారీ ఓపెనింగ్ తెచ్చింది. హీరో చివరిగా చేసిన సోలో సినిమా కూడా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో బాక్సాఫీస్ దగ్గర అంచనాలు పెరగడం సహజమే. అక్టోబర్ 30న విడుదలవుతున్న 'ఆదర్శ కుటుంబం' విషయంలో వెంకటేష్, త్రివిక్రమ్ ముందున్నది ఇదే పరిస్థితి. అయితే గత సినిమాల కలెక్షన్లను ఈ కాంబినేషన్ ఎంతవరకు అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
త్రివిక్రమ్ చివరిగా దర్శకత్వం వహించిన 'గుంటూరు కారం' 2024 సంక్రాంతికి విడుదలైంది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.94 కోట్ల గ్రాస్ సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. ట్రేడ్ అంచనాలు అంతకంటే తక్కువగా ఉన్నప్పటికీ మహేష్ స్టార్ పవర్‌తో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే మహేష్ సినిమాకు వచ్చిన ఓపెనింగ్‌ను వెంకటేష్ సినిమాతో నేరుగా పోల్చలేం.
ఇక వెంకటేష్ గత సోలో సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయమే అందుకుంది. 2025 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా తొలి రోజు రూ.45 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. వెంకీ కెరీర్‌లో అప్పటివరకు ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్. ఆ తర్వాత సినిమా ఏకంగా రూ.250 కోట్ల మార్కును దాటింది. దీంతో 'ఆదర్శ కుటుంబం' కూడా కనీసం ఆ స్థాయి ఓపెనింగ్ అందుకుంటుందా అనే అంచనాలు ఉన్నాయి.
అయితే రెండు సినిమాల రిలీజ్ పరిస్థితులు వేరు. 'గుంటూరు కారం', 'సంక్రాంతికి వస్తున్నాం' రెండూ సంక్రాంతి సీజన్‌లో వచ్చాయి. పండగ సెలవులు, ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా బుకింగ్స్‌కు మంచి అవకాశం దక్కింది. కానీ 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 30న నార్మల్ శుక్రవారం విడుదలవుతోంది. పైగా వెంకటేష్‌కు గతంలో పనిచేసిన అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి, త్రివిక్రమ్ తీస్తున్న క్రైమ్ కామెడీకి తేడా ఉంది.
ఈసారి ఏపీలో టికెట్ రేట్ల పెంపుతో పాటు రోజుకు ఐదు షోలకు అనుమతి లభించింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 అదనంగా వసూలు చేసుకోవచ్చు. తొలి పది రోజుల పాటు ఈ అనుమతి ఉండటంతో మంచి ఆక్యుపెన్సీ నమోదైతే గ్రాస్ కలెక్షన్లకు ఉపయోగపడుతుంది. అయితే తొలి రోజు వసూళ్లలో టికెట్ ధరలతో పాటు ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు, అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయనేది కూడా ముఖ్యం.
'ఆదర్శ కుటుంబం'కు విదేశాల్లో వచ్చే ఓపెనింగ్స్ కూడా కీలకం కానున్నాయి. త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్‌లో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. వెంకటేష్ ఫ్యామిలీ కథలకు అక్కడి తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ లభిస్తోంది. అయితే విడుదల తేదీలు మారడంతో ముందుగా ప్లాన్ చేసిన ఓవర్సీస్ బుకింగ్స్‌ను సైతం మళ్లీ సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఇక అక్టోబర్ 29న జరిగే ప్రీమియర్స్, అక్టోబర్ 30 తొలి రోజు షోల ఆక్యుపెన్సీతో ఈ కాంబినేషన్ ప్రారంభ వసూళ్లపై క్లారిటీ రానుంది. కనీసం 60 కోట్ల ఓపెనింగ్ అయిన అందుకుంటేనే ఈ కాంబోకు సరైన స్టార్ట్ లభిస్తుంది. చూడాలి మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందో.
