Begin typing your search above and press return to search.

షిఫ్ట్ ఇన్ ట్రెండ్: 2026లో 'A' రేటెడ్ సినిమాల‌దే హ‌వా

ఇటీవల విడుదలైన 'మిర్జాపూర్ ది మూవీ', 'ధురంధర్', 'అబ్సెషన్', 'ది ఒడిస్సీ' వంటి చిత్రాలు కంటెంట్ బలంగా ఉంటే సర్టిఫికేట్ అనేది విజయానికి అడ్డంకి కాదని నిరూపించాయి.

By:  Sivaji Kontham   |   9 Sept 2026 7:00 AM IST
షిఫ్ట్ ఇన్ ట్రెండ్: 2026లో A రేటెడ్ సినిమాల‌దే హ‌వా
X

యు, యుఏ స‌ర్టిఫికెట్లు ఉంటే కుటుంబ స‌మేతంగా సినిమాని వీక్షించ‌వ‌చ్చు. కానీ ఇండియ‌న్ సినిమాలో ద‌శాబ్ధాలుగా A (పెద్ద‌ల‌కు మాత్ర‌మే) సర్టిఫికేట్ వస్తే బాక్సాఫీస్ వసూళ్లు తగ్గిపోతాయని.. కుటుంబ ప్రేక్షకులు దూరమవుతారని నిర్మాతలు- పంపిణీదారులకు తీవ్రమైన భయం ఉండేది. అయితే 2026 నాటికి ప్రేక్షకుల అభిరుచుల్లో అనూహ్య‌ మార్పులు వచ్చి ఏ-రేటింగ్ ఉన్న సినిమాలు భారీ బ్లాక్‌బస్టర్లుగా నిలుస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'మిర్జాపూర్ ది మూవీ', 'ధురంధర్', 'అబ్సెషన్', 'ది ఒడిస్సీ' వంటి చిత్రాలు కంటెంట్ బలంగా ఉంటే సర్టిఫికేట్ అనేది విజయానికి అడ్డంకి కాదని నిరూపించాయి.

సినిమా సక్సెస్‌ను నిర్ణయించేది కేవలం క‌థ‌-కథనమే తప్ప సెన్సార్ సర్టిఫికేట్ కాదని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ట్రేడ్ అనలిస్ట్ త‌ర‌ణ్‌ ఆదర్శ్ అభిప్రాయం ప్రకారం...ప్రేక్షకులు కంటెంట్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదాహరణకు `ధురంధర్` చిత్రం ఏ-సర్టిఫికేట్ పొందినా బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక వసూళ్లను సాధించింది. గతంలో U (యూనివ‌ర్శ‌ల్) సర్టిఫికేట్ వస్తే విజయం ఖాయమనుకునేవారు.. కానీ ఇప్పుడు కేవలం ఫ్యామిలీ రేటింగ్ ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడటం లేదని విశ్లేషణ సాగుతోంది.

నేటి యువతలో A-సర్టిఫికేట్ అనేది సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచే అంశంగా మారింది. ట్రేడ్ నిపుణుడు కోమల్ నహతా మాట్లాడుతూ... సినిమాల్లో ఉండే సహజమైన సంభాషణలు.. కథలోని రా అండ్ ర‌స్టిక్ కంటెంట్ యూత్ నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో వారు ఈ చిత్రాలను చూడటానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీనికి తోడు చిన్న నగరాలు, పట్టణాల్లో వయస్సు తనిఖీలు అంత కఠినంగా ఉండకపోవడం వల్ల అనుకున్నదానికంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ సినిమాలు చేరువవుతున్నాయి.

OTT డిజిటల్ వేదికల విస్తరణ కూడా ప్రేక్షకుల ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఓటీటీలలో పవర్ ఫుల్- బోల్డ్ కంటెంట్‌ను చూసేందుకు వీక్షకులు అలవాటు పడటంతో.. వెండితెరపై కూడా కథలో ఇంటెన్సిటీని తగ్గించకుండా తెరకెక్కించేందుకు దర్శకులు ధైర్యం చేస్తున్నారు. `UA` సర్టిఫికేట్ కోసం కథలో రాజీ పడకుండా తమ భావాలను యథాతథంగా ఆవిష్కరించేందుకు దర్శకనిర్మాత‌లు ముందడుగు వేస్తున్నారు.

గతంలో రణ్‌బీర్ కపూర్ నటించిన `యానిమల్` (2023) సాధించిన ఘనవిజయం.. A-సర్టిఫికేట్ చిత్రాలు కూడా వందల కోట్ల వసూళ్లను సాధించగలవని మార్గం సుగమం చేసింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు `ధురంధర్` - `మిర్జాపూర్ ది మూవీ` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నాయి. 2026లో ఏ-రేటెడ్ సినిమాలు సాధిస్తున్న ఈ విజయాలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరింత ధైర్యమైన వినూత్నమైన కథాంశాలను స్వీకరించే దిశగా సాగుతోంది.