80s రీ యూనియన్‌కు స్పెషల్ ఫ్లైట్‌లో చిరు-వెంకీ.. మరి బాలకృష్ణ?
సహజ నటనతో ఆకట్టుకున్న చివరి తరం వీరిదే అనికూడా చెప్పొచ్చేమో..? మరి ఇలాంటి వారంతా ఒకదగ్గర చేరితే..? ఆ ఆలోచనే 80s రీ యూనియన్.
By: Tupaki Entertainment Desk | 5 Oct 2025 9:27 AM IST1980వ దశకం... భారతదేశ చలనచిత్ర రంగంలో ఎందరో సూపర్ స్టార్ హీరోలను అందించిన దశకం..! హీరోల్లో బాలీవుడ్‌లో అనిల్ కపూర్, జాకీష్రాఫ్, తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, తమిళంలో రజనీకాంత్, కమల్‌హాసన్, ప్రభు, భాగ్యరాజ్, సత్యరాజ్, అర్జున్, కన్నడలో అంబరీశ్..! హీరోయిన్లలో ఖష్బూ, రాధిక, సుహాసిని మణిరత్నం, లిజీ, జయసుధ, జయప్రద, రమ్యకృష్ణ, రేవతి, శోభన, రాధ, అంబిక, సుమలత ఇలా ఎందరో మేటి నటులు పుట్టుకొచ్చిన దశకం. వాస్తవంగా చెప్పాలంటే వీరంతా భారత దేశ స్థాయి నటులు. సహజ నటనతో ఆకట్టుకున్న చివరి తరం వీరిదే అనికూడా చెప్పొచ్చేమో..? మరి ఇలాంటి వారంతా ఒకదగ్గర చేరితే..? ఆ ఆలోచనే 80s రీ యూనియన్.
సుహాసిని, లిజీ, ఖుష్బూ కృషితో..
అలనాటి మేటి హీరోయిన్లు సుహాసిని, లిజీ, ఖుష్బూ కృషితో మొదలైంది 80s రీ యూనియన్. అనేక సినీ పరిశ్రమల నుంచి 1980లలో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నటీనటులు చాలామంది ఉన్నారు. సుహాసిని, లిజీ, ఖుష్బూ ఆలోచనలతో తొలిసారిగా 2009లో మొదలైంది. 1980ల్లో కెరీర్ ప్రారంభించిన, ఊపందుకున్నవారితో కూడిన ఈ సంఘంలో ఏటా నటీనటులంతా ఏదో ఒక కలర్ కోడ్ థీమ్‌తో పాల్గొని ఆటపాటలతో సందడి చేస్తారు. కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో బ్లాక్ థీమ్‌తో హాజరయ్యారు. 2015లో రెడ్ కలర్ థీమ్, 2017లో డీప్ పర్పుల్‌ను పాటించారు.
ఈ ఏడాది చెన్నైలో...
80s రీ యూనియన్‌కు ఈ ఏడాది వేదిక చెన్నై. వేదిక ఎక్కడ? ఎవరి ఇంట్లో అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఈ కార్యక్రమానికి తెలుగు స్టార్లు వెంకటేశ్, చిరంజీవి స్పెషల్ ఫ్లయిట్లో వెళ్లారు. వీరిద్దరూ ప్రయాణానికి ముందు తీసుకున్న ఫొటో బయటకు రాగా వైరల్ అయింది. చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్నారు. ఇందులో వెంకటేష్ కూడా ప్రధాన పాత్రధారి. మొదటినుంచే సన్నిహితులైన వీరిద్దరూ ఒక సినిమాలో కలిసి నటించడం తొలిసారి.
మరి బాలయ్య సంగతో...?
గతంలో జరిగిన 80s రీ యూనియన్‌కు బాలకృష్ణ కూడా హాజరయ్యారు. సరదాగా ఆడిపాడుతూ గ్రూప్ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. అసలు బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఉత్సాహం. తన చుట్టూ ఉన్నవారిలోనూ జోష్ నింపుతారని చెబుతుంటారు. అయితే, ఇటీవల ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. తన సహజ శైలిలో బాలకృష్ణ మాట్లాడినా.. అది ప్రజల్లోకి వేరేగా వెళ్లిందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిని సొమ్ము చేసుకోవాలని కొందరు ప్రయత్నించారు. అయితే, ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన ఈ పరిణామం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు.. చిరంజీవి తమ‍్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి సంభాషించారు. బాలకృష్ణ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆయన 80s రీ యూనియన్‌కు వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏమో.. సంచలనమే తన నైజమైన బాలయ్య అలా చేసినా చేస్తారేమో..? చిరంజీవిని కలుస్తారేమో? ఏం జరుగుద్దో చూద్దాం.
