Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో కాక టాలీవుడ్ లోనూ చ‌ర్చ‌!

తమిళ పరిశ్రమలో రగులుతున్న ఓటీటీ విండో వివాదం వేడి క్రమంగా తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా పాకుతోంది.

By:  Srikanth Kontham   |   24 Aug 2026 4:00 PM IST
కోలీవుడ్ లో కాక టాలీవుడ్ లోనూ చ‌ర్చ‌!
X

ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో ఓటీటీ విండో నిబంధన పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఇచ్చి మాత్రమే ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ చేస్తామని నిర్మాతలు రాతపూర్వక హామీ ఇస్తేనే ప్రదర్శిస్తామని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు పట్టుబడుతున్నారు. కొన్ని వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాల వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోతోందని, ఇది ఎగ్జిబిటర్లను తీవ్రంగా నష్టపరుస్తోందని వారు వాదిస్తున్నారు.

ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో కోలీవుడ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. ఓటీటీ ఆదాయమే ప్రధానమైన రోజుల్లో ఈ నిబంధన తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని నిర్మాతలు అంటుండగా, థియేటర్ల మనుగడకు ఇది అత్యంత కీలకమని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. ఇరువర్గాల మధ్య నెలకొన్న సందిగ్ధత కారణంగా సెప్టెంబర్ నుంచి కొత్త సినిమాల షూటింగ్‌లను కూడా బంద్ చేసే దిశగా సన్నాహాలు జ‌రుగుతున్నాయి.

తమిళ పరిశ్రమలో రగులుతున్న ఓటీటీ విండో వివాదం వేడి క్రమంగా తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా పాకుతోంది. అక్కడి పరిణామాలను గమనిస్తున్న టాలీవుడ్ ప్రముఖులు, ఇక్కడ కూడా ఇలాంటి కఠినమైన నిబంధనలను తీసుకురావడంపై అంతర్గతంగా చర్చలు మొద‌లైన‌ట్లు సమ‌చారం. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి .. నిర్మాతల మండలి ఈ అంశంపై స్పష్టమైన విధివిధానాన్ని రూపొందించే ఆలోచనలో మొద‌లైన‌ట్లు వినిపిస్తోంది.

పెద్ద సినిమాలతో పాటు చిన్న, మధ్యతరహా చిత్రాలు కూడా విడుదలైన తక్కువ కాలంలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమవుతుండటం తెలుగు థియేటర్ రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఓటీటీలో సినిమా వస్తుందనే ధీమాతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడాన్ని తగ్గించేస్తున్నారని టాలీవుడ్ ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీస థియేట్రికల్ రన్ గడువును ఖరారు చేయడం ద్వారానే బాక్సాఫీస్ నిలదొక్కు కుంటుందనే అభిప్రాయం బలపడుతోంది.

ఒకవేళ టాలీవుడ్‌లోనూ ఎనిమిది వారాల ఓటీటీ విండో రూల్ అమల్లోకి వస్తే అది నిర్మాతలకు, ఓటీటీ సంస్థలకు మధ్య పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. డిజిటల్ రైట్స్ ద్వారా భారీగా పెట్టుబడులు రాబట్టుకుంటున్న నిర్మాతలకు ఈ నిబంధన కొంత ఆర్థిక భారాన్ని కలిగించవచ్చు. అయితే లాంగ్‌రన్ లో థియేటర్ల మనుగడను కాపాడుకోవడానికి ఇది ఒక్కటే సరైన మార్గమని మెజారిటీ వర్గాలు వాదిస్తున్నాయి.

మొత్తానికి తమిళనాడులో ప్రారంభమైన ఓటీటీ విండో పోరాటం అక్కడికే పరిమితం కాకుండా టాలీవుడ్‌లోనూ తీవ్ర చర్చకు దారితీస్తోంది. మారుతున్న కాలానికి తగినట్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు , ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సమన్వయంతో అంగీకారానికి వస్తేనే చిత్ర పరిశ్రమ అన్ని వర్గాలకు సురక్షితంగా మారుతుంది.