రణవీర్ -ఆదిత్య ధర్‌లకు నేషనల్ అవార్డ్స్ ఎందుకు రావాలి?
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన సమయం దగ్గరపడుతున్న వేళ.. భారతీయ సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
By: Sivaji Kontham | 5 July 2026 7:47 AM IST72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన సమయం దగ్గరపడుతున్న వేళ.. భారతీయ సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న `ధురంధర్` చిత్రానికి గాను స్టార్ హీరో రణవీర్ సింగ్, ప్రతిభావంతుడైన దర్శకుడు ఆదిత్య ధర్‌లకు జాతీయ అవార్డులు ఎందుకు రావాలి? అనే అంశంపై నెటిజనులలో పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆస్కార్ గ్రహీత హాన్స్ జిమ్మర్ బృందంతో కలిసి పనిచేసిన అనుభవమున్న ప్రముఖ సంగీత దర్శకుడు శాశ్వత్ సచిదేవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వీరిద్దరూ కచ్చితంగా జాతీయ అవార్డులకు అర్హులని బలంగా నమ్ముతున్నట్లు వ్యాఖ్యానించి ఈ చర్చకు మరింత బలాన్ని చేకూర్చారు.
సంగీత దర్శకుడు శాశ్వత్ సచిదేవ్‌కు అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన గొప్ప అనుభవం ఉంది. హాలీవుడ్ దిగ్గజం హాన్స్ జిమ్మెర్ తో `ఎకోసిస్టమ్`, జేమ్స్ ఎవర్‌హామ్‌లతో కలిసి `విర్డీ` ప్రాజెక్ట్ కోసం ఆయన పనిచేశారు. అక్కడ కేవలం ఒక మ్యూజికల్ `ఇండియన్ లేయర్` యాడ్ చేయడానికి కాకుండా.. ఒక కంపోజర్‌గా తనకంటూ ఒక స్పష్టమైన దృక్పథాన్ని వినిపించడానికి వెళ్లినట్లు చెప్పారు. హాన్స్ జిమ్మెర్ బృందం నుండి తాను నేర్చుకున్న అతిపెద్ద పాఠం సంగీతంలో `క్లారిటీ` అని.. అక్కడ ప్రతి ధ్వనికి ఒక నిర్దిష్టమైన బాధ్యత ఉంటుందని సచిదేవ్ పేర్కొన్నారు. కథకు ఉపయోగపడనిది ఎంత అందంగా ఉన్నా వారు నిర్దాక్షిణ్యంగా తీసేస్తారని.. ఆ క్రమశిక్షణే తనను ఎంతగానో ప్రభావితం చేసిందని వివరించారు.
ఆ అంతర్జాతీయ అనుభవంతోనే శాశ్వత్ సచిదేవ్ `ధురంధర్` చిత్రానికి ఒక అద్భుతమైన మ్యూజికల్ వరల్డ్‌ను క్రియేట్ చేశారు. ఈ సినిమా కేవలం ఒక యాక్షన్ లేదా దేశభక్తి చిత్రం మాత్రమే కాదని.. దీని వెనుక ఒక రకమైన దాగి ఉన్న బాధ లేదా గాయం ఉందని గుర్తించారు. అందుకే దీని సంగీతం కేవలం పైపైన హీరోయిజంలా కాకుండా మెటల్, శ్వాస, మట్టి, ఎలక్ట్రానిక్స్ - జానపద స్మృతుల కలయికగా డిజైన్ చేసినట్లు తెలిపారు. దర్శకుడు ఆదిత్య ధర్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్తూ.. తామిద్దరూ ట్యూన్స్ గురించి మాట్లాడటానికి ముందే పాత్రల భావోద్వేగాలు - మైథాలజీ గురించి ఎక్కువగా చర్చిస్తామని.. ఆదిత్య ధర్ సంగీతాన్ని కథ చెప్పే ఒక బలమైన సాధనంగా భావిస్తారని వెల్లడించారు.
దర్శకుడు ఆదిత్య ధర్‌కు జాతీయ అవార్డు ఎందుకు రావాలనే విషయమై శాశ్వత్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపారు. ఆదిత్య ధర్ కేవలం స్కేల్ లేదా భారీతనం మాత్రమే కాకుండా.. ఎమోషన్ వెనుక ఉన్న వ్యాకరణం (గ్రామర్ ఆఫ్ ఎ సీన్) పూర్తిగా తెలిసిన దర్శకుడని కొనియాడారు. స్క్రీన్‌పై ఎప్పుడు కథను ఆపాలి? ఎప్పుడు ప్రేక్షకుడిపై బలమైన ప్రభావం చూపించాలి? అనే స్పష్టత ఆయనకు చాలా ఎక్కువ అని ప్రశంసించారు. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా కథలోని ఆత్మను పట్టుకుని సినిమాను ముందుకు నడిపించిన ఆదిత్య ధర్ మేకింగ్ శైలి కచ్చితంగా జాతీయ స్థాయి గుర్తింపునకు అర్హమైనదని శాశ్వత్ అభిప్రాయపడ్డారు.
ఇక రణవీర్ సింగ్ నటన విషయానికి వస్తే... రణవీర్ అనగానే అందరికీ అతడి ఎనర్జీ మాత్రమే గుర్తుకొస్తుంది.. కానీ ఈ సినిమాలో అతడు చూపించిన నియంత్రణ (కంట్రోల్డ్ పెర్ఫామెన్స్) అద్భుతమని శాశ్వత్ కొనియాడారు. రణవీర్ తన నటనలో వెయిట్‌ను.. సెన్సిటివిటీని... ఒక రకమైన ప్రమాదాన్ని ఒకేసారి చాలా అద్భుతంగా పండించారని.. ఇది చాలా సీరియస్‌గా రిస్క్ తీసుకుని చేసిన వర్క్ అని ప్రశంసించారు. తన సహజమైన శైలికి భిన్నంగా రణవీర్ సింగ్ ఇందులో చూపించిన నటనలోని వైవిధ్యం .. ఆదిత్య ధర్ అందించిన అద్భుతమైన స్క్రీన్ ప్లేల కలయిక వల్లే `ధురంధర్` చిత్రం ఈ స్థాయిలో నిలిచిందని.. అందుకే వీరిద్దరికీ ఈసారి జాతీయ అవార్డులు దక్కాలని సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
