70MM ఎంటర్టైన్మెంట్స్.. ఒకేసారి ఏకంగా ఆరు సినిమాలు..
టాలీవుడ్ నిర్మాణ సంస్థ 70MM ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గురించి అందరికీ తెలిసిందే. పదేళ్ల క్రితం నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఆ ప్రొడక్షన్ హౌస్ ను 2015లో స్థాపించారు.
By: M Prashanth | 10 Aug 2025 4:38 PM ISTటాలీవుడ్ నిర్మాణ సంస్థ 70MM ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గురించి అందరికీ తెలిసిందే. పదేళ్ల క్రితం నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఆ ప్రొడక్షన్ హౌస్ ను 2015లో స్థాపించారు. అదే ఏడాది సుధీర్ బాబు , వామిక గబ్బి, సాయి కుమార్ నటించిన క్రైమ్ కామెడీ భలే మంచి రోజు మూవీని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
భలే మంచి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడంతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 2017లో ఏడాది తర్వాత ఆనందో బ్రహ్మ కామెడీ హారర్ మూవీ తీసుకొచ్చింది 70MM ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. చిన్న బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా.. రూ.15 కోట్ల వసూళ్లు సాధించి 2017లో హిట్స్ జాబితాలో చోటు సంపాదించింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర సినిమాను నిర్మించిన 70MM ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. నాలుగేళ్ల క్రితం శ్రీదేవి సోడా సెంటర్ ను రూపొందించింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఆ బ్యానర్.. ఇప్పుడు ఏకంగా ఆరు కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేసింది.
ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను ప్రకటించడం ద్వారా సాహసోపేతమైన అడుగు వేసింది. ఎల్లప్పుడూ నాణ్యమైన వినోదాన్ని అందించాలనే టార్గెట్ తో ఉండే 70MM సంస్థ.. ఇప్పుడు తమ పంథాలో ముందుకెళ్తోంది. ఆరు ప్రాజెక్టులను అనౌన్స్ చేయడమే కాకుండా.. వాటికి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించింది.
అయితే ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడారు. నాణ్యమైన కంటెంట్ ను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రతి చిత్రం ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమా అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల తారాగణం, సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
అదే సమయంలో పైరసీ పెరుగుతుండటం, నాణ్యమైన కంటెంట్ లేకపోవడం, సరైన థియేటర్ కలెక్షన్లు లేకపోవడం వంటి సమస్యలతో చిత్ర పరిశ్రమ అనేక సమస్యలు ఎదుర్కొంటోందన్న విషయం తెలిసిందే. కానీ నాణ్యమైన నిర్మాణం ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువస్తుందని చాలా మంది నిర్మాతలు నిరూపిస్తున్నారు. ఇప్పుడు 70MM సంస్థ కూడా అదే ప్రూవ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
