40 ఏళ్ల తర్వాత రజనీ-కమల్ కలయికలో.. షాకిస్తున్న బడ్జెట్!
భారతీయ సినీ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇద్దరు దిగ్గజాలు రజనీకాంత్ -కమల్ హాసన్ కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక అధికారిక అప్‌డేట్ వచ్చింది.
By: Sivaji Kontham | 20 Feb 2026 8:30 AM ISTభారతీయ సినీ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇద్దరు దిగ్గజాలు రజనీకాంత్ -కమల్ హాసన్ కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక అధికారిక అప్‌డేట్ వచ్చింది. రెడ్ జియాంట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ మెగా మూవీకి సంబంధించిన తాజా విశేషాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
రజనీ-కమల్ హాసన్ కలయికలో ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ అధికారికంగా ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 12:07 గంటలకు లాంచ్ కానుంది. ఈ రోజు (ఫిబ్రవరి 19) రాత్రి 7:12 గంటలకు విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ 7:12 టైమ్‌నే ఎందుకు ఎంపిక చేసారు? అంటే.... కమల్ హాసన్ పుట్టినరోజు నవంబర్ 7ని, రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12ని సూచిస్తుందని కోలీవుడ్ మీడియా విశ్లేషిస్తోంది.
ఈ భారీ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల లోకేష్ కనగరాజ్ పేరు వినిపించినా, చివరికి `జైలర్` ఫేం నెల్సన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. దీనిని సుమారు 600 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని కథనాలొస్తున్నాయి. కేవలం రజనీకాంత్ రెమ్యునరేషనే 225 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం.
కథానాయికల ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. లాంచింగ్ తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా కొనసాగనుంది.
ఇది ఒక లైట్ హార్టెడ్ యాక్షన్ కామెడీ డ్రామా. స్నేహం నేపథ్యంగా సాగే ఈ సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్లు సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరిపై ఒక 80ల నాటి రెట్రో స్టైల్ ప్రోమో షూట్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ 2026 ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి ప్రారంభం కానుంది. 2027 సంక్రాంతి కానుకగా దీనిని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా పోస్టర్ లో ట్యాగ్ లైన్ ఆసక్తిని కలిగించింది. స్టార్లు కలిసినప్పుడు.. మీరు పక్షపాతం చూపలేరు! అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా వస్తోంది. 1981లో వచ్చిన `తిల్లు ముల్లు` తర్వాత వీరిద్దరూ కలిసి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా ఇదే. దాదాపు 40ఏళ్లకు ఇది సాధ్యమవుతోంది.
