Begin typing your search above and press return to search.

దేశం అట్టుడుకుతోన్న వేళ‌ త్రీ ఇడియ‌ట్స్ రీ-రిలీజ్!

ప్రస్తుతం దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వేదికగా విద్యా రంగానికి వ్యతిరేకంగా విద్యార్థుల హక్కుల కోసం జరుగుతోన్న ఆందోళనలతో దేశం అట్టుడుకుతోంది.

By:  Srikanth Kontham   |   23 July 2026 12:12 PM IST
దేశం అట్టుడుకుతోన్న  వేళ‌ త్రీ ఇడియ‌ట్స్ రీ-రిలీజ్!
X

ప్రస్తుతం దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వేదికగా విద్యా రంగానికి వ్యతిరేకంగా విద్యార్థుల హక్కుల కోసం జరుగుతోన్న ఆందోళనలతో దేశం అట్టుడుకుతోంది. యువత రోడ్డెక్కి తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్న సున్నితమైన తరుణంలో బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ చిత్రం `త్రీ ఇడియట్స్` మళ్లీ థియేటర్లలోకి రానుందన్న ప్రచారం ఊపందుకోవడం చర్చనీయాంశమైంది. విద్యా వ్యవస్థలోని లోపాలు, విద్యార్థులపై ఉండే ఒత్తిళ్లు , ప్రశ్నించే తత్త్వాన్ని బలంగా ఆవిష్కరించిన ఈ సినిమా రీ-రిలీజ్ వార్త ప్రస్తుత వాతావరణంలో సరికొత్త చర్చకు తెరలేపింది.

దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమవుతున్న సమయంలో అచ్చం అలాంటి భావోద్వేగాలనే ప్రతిబింబించే త్రీ ఇడియట్స్ లాంటి చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం ప్రస్తుత పరిస్థితులకు అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ విద్య, మార్కుల ఒత్తిడి, వ్యవస్థలోని అసమానతలను ప్రశ్నించే సినిమాలోని ప్రతీ సన్నివేశం నేటి యువత ఆవేదనతో నేరుగా కనెక్ట్ అవుతుంది. అందుకే ఈ ప్రచారం కేవలం సినిమా రీ-రిలీజ్‌గా కాకుండా ప్రస్తుత ఉద్యమానికి మరింత ఊతమిచ్చే సామాజిక పరిణామంగా మారుతోంది.

నిజానికి విధు వినోద్ చోప్రా వంటి మేకర్స్ రీ-రిలీజ్ వార్తలను కొట్టిపారేసినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రిలీజ్ చర్చ ఆగడం లేదు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న పోరాటాలను `త్రీ ఇడియట్స్` చిత్రంలోని రంచో, ఫర్హాన్, రాజు, సోన‌మ్ వాంగ్ చుక్ పాత్రల ఆవేదనను ముడిపెడుతూ నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. సినిమాలోని `సక్సెస్ వెంట వెళ‌క్ల‌కండి. ఎక్సలెన్స్ వెంట వెళ్ళండి` అనే నినాదం నేడు రోడ్లపై నిరసన తెలుపుతున్న ప్రతీ విద్యార్థి గొంతుకగా మారుతుండటం గమనార్హం.

ఈ సమయంలో నిజంగానే సినిమా థియేటర్లలోకి వస్తే అది యువతలో మరింతగా ఉత్తేజాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలకు సమాజాన్ని చైతన్యపరిచే శక్తి ఉంటుందని, అందునా ఇలాంటి భావాలున్న సినిమాలు ప్రస్తుత రాజకీయ , సామాజిక సంక్షోభాల మధ్య మరింత లోతైన ప్రభావాన్ని చూపుతాయి. యువతను ఆలోచింపజేసే ఏ అంశమైనా ? ఈ సమయంలో కార్చిచ్చులా వ్యాపించే అవకాశం ఉంది.

ప్రభుత్వాలు ... వ్యవస్థల తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఇలాంటి చలనచిత్రాల ప్రస్తావన రావడమే పాలకులకు హెచ్చరికగా మారుతోంది. విద్యా వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటూ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి, కళారూపాలు కూడా అద్దం పడుతున్నాయని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. అధికార వర్గాలు ఈ సంకేతాలను ఎంతవరకు అర్థం చేసుకుంటాయ‌నేది చూడాలి.

మొత్తానికి, దేశం మొత్తం ఒక సున్నితమైన సామాజిక చైతన్యంతో కదులుతున్న ఈ తరుణంలో 'త్రీ ఇడియట్స్' రీ-రిలీజ్ ప్రచారం కేవలం వినోద వార్తగా కాకుండా, యువత ఆగ్రహానికి మరియు ఆశలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ప్రచారం సృష్టించే తరంగాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకు నాంది పలికనుందో కాలమే నిర్ణయించాలి.