Begin typing your search above and press return to search.

'3 ఇడియ‌ట్స్‌' సీక్వెల్ ముహూర్తం ఎప్పుడంటే?

ఇప్ప‌టికే `త్రి ఇడియ‌ట్స్ 2` స్క్రిప్టును రాజ్ కుమార్ హిరాణీ సిద్ధం చేసాడు. 2026 ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నాడు.

By:  Sivaji Kontham   |   9 Dec 2025 3:00 AM IST
3 ఇడియ‌ట్స్‌ సీక్వెల్ ముహూర్తం ఎప్పుడంటే?
X

కాలేజ్ లైఫ్, ఫ్రెండ్షిప్ నేప‌థ్యంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. కానీ ఇదే కాన్సెప్టుతో రాజ్ కుమార్ హిరాణీ తెర‌కెక్కించిన `3 ఇడియ‌ట్స్` చూపించిన ప్ర‌భావం అంతా ఇంతా కాదు. అమీర్ ఖాన్, మాధ‌వ‌న్, శ‌ర్మాన్ జోషి, క‌రీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా 2009లో థియేటర్లలో విడుదలైంది. ఇది బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 400 కోట్లు వ‌సూలు చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం. 15 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా నేటికీ స్ఫూర్తిని నింపుతూనే ఉంది. ఇంత కాలానికి దీనికి సీక్వెల్ తెర‌కెక్క‌నుంది.

ఇప్ప‌టికే `త్రి ఇడియ‌ట్స్ 2` స్క్రిప్టును రాజ్ కుమార్ హిరాణీ సిద్ధం చేసాడు. 2026 ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. సీక్వెల్ లోను మునుప‌టి న‌టులు తిరిగి న‌టిస్తారు. ఇది మొదటి భాగం లానే ఫన్నీగా, భావోద్వేగంగా, అర్థవంతంగా ఉంటుంద‌ని కూడా తెలుస్తోంది. సీక్వెల్ కథ కొనసాగింపుగా ఉంటుంది. 2009 చిత్రం క్లైమాక్స్ సన్నివేశంలో రాంచో, ఫర్హాన్, రాజు పాత్రలు విడిపోయినట్టు చూపించ‌గా, దానికి కొన‌సాగింపు భాగాన్ని తెర‌పై చూపించ‌బోతున్నారు.

నిజానికి `త్రి ఇడియ‌ట్స్` సీక్వెల్ ఆలోచ‌న దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ఆగిపోయిన తర్వాత తిరిగి ఉత్సాహంగా మొద‌లైంది. ప్ర‌స్తుతం స్క్రిప్టును పూర్తి స్థాయిలో మ‌లిచే ప‌నిలో ఉన్నారు. ఈసారి కూడా ఒరిజిన‌ల్ కి కొనసాగింపుగా అద్భుత‌మైన స్క్రిప్టు రెడీ చేయాల‌ని హిరాణీ ప్ర‌య‌త్నిస్తున్నారు. నిజానికి స్క్రిప్ట్‌తో సంతృప్తి చెందకపోవడంతో వారి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌ను ప్రస్తుతానికి హిరాణీ నిలిపివేసార‌ని కూడా తెలిసింది.

2009లో త్రి ఇడియ‌ట్స్ విడుద‌లైంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్, కరీనా కపూర్ ఖాన్, బోమన్ ఇరానీ, మోనా సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకోవ‌డ‌మే గాక బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను సాధించింది. స్నేహం కాలేజ్ లైఫ్ నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే క‌థాంశంతో ఈ సినిమాని హిరాణీ తెర‌కెక్కించారు. ఇందులో నటీన‌టుల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌లకు ప్ర‌శంస‌లు కురిసాయి. ఈ చిత్రం ఆర్జ‌న‌లోనే కాదు, యువతపై శాశ్వత ప్రభావాన్ని చూప‌డంలోను విజ‌య‌వంత‌మైంది.