ఇలా టార్గెట్ చేస్తే మిగతా సీజన్ల పరిస్థితి ఏంటి?
స్టార్ హీరోలు సంక్రాంతి సీజన్ ఒక్కటే టార్గెట్ చేస్తున్నారా? మిగతా పండగలను సరైన రిలీజ్ సీజన్లగా భావించడం లేదా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది.
By: Srikanth Kontham | 16 Feb 2026 5:00 PM ISTస్టార్ హీరోలు సంక్రాంతి సీజన్ ఒక్కటే టార్గెట్ చేస్తున్నారా? మిగతా పండగలను సరైన రిలీజ్ సీజన్లగా భావించడం లేదా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. 2027 సంక్రాంతిని అప్పుడే సీనియర్ హీరోలు ఖర్చీప్ వేసేసారు. చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. అలాగే నటసింహ బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న చిత్రాన్ని కూడా కూడా అదే సీజన్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అలాగే మరో సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేస్ చిత్రాన్ని కూడా అప్పుడే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఇదీ అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం కావడంతో పక్కాగా పండక్కే వస్తుంది. ఇంకా కింగ్ నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ కాంబినేషన్ లో సినిమా అంటే? అది కచ్చితంగా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి. ఈ నేపథ్యంలో 2027 సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇంత పోటీ ఉన్నా? జూనియర్ హీరోలు సైతం పోటీగా బరిలోకి దిగుతున్నారు. శర్వానంద్ హీరోగా నటించనున్న 39వ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రమిది. తేజ సజ్జా హీరోగా నటించనున్న `జాంబిరెడ్డి 2`ని కూడా అప్పుడే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
అలాగే మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా సంక్రాంతి సమీపంలోనే ప్రేక్షకుల ముందుకు రావాలని తహ తహలాడుతున్నారు. వీరితో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రాన్ని కూడా అప్పుడే రిలీజ్ చేయాలను కుంటున్నారుట. ఇలా హీరోలంతా సంక్రాంతి మీద పడటంతో? మిగతా పండగలు..కీలకమైన సీజన్లు ఏమైపోవాలి? అన్నది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ సినిమాలన్నీ పండగ వరకూ ఆగి రిలీజ్ చేసే అంత సన్నివేశం లేదు. ఇవేమీ భారీ ప్రాజెక్ట్ లు కాదు. అంత స్పాన్ ఉన్న కథలు కాదు..మూడు నాలుగు నెలల్లో షూటింగ్ చుట్టేసి నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి రిలీజ్ చేసే అవకాశం ఉన్న కథలే.
కానీ ఆ ఛాన్స్ తీసుకోవడానికి ఏ దర్శక, హీరో ముందుకు రావడం లేదు. తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. వేసవి సీజన్...దసరా, దీపావళి, క్రిస్మస్ సహా మధ్యలో హాలీడేస్ వచ్చే సీజన్లు కొన్ని ఉన్నాయి. కానీ వాటిని రిలీజ్ కు హీరోలెవరు అనుకూలంగా భావించడం లేదు. ఎంత పోటీ ఉన్నా కలి సొచ్చిన సంక్రాంతి సీజనే కావాలంటున్నారు. కానీ ఇలా పట్టు బటట్టడం అన్నది అన్ని వేళలా కలిసి రాదు. పోటీ ఎక్కువైతే థియేటర్లు సర్దుబాటు కష్టమవుతుంది. హిట్ అయినా ఆ సినిమాకు సరైన కలెక్షన్స్ రావడం కష్టంగా మారుతుంది.
