2027లో బిగ్ ఫైట్.. కలెక్షన్ల కంటే రికవరీపైనే అసలు టెన్షన్!
ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ రిస్క్ భారీ బడ్జెట్ సినిమాలదే. నిర్మాణ వ్యయం పెరగడం మాత్రమే కాదు, రిలీజ్ కు ముందే డిజిటల్
By: Sravani Lakshmi Srungarapu | 25 July 2026 3:05 PM ISTభారతీయ సినీ పరిశ్రమకు 2027 రెగ్యులర్ రిలీజ్ క్యాలెండర్ కాదు. ఇప్పటికే అనౌన్స్ చేసిన ప్రాజెక్టులను పరిశీలిస్తే, నెక్ట్స్ ఇయర్ పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్న భారీ సినిమాల సంఖ్య గణనీయంగా కనిపిస్తోంది. తెలుగు, హిందీ సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు, అగ్ర డైరెక్టర్లు, వందల కోట్ల పెట్టుబడులతో సిద్ధమవుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకదానితో ఒకటి పోటీ పడేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఈ పోటీలో ఎవరు ఎక్కువ కలెక్షన్లు సాధిస్తారు? అనేది మాత్రమే కాదు. ఎవరు తమ పెట్టుబడిని సేఫ్ గా రికవర్ చేసుకుంటారు? అనే ప్రశ్నే ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో మెయిన్ డిస్కషన్ గా మారుతోంది.
2026లో పెద్ద సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడినా, వాటిలో కొన్ని మాత్రమే ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ ను అందుకోగలిగాయి. స్టార్ పవర్ ఒక్కటే సరిపోదని, ఆడియన్స్ స్ట్రాంగ్ కంటెంట్‌కు మాత్రమే రెస్పాండ్ అవుతున్నారని ఈ ఇయర్ రిజల్ట్స్ స్పష్టంగా తెలియచేశాయి. అదే కారణంగా 2027పై ఆశలు పెరిగినా, ఆ ఆశలతో పాటు ప్రెజర్ కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది.
నెక్ట్స్ ఇయర్ రిలీజ్ షెడ్యూల్ ను పరిశీలిస్తే పాన్ ఇండియా బ్రాండ్‌తో రిలీజ్ కానున్న సినిమాలు వరుసగా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి భారీ అంచనాల మధ్య రానున్న స్పిరిట్, వారణాసి ప్రాజెక్టులు, బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్- వంశీ పైడిపల్లి మూవీ, ఫోర్స్3, రాయామణ2, మహావతార్ పరశురామ్ లాంటి ప్రతిష్ఠాత్మక సినిమాలు, ఇప్పటికే సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీల సీక్వెల్స్ అన్నీ ఒకే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రావడం మార్కెట్‌ను మరింత పోటీగా మార్చనుంది. ముఖ్యంగా ఒకే నెలలో లేదా తక్కువ గ్యాప్ తో రిలీజయ్యే సినిమాలకు థియేటర్ల లభ్యత, ప్రీమియం స్క్రీన్ల కేటాయింపు, అడ్వాన్స్ బుకింగ్స్, ఓవర్సీస్ మార్కెట్ వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ రిస్క్ భారీ బడ్జెట్ సినిమాలదే. నిర్మాణ వ్యయం పెరగడం మాత్రమే కాదు, రిలీజ్ కు ముందే డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్ హక్కుల ద్వారా భారీ బిజినెస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సినిమా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ సాధించకపోతే రికవరీపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మరోవైపు, క్లాష్‌లు కూడా నిర్మాతలకు పెద్ద పరీక్షగానే మారవచ్చు. ఒకే ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకున్న రెండు భారీ సినిమాలు ఒకే సమయంలో వస్తే, కలెక్షన్లతో పాటు స్క్రీన్ షేరింగ్‌పైనా ఎఫెక్ట్ తప్పదు.
ఇక 2027 మూవీ రేస్‌లో మరో ఆసక్తికర అంశం డైరెక్టర్ల మధ్య పోటీ. భారీ విజన్‌తో సినిమాలు తెరకెక్కిస్తున్న డైరెక్టర్లు, పాన్ ఇండియా ఇమేజ్ కలిగిన హీరోలు, భారీ స్థాయిలో రిలీజయ్యే సినిమాలు.. ఇవన్నీ కలిపి మార్కెట్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చనున్నాయి. అయితే ఎవరెన్ని ప్లాన్స్ వేసినా చివరికి గెలిచేది స్టార్ ఇమేజ్ కాదు, కంటెంట్‌కు ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్సే అని ట్రేడ్ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అందుకే 2027ను కేవలం స్టార్ హీరోల పోటీగా చూడడం కంటే, భారతీయ సినీ పరిశ్రమ బిజినెస్ మోడల్‌కు కీలకమైన పరీక్షగా చూడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ పెట్టుబడులు, భారీ అంచనాలు, పాన్ ఇండియా రిలీజ్‌లు, క్లాష్‌లు.. ఈ నాలుగు అంశాల మధ్య నిలబడి బాక్సాఫీస్ వద్ద ఎవరు నిజమైన విజేతగా నిలుస్తారన్నది వచ్చే ఏడాది అత్యంత ఆసక్తికరంగా మారనుంది.
