Begin typing your search above and press return to search.

2027: ఇండియన్ సినిమాకి గోల్డెన్ ఇయర్.. లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్!

ఇప్పటికే అనౌన్స్ చేసిన ప్రాజెక్టుల వివరాలను బట్టి చూస్తే, 2027 సంవత్సరం సినీ ప్రియులకు మంచి కిక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

By:  M Prashanth   |   10 Dec 2025 4:00 PM IST
2027: ఇండియన్ సినిమాకి గోల్డెన్ ఇయర్.. లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్!
X

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా ఏ స్థాయిలో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రాబోయే రెండేళ్లలో రానున్న సినిమాల జాబితా చూస్తుంటే, ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయిని టచ్ చేయబోతుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే అనౌన్స్ చేసిన ప్రాజెక్టుల వివరాలను బట్టి చూస్తే, 2027 సంవత్సరం సినీ ప్రియులకు మంచి కిక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలందరూ బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో కాంపిటీషన్ పీక్స్ లో ఉండబోతోంది.

కొందరు అగ్ర దర్శకులు ఎక్కువగా మైథాలజీ, హిస్టారికల్ కాన్సెప్ట్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. కేవలం రెగ్యులర్ మాస్ మసాలా కథలు కాకుండా, మన ఇతిహాసాలను, చరిత్రను ఇప్పటి టెక్నాలజీతో వెండితెరపై ఆవిష్కరించడానికి పోటీ పడుతున్నారు. ఈ మార్పు భారతీయ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం. ఆ ఏడాది రాబోయే సినిమాల లిస్ట్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే.

ఈ రేసులో అందరి కళ్ళు ప్రధానంగా రెండు సినిమాల మీద ఉన్నాయి. అందులో మొదటిది దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న 'వారణాసి'. ఇది ఒక డివైన్ అడ్వెంచర్ గా ఉండబోతోందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక రెండోది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్'. ఇందులో ప్రభాస్ ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ రెండు సినిమాలు 2027లోనే వచ్చే అవకాశం ఉంది.

వీటితో పాటు నితీష్ తివారీ రూపొందిస్తున్న 'రామాయణ' పార్ట్-2పై కూడా మంచి హైప్ ఉంది. సాయి పల్లవి, రణవీర్, యశ్ కాంబినేషన్ కాబట్టి ఆడియెన్స్ ఎగబడి చూడడం పక్కా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న 'AA 22' కూడా ఇదే ఏడాది బాక్సాఫీస్ జాతర చేయడానికి సిద్ధమవుతున్నాయి. అట్లీ మొదటిసారి చేస్తున్న బిగ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఇది. అలాగే బాహుబలి ఫ్రాంచైజీ నుంచి 'ది ఎటర్నల్ వార్', హిస్టారికల్ జానర్ లో 'ఛత్రపతి శివాజీ మహారాజ్', మైథాలజీలో విక్కీ కౌశల్ 'మహావతార్', హోంబలే 'పరశురామ్' వంటి భారీ చిత్రాలు కూడా 2027 క్యాలెండర్ లోనే ఉన్నాయి.

అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే.. ఇవన్నీ ప్రస్తుతానికి వేసుకున్న ప్లాన్స్ మాత్రమే. సాధారణంగా ఇలాంటి భారీ గ్రాఫిక్స్, భారీ బడ్జెట్ సినిమాలు అనుకున్న సమయానికి రావడం కొంచెం కష్టమే. షూటింగ్ ఆలస్యం కావడం, పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ తీసుకోవడం కామన్. కానీ మేకర్స్ పక్కా ప్లానింగ్ తో, వాయిదా పడకుండా ఈ సినిమాలను రిలీజ్ చేయగలిగితే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.

ఒకవేళ ఈ లైనప్ అంతా డిస్టర్బ్ కాకుండా 2027లో దిగితే, ఆడియెన్స్ కు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? నెలకో విజువల్ వండర్ ను థియేటర్లో ఎక్స్ పీరియన్స్ చేసే ఛాన్స్ దక్కుతుంది. మొత్తానికి 2027 అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మెమరబుల్ ఇయర్ గా నిలిచిపోయే అవకాశం ఉంది.