Begin typing your search above and press return to search.

2026 సంక్రాంతికి బిగ్ లాస్‌ తప్పదా?

గత కొన్నాళ్లుగా సంక్రాంతికి వస్తున్న సినిమాలతో పోల్చితే ఈసారి రాబోతున్న సంక్రాంతి చాలా స్పెషల్‌ అన్నట్లుగా అనిపిస్తుంది.

By:  Ramesh Palla   |   4 Nov 2025 12:20 PM IST
2026 సంక్రాంతికి బిగ్ లాస్‌ తప్పదా?
X

ప్రతి సంవత్సరం మాదిరిగానే 2026 సంక్రాంతి సినిమాల పండుగగా మారబోతుంది. గత కొన్నాళ్లుగా సంక్రాంతికి వస్తున్న సినిమాలతో పోల్చితే ఈసారి రాబోతున్న సంక్రాంతి చాలా స్పెషల్‌ అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే మెగాస్టార్‌ చిరంజీవి మన శంకరవర ప్రసాద్‌ గారు, ప్రభాస్ నటించిన రాజాసాబ్‌, రవితేజ సినిమాతో పాటు రెండు డబ్బింగ్‌ సినిమాలు మరో మీడియం రేంజ్‌ సినిమా విడుదల కాబోతున్నాయి. అన్ని సినిమాలు దేనికి అదే అన్నట్లుగా మంచి బజ్‌ను కలిగి ఉన్నాయి. 2025 సంక్రాంతికి అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్‌ కొట్టాడు కనుక మరో విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అని అంతా మన శంకరవర ప్రసాద్‌ పై ఆశలు పెట్టుకుని ఉన్నారు. అంత మాత్రాన వేరే సినిమాల విషయంలో తక్కువ అంచనాలు ఉన్నాయని అస్సలు కాదు. రాజాసాబ్‌ సినిమాకు ఉన్న బజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రాజాసాబ్‌ సినిమా విడుదల...

గత ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తున్న రాజాసాబ్‌ సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయాలని ప్రభాస్‌, మారుతి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వీలు పడలేదు. ఏప్రిల్‌లో అనుకున్న మూవీ కాస్త వాయిదాలు పడుతూ వచ్చి 2026 సంక్రాంతికి ఫిక్స్ అయింది. ఇటీవల రాజాసాబ్‌ సినిమా సంక్రాంతికి రావడం లేదని, ఇతర సినిమాలు ఊపిరి పీల్చుకోవచ్చు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఇండస్ట్రీలో ఉండే వారు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్‌ చేయడంతో సంక్రాంతి వార్‌ నుంచి రాజాసాబ్‌ తప్పుకున్నట్లే అని అంతా అనుకున్నారు. దాంతో బాక్సాఫీస్ వర్గాల వారు, ఇతర సినిమాల బయ్యర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ రాజాసాబ్‌ మేకర్స్ నుంచి మాత్రం అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ క్లారిటీ వచ్చింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన వర్క్ అంతా పూర్తి అయింది, కనుక వాయిదా వేసే ప్రసక్తే లేదు అంటూ ప్రకటన చేశారు.

మెగాస్టార్‌ మన శంకరవర ప్రసాద్‌ గారు...

రాజాసాబ్‌ వాయిదా పడితే 2026 సంక్రాంతి పోటీ కాస్త తగ్గుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు రాజాసాబ్‌ కూడా లైన్‌ లో ఉన్నట్లు మరోసారి కన్ఫర్మేషన్‌ వచ్చింది కనుక ఎంత నష్టం అనే విషయమై చర్చ జరుగుతోంది. సంక్రాంతి సీజన్‌ కి రావాల్సిన సినిమాలన్నీ కేవలం ఒకే వారం గ్యాప్‌లో విడుదల కావాల్సి ఉంది. రెండు పెద్ద డబ్బింగ్‌ సినిమాలను పక్కన పెడితే మూడు పెద్ద సినిమాలు, ఒక మీడియం రేంజ్ సినిమాలు ఉన్నాయి. వాటికి థియేటర్ల సమస్య ఉంటుంది. సినిమాలకు సక్సెస్ టాక్‌ వచ్చినా ప్రేక్షకుల నుంచి ఆధరణ ఆశించిన స్థాయిలో ఉండదు. 2025 సంక్రాంతికి బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్‌ సినిమా వచ్చి పర్వాలేదు అనిపించుకున్నా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కారణంగా కమర్షియల్‌గా ఫ్లాప్‌ వెంచర్‌గా మిగిలింది. అందుకే 2026లో అలా ఫ్లాప్‌ అయ్యే సినిమాలు ఏంటో అని ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది.

2026 సంక్రాంతి సినిమాలు...

మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబో మన శంకరవర ప్రసాద్‌ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఆ సినిమా 2026 సంక్రాంతి విజేతగా నిలుస్తుందని అంటున్నారు. అయితే మారుతి, ప్రభాస్‌ల కాంబోలో రూపొందుతున్న సినిమా విషయంలోనూ పాజిటివ్‌ బజ్ ఉంది. ఆ సినిమా కూడా హిట్ అయితే ప్రేక్షకులు ఎటు వెళ్లాలో తెలియక అటు ఇటు చూస్తారు. ఏదో ఒకే సినిమాకు మాత్రమే వెళ్లే అవకాశం ఉన్న వారు మరో వారం తర్వాత ఆ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించరు. అంటే ఒక సినిమాను చూస్తే మరో సినిమాకు నష్టం తప్పదు. ఇలా నాలుగు సినిమాల విషయంలో జరగుతుంది. అందుకే 2026 సంక్రాంతికి టాలీవుడ్‌ బయ్యర్లకు, నిర్మాతలకు బిగ్‌ లాస్ తప్పదు అనే విశ్లేషణ చాలా మంది చేస్తున్నారు. మరి ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయమై ఏమైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి.