యంగ్ హీరోలకు ఇది అగ్నిపరీక్షే!
తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, మార్కెట్‌ను సంపాదించుకున్న హీరోలు ఇప్పుడు ఆ ఇమేజ్‌ను నిలబెట్టుకోవాల్సిన అవసరం అంతే ఉంది
By: Srikanth Kontham | 23 March 2026 5:00 AM ISTకొంత మంది యువ కథానాయకులకు 2026వ సంవత్సరం ఓ పెద్ద అగ్నిపరీక్ష లాంటిదే. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, మార్కెట్‌ను సంపాదించుకున్న హీరోలు ఇప్పుడు ఆ ఇమేజ్‌ను నిలబెట్టుకోవాల్సిన అవసరం అంతే ఉంది. బాక్సాఫీస్ వద్ద పట్టు కోల్పోకుండా ఉండాలంటే? రాబోయే చిత్రాలతో ఖచ్చితంగా భారీ విజయాలను నమోదు చేయాల్సిన అవసరం ఏర్పడింది. నాగచైతన్య, అడివి శేష్, వరుణ్ తేజ్, నిఖిల్ తదుపరి చిత్రాల హిట్ కీలకంగా మారింది. అక్కినేని నాగచైతన్య `తండేల్ చిత్రంతో 100 కోట్ల క్లబ్‌లో చేరి తన సత్తా చాటిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం `వృష కర్మ` అనే వైవిధ్యమైన టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. `తండేల్` ఇచ్చిన జోష్‌ను కొనసాగిస్తూ తన మార్కెట్‌ను మరింత సుస్థిరం చేసుకోవాలంటే ఈ సినిమా విజయం అత్యంత కీలకం. అంతేకాదు ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చైతన్య కెరీర్ లో కొత్త రికార్డను నమోదు చేయాలి. అప్పుడే చైతన్య మార్కెట్ స్టేబుల్ గా ఉంటుంది. టాలీవుడ్ థ్రిల్లర్ల స్పెషలిస్ట్ అడివి శేష్ దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకేసారి రెండు భారీ చిత్రాలతో సందడి చేయబోతున్నారు. శేషు నటిస్తోన్న`డెకాయిట్` ఏప్రిల్ 10న విడుదలవుతుంది.
తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సీక్వెల్ `గూడచారి 2` కూడా లైన్లో ఉంది. ఈ రెండు చిత్రాలు గనుక ఆశించిన విజయాన్ని అందుకుంటే శేష్ మార్కెట్ వాల్యూ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగిపోతుంది. ఈ రెండు సినిమాలపై శేష్ సైతం అంతే కాన్పిడెంట్ గా ఉన్నాడు. రెండు ప్రాజెక్టులు శేష్ కెరీర్ బెస్ట్ విజయాలుగా నిలుస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు మెగా హీరో వరుణ్ తేజ్ వరుస పరాజయాల తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో `కొరియన్ కనకరాజు` అనే ప్రయోగాత్మక చిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా ఫలితం వరుణ్ తేజ్ కెరీర్ గ్రాఫ్‌కు అత్యంత అవసరం. మళ్ళీ తన ఫామ్‌ను నిలబెట్టుకోవాలన్నా? కమర్షియల్ హీరోగా తన ఇమేజ్‌ను కాపాడుకోవాలన్నా? కనకరాజు కొట్టాల్సిందే.
`కార్తికేయ 2`తో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఆ తర్వాత వరుసగా తడబడుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో మళ్లీ గెలుపు బావుటా ఎగరవేయాలని ఎంతో కసితో ఉన్నాడు. ప్రస్తుతం నిఖిల్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ చిత్రం `స్వయంభూ` బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాల్సి ఉంది. కేవలం సౌత్ ప్రేక్షకులే కాకుండా? హిందీ బెల్ట్‌లో కూడా తన మార్కెట్‌ను సుస్థిరం చేసుకోవాలంటే `స్వయంభూ` విజయం నిఖిల్ కెరీర్‌కు మైలురాయిగా మారాలి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నిఖిల్ పాన్-ఇండియా స్టార్‌డమ్‌కు అసలైన పరీక్షగా నిలవనుంది. అలా టాలీవుడ్ యంగ్ బ్రిగేడ్ అంతా అత్యంత కీలకమైన మలుపులో ఉన్నారు. ఒక పక్క సీనియర్ హీరోల హవా మరోపక్క పాన్-ఇండియా చిత్రాల పోటీ మధ్య వీరు ఉనికిని చాటుకోవాలి.
