Begin typing your search above and press return to search.

2025 టాలీవుడ్ బాక్సాఫీస్: మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే..

ఈ ఏడాది టాలీవుడ్ తరపున అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ 'ఓజీ' (OG) నిలిచింది.

By:  M Prashanth   |   31 Dec 2025 10:44 AM IST
2025 టాలీవుడ్ బాక్సాఫీస్: మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే..
X

గత మూడేళ్లుగా భారతీయ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమా హవా ఒక రేంజ్ లో నడిచింది. 2022లో రాజమౌళి చెక్కిన 'ఆర్ఆర్ఆర్' 1200 కోట్లతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటితే, 2023లో ప్రభాస్ 'సలార్' 620 కోట్లతో ఆ జోరును కొనసాగించింది. ఇక 2024 అయితే టాలీవుడ్ కు స్వర్ణయుగం అనే చెప్పాలి. 'కల్కి 2898 ఏడీ' 1000 కోట్లు, 'పుష్ప 2' ఏకంగా 1700 కోట్లు కొల్లగొట్టి రికార్డులను తిరగరాశాయి. మిక్స్ డ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ 'దేవర' కూడా 500 కోట్లు రాబట్టి మన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించింది.

కానీ 2025 సంవత్సరం మాత్రం ఈ లెక్కలన్నీ మార్చేసింది. అంతటి ట్రాక్ రికార్డ్ ఉన్న టాలీవుడ్, ఈ ఏడాది పూర్తిగా డీలా పడిపోయింది. ఈ సంవత్సరం ఒక్క తెలుగు సినిమా కూడా 300 కోట్ల మార్కును దాటలేకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. బాక్సాఫీస్ దగ్గర సినిమాల సందడి కనిపించినా, కలెక్షల పరంగా మాత్రం భారీ వెలితి స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన కొన్నేళ్లలో టాలీవుడ్ గ్రాఫ్ ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

పక్క ఇండస్ట్రీలతో పోల్చి చూస్తే మన పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల జాబితాలో బాలీవుడ్ నుంచి వచ్చిన 'ధురంధర్' ఏకంగా 1015 కోట్లతో టాప్ ప్లేస్ లో నిలవగా, కన్నడ నుంచి వచ్చిన 'కాంతారా' 850 కోట్లతో సత్తా చాటింది. కోలీవుడ్ 'కూలీ' నెగిటివ్ టాక్ వచ్చినా కూడా 520 కోట్లు రాబట్టింది. అన్నింటికంటే షాకింగ్ విషయం ఏంటంటే.. చిన్న మార్కెట్ అనుకునే మలయాళ ఇండస్ట్రీ (మాలీవుడ్) కూడా మనల్ని దాటేసింది. అక్కడ 'లోక' సినిమా 302 కోట్లు వసూలు చేస్తే, మనం మాత్రం ఇంకా వెనుకబడిపోయాం.

ఈ ఏడాది టాలీవుడ్ తరపున అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ 'ఓజీ' (OG) నిలిచింది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా కూడా 295 కోట్ల దగ్గరే ఆగిపోయి, 300 కోట్ల మ్యాజిక్ ఫిగర్ ను జస్ట్ లో మిస్ అయ్యింది. మిగిలిన ఇండస్ట్రీలన్నీ టాప్ గేర్ లో వెళ్తుంటే, మన ఇండస్ట్రీ టాప్ గ్రాసర్ సినిమా కూడా 300 కోట్లు దాటకపోవడం ఫ్యాన్స్ కు మింగుడు పడని విషయం. మలయాళం కంటే మనం వెనుకబడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ వైఫల్యానికి ప్రధాన కారణం భారీ స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ బరిలో బలంగా లేకపోవడమే. ఈ ఏడాది ప్రభాస్ నుంచి గానీ, ఎన్టీఆర్ నుంచి గానీ భారీ సోలో బ్లాక్ బస్టర్స్ రాలేదు. అల్లు అర్జున్ సినిమా సందడి కూడా ఈ ఏడాది లేదు. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు. స్టార్ పవర్ మిస్ అవ్వడం, కంటెంట్ లో ఆశించిన కిక్ లేకపోవడంతో టాలీవుడ్ కలెక్షన్స్ వెలవెలబోయాయి.

ఏదేమైనా 2025 సంవత్సరం టాలీవుడ్ కు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో చక్రం తిప్పిన మన ఇండస్ట్రీ, ఒక్కసారిగా కిందకు పడిపోవడం మేకర్స్ కు ఒక వేకప్ కాల్ లాంటిది. కేవలం పాన్ ఇండియా హైప్ మాత్రమే సరిపోదని, కంటెంట్ బలంగా ఉంటేనే రికార్డులు వస్తాయని ఈ ఏడాది ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ డౌన్ నుంచి బయటపడి వచ్చే ఏడాది అయినా మన హీరోలు మళ్ళీ పూర్వ వైభవాన్ని, ఆ భారీ నంబర్లను తీసుకొస్తారో లేదో చూడాలి.