2025 రివ్యూ: టాప్-10 సీక్వెల్స్ అదీ సంగతి
2025 ముగింపులో ఉంది.. 31 డిసెంబర్ మిడ్ నైట్ సెలబ్రేషన్ కోసం యువత ఉవ్విళ్లూరుతోంది.
By: Sivaji Kontham | 9 Dec 2025 12:00 AM IST2025 ముగింపులో ఉంది.. 31 డిసెంబర్ మిడ్ నైట్ సెలబ్రేషన్ కోసం యువత ఉవ్విళ్లూరుతోంది. కొత్త సంవత్సర వేడుకల పేరుతో యూత్ ఇప్పటి నుంచే చిల్ చేయడం ప్రారంభించింది. ఇదే సమయంలో ఈ ఏడాదిలో భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన సీక్వెల్ సినిమాల గురించి విశ్లేషిస్తే....
ఈ ఏడాది బాలీవుడ్ అగ్ర హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ కొన్ని సీక్వెల్ చిత్రాలతో అభిమానుల ముందుకు వచ్చినా తీవ్రంగా నిరాశపరిచారు. 2019లో వచ్చిన కేసరి చిత్రానికి సీక్వెల్ `కేసరి చాప్టర్ 2` ఈ సంవత్సరం విడుదలైంది. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్ నటించిన ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. కానీ ఇది కేవలం 145 కోట్లు మాత్రమే ఆర్జించింది. అక్షయ్ కుమార్ మల్టీ-స్టారర్ హౌస్‌ఫుల్ 5 కూడా ఈ సంవత్సరం విడుదలైనా, బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోవడంలో విఫలమైంది. 240 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 249 కోట్లు వసూళ్లు సాధించింది. ఇదే వరుసలో అక్షయ్ నటించిన మూడో సినిమా కూడా ద్వితీయార్థంలో వచ్చింది. ఫ్రాంచైజీలో మూడోది అయిన జాలీ ఎల్ఎల్బీ 3 ఇటీవల విడుదలైంది. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ నటించిన ఈ సినిమా 120 కోట్ల బడ్జెట్ తో రూపొంది 166.06 కోట్లు వసూళ్లు చేసింది, కానీ ఆకట్టుకోలేకపోయింది.
హృతిక్ రోషన్ -జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన `వార్ 2` పెద్ద ఫ్లాప్. 450 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 351 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం 2019 హిట్ మూవీ వార్ కి సీక్వెల్. ఈ ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది.
అజయ్ దేవగన్- మృణాల్ ఠాకూర్‌ల `సన్ ఆఫ్ సర్దార్ 2` బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కేవలం 61కోట్లు వసూళ్లు చేసింది. ఇది 2012 చిత్రం సన్ ఆఫ్ సర్దార్‌కు సీక్వెల్.
అజయ్ దేవగన్ - రకుల్ ప్రీత్ సింగ్ నటించిన `దే దే ప్యార్ దే 2` కూడా ఈ ఏడాది చివరిలో విడుదలైంది. 2019 చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్‌తో రూపొంది 98.85 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
టైగర్ ష్రాఫ్ , సంజయ్ దత్ ల `బాఘి 4` అనూహ్యంగా పరాజయం పాలైంది. 80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 67 కోట్లు వసూళ్లు చేసింది. ఆదిత్యరాయ్ కపూర్-సారా అలీ ఖాన్‌ల మల్టీస్టారర్ చిత్రం `మెట్రో ఇన్ డినో` పెద్దగా రాణించలేదు. 47 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ.69 కోట్లు వసూళ్లు సాధించింది. ఇది 2007 చిత్రం లైఫ్ ఇన్ ఎ మెట్రోకు సీక్వెల్. సిద్ధాంత్ చతుర్వేది- త్రిప్తి దిమ్రీల `ధడక్ 2` కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 29 కోట్లు మాత్రమే వసూళ్లు చేసింది. ఇది 2018 చిత్రం ధడక్‌కు సీక్వెల్.
