Begin typing your search above and press return to search.

బాలీవుడ్ 5000 కోట్ల సంప‌ద సృష్టి వెన‌క అదా సంగ‌తి?

ఈరోజుల్లో చాలా ప్ర‌తికూల ప‌రిస్థితుల న‌డుమ ఎగ్జిబిష‌న్ రంగం కుదేల‌వుతోంద‌నే నివేదిక‌లు ఉన్నాయి.

By:  Sivaji Kontham   |   25 Jan 2026 9:27 AM IST
బాలీవుడ్ 5000 కోట్ల సంప‌ద సృష్టి వెన‌క అదా సంగ‌తి?
X

ఈరోజుల్లో చాలా ప్ర‌తికూల ప‌రిస్థితుల న‌డుమ ఎగ్జిబిష‌న్ రంగం కుదేల‌వుతోంద‌నే నివేదిక‌లు ఉన్నాయి. కానీ ఓర్మాక్స్ బాక్సాఫీస్ 2025 రిపోర్ట్ ప్ర‌కారం.. 2025లో హిందీ సినిమాల‌తో థియేట‌ర్లు సాధించిన పురోగతి ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. గ‌తేడాది భారతీయ సినీ రంగంలో హిందీ సినిమాలు మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే హిందీ సినిమాల ఆదరణ అసాధార‌ణంగా పెరిగిందని మీడియా పరిశోధనా సంస్థ `ఓర్మాక్స్ మీడియా` త‌న క‌థ‌నంలో పేర్కొంది.

2024తో పోలిస్తే 2025లో హిందీ సినిమా టికెట్ అమ్మకాలు 11.3 శాతం పెరిగాయి. అంటే సుమారు 25.6 కోట్ల (256 మిలియ‌న్లు) టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా అన్ని భాషా చిత్రాలను కలిపి చూసిన వాళ్ల‌ను ప‌రిశీలిస్తే, థియేట‌ర్ల‌కు ప్రేక్షకుల రాక 5.7 శాతం మేర తగ్గి 83.2 కోట్లకు (832 మిలియ‌న్ల)కు పడిపోయింది. ఈ తగ్గుముఖం పట్టిన ట్రెండ్‌ను తలకిందులు చేస్తూ హిందీ సినిమా మాత్రం వృద్ధిని నమోదు చేయడం విశేషం.

ప్ర‌ముఖ హిందీ ఎగ్జిబిట‌ర్ అభిప్రాయం ప్రకారం.. ఇప్పుడు కేవలం నటుల స్టార్‌డమ్ చూసి ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. స్పై థ్రిల్లర్- దురంధ‌ర్, చారిత్ర‌క చిత్రం -ఛావా , సైయారా (రొమాన్స్), మహావతార్ నరసింహ (యానిమేషన్) వంటి విభిన్న జోనర్ల చిత్రాలు సక్సెస్ అవ్వడమే దీనికి నిదర్శనం.

2025లో హిందీ బాక్సాఫీస్ వసూళ్లలో 93 శాతం ఒరిజినల్ హిందీ సినిమాల నుంచే వచ్చాయి. దక్షిణాది డబ్బింగ్ సినిమాల వాటా కేవలం 7శాతానికి పరిమితమైంది. టికెట్ ధరలు సగటున రూ. 215కి పెరిగినా కానీ, ప్రేక్షకులు హిందీ సినిమాలను థియేటర్లలో చూడటానికే మొగ్గు చూపారు. దీనివల్ల హిందీ బాక్సాఫీస్ వసూళ్లు రూ. 5,504 కోట్లకు చేరి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఈ విజ‌యంలో మౌత్ టాక్ కీల‌క భూమిక పోషించింది. మంచి క‌థ‌లు, చ‌రిత్ర వంటి అంశాల‌ను మేళ‌వించి సినిమాలు తీస్తే వాటికి ఎప్పుడూ ఆద‌ర‌ణ బావుంటుంద‌ని నిరూప‌ణ అయింది.