$2B క్లబ్‌లో 8 సినిమాలు.. జేమ్స్ కామెరూన్‌దే హవా!
ఈ విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే .. విజనరీ దర్శకుడు జేమ్స్ కేమరాన్ ఒక్కరే $2 బిలియన్లు దాటిన చిత్రాల్లో మూడింటికి (అవతార్, అవతార్ 2, టైటానిక్) దర్శకత్వం వహించడం.
By: Sivaji Kontham | 21 Aug 2026 8:32 AM ISTప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16000 కోట్లు) గ్రాస్ మైలురాయిని దాటడం అనేది ఏ సినిమాకైనా ఒక అరుదైన ఘనత. ఇప్పటివరకు ప్రపంచ సినీ చరిత్రలోనే కేవలం 8 చిత్రాలు మాత్రమే ఈ ఎలైట్ 2 బిలియన్ డాలర్ క్లబ్‌లో అడుగుపెట్టగలిగాయి. సినిమా బడ్జెట్‌లు.. హాలీవుడ్ స్థాయి గ్లోబల్ మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ క్లబ్ వివరాలు నెట్టింట తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో జేమ్స్ కేమరాన్ సృష్టించిన విజువల్ వండర్ `అవతార్` (2009) $2.92 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత అవెంజర్స్: ఎండ్‌గేమ్ (2019) $2.79 బిలియన్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక జేమ్స్ కేమరాన్ తీసిన `అవతార్: ది వే ఆఫ్ వాటర్` (2022) $2.33 బిలియన్లు, `టైటానిక్` (1997) $2.26 బిలియన్లతో తదుపరి స్థానాల్లో నిలవగా... చైనీస్ యానిమేషన్ సెన్సేషన్ `నే ఝా 2` (2025) $2.21 బిలియన్ల మార్కును అందుకొని చరిత్ర సృష్టించింది. వీటితో పాటు `స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్`(2015), `ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్` (2018), ఇటీవల వచ్చిన `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే` (2026) చిత్రాలు కూడా ఈ $2 బిలియన్ల మైలురాయిని చేరుకున్నాయి.
ఈ విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే .. విజనరీ దర్శకుడు జేమ్స్ కేమరాన్ ఒక్కరే $2 బిలియన్లు దాటిన చిత్రాల్లో మూడింటికి (అవతార్, అవతార్ 2, టైటానిక్) దర్శకత్వం వహించడం. అంతేకాకుండా.. ఈ 8 చిత్రాలలో 7 సినిమాలు డిస్నీ సంస్థ ప్రొడక్షన్ లేదా డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ క్రిందకే రావడం హాలీవుడ్‌లో ఆ సంస్థ ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది. వీటికి భిన్నంగా చైనాకు చెందిన `నే ఝా 2` యానిమేటెడ్ మూవీ కావడం.. కేవలం చైనా మార్కెట్ తోడ్పాటుతోనే హాలీవుడ్ సినిమాలకు పోటీగా $2 బిలియన్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే ఈ సంఖ్యలను సాధారణ ధరకు కాకుండా ద్రవ్యోల్బణం ఆధారంగా విశ్లేషిస్తే అసలు లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 1939 నాటి క్లాసిక్ `గాన్ విత్ ది విండ్` ఇప్పటి విలువ ప్రకారం సుమారు $4.55 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసి ఆల్ టైమ్ నంబర్ 1 స్థానంలో ఉంటుంది. అలాగే 1977 నాటి `స్టార్ వార్స్: ఎ న్యూ హోప్` .. 1965 నాటి `ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్` వంటి చిత్రాలు కూడా నేటి లెక్కల్లో $3 బిలియన్ల మార్కును సునాయసంగా అధిగమించాయనేది ఒక విశ్లేషణ. ద్రవ్యం విలువ తక్కువగా ఉన్న రోజుల్లోను ఇవి సంచలనం సృష్టించాయి.
ప్రస్తుతం టికెట్ ధరలు భారీగా పెరగడం వల్ల నేటి సినిమాలు తక్కువ టికెట్లు అమ్మినా త్వరగా $2 బిలియన్ల క్లబ్‌లోకి చేరుకుంటున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్వకాలంలో థియేటర్లలో ఏళ్ల తరబడి ఆడటం, రీ-రిలీజ్‌లు కావడం ద్వారా రికార్డులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మొదటివారంలోనే మొత్తం వసూళ్లు సాధిస్తున్నాయి. ఏది ఏమైనా ద్రవ్యోల్బణం పక్కన పెడితే నేటి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద $2 బిలియన్ సాధించడం అనేది ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలిచిపోతుంది.
