దేశంలో టాప్ 10 కాలేజీలు ఇవే.. తెలుగు రాష్ట్రాలకు వందలోనూ నో ప్లేస్
ఇందులో టాప్ 10 కాలేజీల జాబితాను చూసినప్పుడు.. ఘనత వహించిన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఒక్క కాలేజీ ఉండని దుస్థితి.
By: Garuda Media | 25 Sept 2025 9:30 AM ISTప్లస్ టూ.. అదేనండి ఇంటర్ పూర్తైన వెంటనే అత్యధికులు ఎంపిక చేసుకునేది అయితే ఇంజనీరింగ్.. లేదంటే మెడిసిన్. ఈ రెండు కాకుండా కోర్సులు లేవా? అన్న ప్రశ్నకు వింతగా.. విచిత్రంగా చూసేటోళ్లు ఎక్కువగా కనిపిస్తారు. అయితే.. ఇంజనిరీంగ్ తో పోలిస్తే బోలెడన్ని కోర్సులు.. పూర్తైన వెంటనే బీటెక్ కు ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికి.. వాటి వైపు చూసేటోళ్లు తక్కువగా కనిపిస్తుంటారు. మరి.. ఈ తరహా కాలేజీల్లో దేశంలోనే టాప్ 10 కాలేజీలు ఏంటని అడిగితే చాలామంది నోరెళ్లబెడుతుంటారు. నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్ వర్కు ఏటా కాలేజీల విభాగంలో టాప్ కాలేజీల జాబితాను ప్రకటిస్తోంది.
ఇదే తీరులో తాజాగా 2025లో అత్యుత్తమ కాలేజీల జాబితాను ప్రకటించింది. ఇందులో టాప్ 10 కాలేజీల జాబితాను చూసినప్పుడు.. ఘనత వహించిన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఒక్క కాలేజీ ఉండని దుస్థితి. సర్లే.. టాప్ 100లో అయినా ఉండకుండా ఉంటుందని భావిస్తే.. అక్కడా నిరాశే. ఎందుకంటే.. టాప్ 100 కాలేజీల్లో ఒక్కటి కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన కాలేజీలు చోటు దక్కించుకోలేదు.
ఈ యూజీ కోర్సుల్లో బీఏ.. బీకాం.. బీఎస్సీలే ముందు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ కోర్సులు చేసేందుకు టాప్ కాలేజీల్లో సీటు దక్కించుకోవటం మామూలు విషయం కాదు. ఐఐటీ మాదిరే ఇందులోనూ భారీ పోటీ ఉంటుంది. యూజీ కాలేజీలకు ర్యాంకింగ్ లు ఇవ్వటం 2017 నుంచి మొదలైంది. అప్పటి నుంచి దాదాపు ఏడేళ్ల పాటు మిరండా హౌస్ (ఢిల్లీ) ప్రథమ స్థానంలో నిలవగా.. గడిచిన ఏడాది.. ఈ ఏడాది మాత్రం హిందూ కాలేజీ (ఢిల్లీ) టాప్ లో నిలిచింది. టాప్ 10 కాలేజీల్లో ఆరు దేశ రాజధాని ఢిల్లీకి చెందినవి కాగా.. మరో రెండు కోల్ కతా.. ఇంకో రెండు కోయంబత్తూర్ కు చెందినవి కావటం విశేషం.
ఈ ఏడాది టాప్ 10 కాలేజీల చోటు దక్కించుకున్నవి ఇవే..
1. హిందూ కాలేజ్ (ఢిల్లీ)
2. మిరండా హౌస్ (ఢిల్లీ)
3. హన్స్ రాజ్ కాలేజ్ (ఢిల్లీ)
4.కిరోరీ మాల్ కాలేజ్ (ఢిల్లీ)
5. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ (ఢిల్లీ)
6. రామక్రిష్ణ మిషన్ వివేకానంద సెంటీనరి కాలేజ్ (కోల్ కతా)
7. ఆత్మారామ్ సనాతన ధర్మ్ కాలేజ్ (న్యూఢిల్లీ)
8. సెయింట్ జేవియర్స్ కాలేజ్ (కోల్ కతా)
9. పీఎస్ జీఆర్ క్రిష్ణమ్మాల్ కాలేజ్ ఫర్ విమెన్ (కోయంబత్తూర్)
10. పీఎస్ జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (కోయంబత్తూర్)
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. టాప్ 100లోనూ ఏ ఒక్క కాలేజీ చోటు దక్కించుకున్నది లేదు. 101-150 మధ్యలో మాత్రం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లోని నిజాం కాలేజ్ ఒక్కటి మాత్రమే చోటు దక్కింది. 151-200 మధ్యలో మాత్రం విజయవాడకు చెందిన ఆంధ్ర లయోలా కాలేజ్, సికింద్రాబాద్ కు చెందిన భువన్స్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ కామర్స్, హైదరాబాద్ కు చెందిన లయోలా అకాడెమీ, హైదరాబాద్ కు చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ కు చోటుదక్కింది.
ఇక.. 201-300 ర్యాంకు ఉన్న కాలేజీల్లో మాత్రం ఏపీ పరిధిలోని నాగార్జునసాగర్ కు చెందిన ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, భీమవరానికి చెందిన బీవీ రాజు కాలేజ్, రాజమహేంద్రవరానికి చెందిన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, హైదరాబాద్ కు చెందిన ఆర్ బీవీఆర్ఆరర్ కాలేజ్ ఫర్ విమెన్, కర్నూలుకు చెందిన సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ, హైదరాబాద్ కు చెందిన సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ విమెన్ చోటు దక్కించుకున్నాయి.
