యోగి మీద భారీ స్కెచ్...సీఎం గిరీ ఎన్నికల వరకేనా ?
2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం పదవి నుంచి తప్పిస్తారనే చర్చ బీజేపీలో మొదలైంది. మూడోసారి గెలిచినా ఆరేడు నెలలకే కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యలు ఈ చర్చకు బలం చేకూర్చగా, యోగికి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మద్దతుగా నిలిచారు.
By: Satya P | 28 Nov 2026 9:17 AM ISTఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడు. ఈ రోజున రాజకీయాల్లోనే కాదు పౌర సమాజంలో కూడా అంతటి రుజు వర్తన నైతిక నిష్ట కలిగిన వారు అత్యంత అరుదు అని చెప్పడంలో సందేహం లేదు. ఆయన చిన్నతనంలోనే సన్యాసించిన వారు. అయితే ప్రజా జీవితం ఎంచుకుని సేవ చేస్తున్నారు. తన కుటుంబం మొత్తాన్ని దూరంగా పెట్టి తాను కూడా అధికార వైభోగాలకు దూరం పాటిస్తూ అతి సామాన్య జీవితం గడుపుతున్న యోగీ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన యూపీ కి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే అది ఆయన పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ అని చెప్పడంలో డౌటే లేదు.
హిందూత్వ వాదిగా :
బీజేపీలో అరవీర హిందూత్వ వాదిగా యోగి ఉంటారు. ఆయన ఆర్ఎస్ఎస్ మెచ్చిన నాయకుడు. హిందూత్వ బ్రాండ్ గా ఆయనను ముందు పెట్టాలన్నది ఆర్ఎస్ఎస్ ఆలోచనగా చెబుతారు. ఇక యాభై అయిదేళ్ల యోగి అయిదు సార్లు ఎంపీగా కూడా గెలిచి వచ్చారు. బీజేపీకి మూడున్నర దశాబ్దాల క్రితం కళ్యాణ్ సింగ్ ఒకసారి అధికారం తీసుకుని వస్తే అతి కొద్ది కాలమే ఆ పవర్ నిలిచింది. కానీ ఇంత స్థిరంగా సుస్థిరంగా బీజేపీకి యూపీలో అధికారం ఉంది అంటే అది యోగి ఇమేజ్ తోనే అని అంతా చెబుతారు. బీజేపీకి కూడా యూపీలో బలం ఉంది కానీ యోగీ తరువాతనే అది అన్నది ఒక కఠినమైన విశ్లేషణ. ఇదిలా ఉంటే 2027 లో జరిగే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఆయన హ్యాట్రిక్ సీఎం అవుతారు. ఆ మీదట ఆటోమెటిక్ గా ఆయన బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా రేసులోకి దూసుకుని వస్తారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. 2029 లో దేశంలో జరిగే లోక్ సభ ఎన్నికల నాటికి యూపీని పన్నెండేళ్ళుగా పాలించే సీఎం గా యోగీ ఉంటారు అన్నది తెలిసిందే.
తప్పిస్తారా మరి :
ఈ నేపథ్యంలో 2027లో బీజేపీ అధికారంలోకి వచ్చేంతవరకే యోగీ ముఖ్యమంత్రిత్వం అని చర్చ అయితే సాగుతోంది. బీజేపీ మూడోసారి గెలిచిన తరువాత యోగీని తప్పించి వేరే వారికి పట్టం కడతారు అని అంటున్నారు. అది ఎలా జరుగుతుంది అంటే అచ్చం బీహార్ లో జరిగినట్లుగానే అని చెబుతున్నారు. అంటే యోగీ సీఎం గా మూడోసారి ప్రమాణం చేసిన ఆరేడు మాసాల తరువాత తప్పించవచ్చు అని అంటున్నారు. దీని మీద యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తాజాగా చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు. దాంతో యూపీ బీజేపీలో కొత్త నాయకత్వ చర్చ అలా తెరపైకి వచ్చింది. 2027 ఎన్నికల్లో బీజేపీకి కమలం గుర్తు మాత్రమే ప్రధాన ముఖమని ఫలితాల అనంతరం కేంద్ర పరిశీలకుల సమక్షంలో ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని మౌర్య వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. అయితే దీనిపై సీఎం యోగి స్పందిస్తూ ఎవరు ఎలాంటి వారో అందరికీ తెలుసని బదులిచ్చారు.
ప్రతిపక్షం మద్దతు :
అయితే అనూహ్యంగా యోగీకి ప్రతిపక్షం ఇండియా కూటమిలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మద్దతుగా నిలవడం విశేషం. ఆయన మాట్లాడుతూ యోగీ అత్యంత సమర్థ నేత అని ఆయన లేకపోతే యూపీలో బీజేపీ లేదన్నట్లుగా మాట్లాడారు. ఆయన తమకు ఎంతో ఇష్టం అన్నారు. హిందుత్వంలో ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నారని యోగి ఉంటేనే యూపీ యోగి లేకపోతే యూపీ లేదని కూడా సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని, కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు తనకే మద్దతు ఇస్తారనే పూర్తి విశ్వాసం యోగి మాటల్లో కనిపిస్తోందని కూడా ఆయన విశ్లేషించారు.
ఎవరి స్కెచ్ ఇది :
యోగీ వెనక బిగ్ స్కెచ్ అని ప్రచారం అయితే సాగుతోంది. మరి ఎవరు దీని వెనక ఉన్నారు అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఆయన హ్యాట్రిక్ సీఎం గా కొనసాగుతూ ఉంటే కనుక ప్రధాని రేసులోకి వస్తారని కూడా ఊహాగానాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఆయనను మాజీ సీఎం చేయడం అంటే అది బీజేపీకి 2029 లోక్ సభ ఎన్నికల్లో కూడా నష్టదాయకమైన చర్యగా ఉంటుందని అంటున్నారు.
