బీజేపీ దీపాన్ని టీవీకే వెలిగించిందా ?
తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై సుమారు 100-150 ఏళ్ల తర్వాత నవంబర్ 28న కార్తీక దీపం వెలిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కార్యక్రమం జరగడంతో టీవీకే ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదం బీజేపీకి రాజకీయంగా కలిసి వస్తుందా, తమిళనాడులో హిందూత్వ బలోపేతానికి దారితీస్తుందా అన్న చర్చ మొదలైంది.
By: Satya P | 29 Nov 2026 9:22 AM ISTరాపిడి ఉన్న చోటే నిప్పు పుడుతుంది. ఘర్షణ ఉన్న చోటనే ధీటైన పక్షం బయటకు వస్తుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. పట్టించుకోకపోతే అవతల వైపు ఎవరు ఉన్నా జనాలకు కూడా కనిపించదు. ఇన్ని ఉదాహరణలు ఎందుకు అంటే తమిళనాడులో ఎవరూ చేయలేని పనిని అక్కడ ఆరేడు నెలల క్రితం అధికార పీఠం అందుకుని పాలిస్తున్న టీవీకే అనే కొత్త పార్టీ చేసింది అన్నదే ఒక విశ్లేషణ. ఇంతకీ టీవీకే ఏమి చేసింది అంటే తమిళనాడులో హిందూత్వను రగిలించింది. బీజేపీ వంటి పార్టీలు బలోపేతం అయ్యేందుకు దీపం వెలిగించింది అని అంటున్నారు. తమిళనాడులో వందేళ్ల క్రితం వెలిగిన కార్తీక దీపం మళ్ళీ ఇన్నేళ్లకు వెలిగింది అంటే దాని వెనక అనేక సంఘటనలు జరగడమే కారణం అని అంటున్నారు.
ఒక దీపం వెలిగింది :
ఇక చూస్తే కనుక తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపథూన్ అంటే రాతి స్తంభం వద్ద దాదాపు 100 నుంచి 150 ఏళ్ల తర్వాత కార్తీక దీపం వెలగడం జరిగింది. దీని వెనక భక్తుల న్యాయపోరాటం సుప్రీంకోర్టు ఇచ్చిన కఠిన ఆదేశాల వల్లే ఈ దీపం వెలిగింది. కానీ మరింతగా లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఈ నెల 20న తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద దీపథూన్ వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు ఒక్కసారి అనుమతి ఇచ్చింది. అయితే, దీనికి వ్యతిరేకంగా టీవీకే ప్రభుత్వంలోని దేవాదాయ శాఖ ద్వారా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. శాంతిభద్రతల కారణాలను చూపుతూ నవంబర్ 24న కార్తీక పౌర్ణమి రోజున దీపథూన్ వద్ద కాకుండా పాత పద్ధతిలోనే ఉచ్చి పిళ్ళయార్ ఆలయం వద్ద మాత్రమే ప్రభుత్వం దీపం వెలిగించింది.
సుప్రీంకోర్టు ఆగ్రహం :
ఈ నేపథ్యంలో తమ ఆదేశాలను ఉల్లంఘించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఆలయ ట్రస్టీలను రద్దు చేసి ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తుల పర్యవేక్షణలో శనివారం అంటే నవంబర్ 28న సాయంత్రం దీపం వెలిగించాలని ఆదేశించింది. ఆ మేరకు సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్ పర్యవేక్షణలో సీఆర్పీఎఫ్ భారీ భద్రత నడుమ నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు దీపథూన్ వద్ద కార్తీక దీపం వెలిగించారు. ఇది భక్త కోటిలో ఎంతో ఆనందం కలిగించింది. ఒక విధంగా చెప్పాలీ అంటే ఆధ్యాత్మిక భావన సర్వత్రా వెల్లి విరిసింది. కేవలం తమిళనాడుకు మాత్రమే కాదు దేశమంతా ఈ అంశం మీద చర్చించుకునేలా చేసింది.
అతి పెద్ద రాజకీయ చర్చ :
ఇక ఈ విషయంలో తమిళనాడులోని టీవీకే ప్రభుత్వం మైనారిటీ ఓట్ల కోసమే సుప్రీంకోర్టు ఆదేశాలను అడ్డుకునే ప్రయత్నం చేసిందని అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం ద్వారా రాష్ట్ర హక్కులను కేంద్రం న్యాయవ్యవస్థలకు విజయ్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఆరోపించారు. మరో వైపు చూస్తే టీవీకే ప్రభుత్వం ఒక విధంగా ఇరకాటంలో పడింది అని అంటున్నారు. ఇది బీజేపీకి కూడా తమిళనాడులో ఒక్కసారిగా అనుకూలతను తెచ్చిపెట్టే అంశంగా మారుతోంది అని అంటున్నారు. ఎందుకంటే హిందూ సంఘాల నుంచి టీవీకే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కోర్టు ఆదేశాలను పాటించలేదని బీజేపీ, ఇతర ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి.
బీజేపీకి చాన్స్ :
ఈ దీపం వెలిగించిన ఘటన తమిళనాడులో బీజేపీ రాజకీయ ఎదుగుదలకు బాటలు వేస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది. తమిళ సమాజంలో అత్యంత ఆరాధ్య దైవమైన మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఈ ఆలయ ఆచారాలతో ఈ వివాదం ముడిపడి ఉంది. దీనిని కేవలం ఉత్తరాది హిందూత్వ అంశంగా కాకుండా తమిళ సంస్కృతి భక్తుల హక్కుల విజయంగా ప్రచారం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మురుగన్ ఆలయాల్లో దీపం ఉద్యమం పేరిట బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. అంతే కాకుండా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోర్టు జోక్యంతో చివరకు దీపం వెలగడం తమ నైతిక న్యాయపరమైన విజయమని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
మెజారిటీ వర్గంతోనే :
ఇక తమిళనాడులో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం బీజేపీ గట్టిగానే చేస్తోంది. గతంలో డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించిన తరహాలోనే ఇప్పుడు విజయ్ ప్రభుత్వాన్ని కూడా మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించడం ద్వారా హిందూ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అయితే ఒక ఆలయ వివాదంలో కోర్టు ద్వారా సాధించిన విజయం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఓట్లుగా మారుతుందా అన్నది సందేహమేనని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఘటన తమిళనాడులో బీజేపీకి బలమైన రాజకీయ ప్రచారాస్త్రాన్ని క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చిందని అంతా భావిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని దేవాలయాలు కలిగిన తమిళనాడులో హిందూత్వను తట్టి లేపడానికి బీజేపీ ఈ దీపాన్ని వాడుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
