టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?
తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ముందుగానే రాజీనామా లేఖలు తీసుకున్నారంటూ తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నేతలు అవినీతి లేదా వివాదాల్లో చిక్కుకుంటే వెంటనే పదవి నుంచి తప్పించేందుకే ఈ నిర్ణయమనే కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై టీవీకే నాయకత్వం అధికారికంగా స్పందించలేదు.
By: A.N.Kumar | 12 Nov 2026 5:00 PM ISTసాధారణంగా సినిమాల్లో హీరో విలన్ల భరతం పట్టడానికి ముందే పక్కా ప్లాన్ వేసుకుంటాడు. కానీ తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకెళ్తున్న టీవీకే అధినేత.. సీఎం విజయ్.. ఇప్పుడు రాజకీయ రంగానికి కూడా సినీ ఫక్కీలో సరికొత్త 'స్క్రిప్ట్' రాస్తున్నట్లు తమిళ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ముందుగానే రాజీనామా లేఖలు తీసుకుని తన జేబులో పెట్టుకున్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మామూలుగా అయితే ఏ పార్టీలోనైనా నేతలు తప్పు చేస్తే ముందు షోకాజ్ నోటీసులు ఇవ్వడం.. ఆ తర్వాత విచారణ కమిటీ వేయడం.. చివరికి 'పరిశీలిస్తున్నాం' అని కాలయాపన చేయడం ఆనవాయితీ. కానీ విజయ్ మాత్రం ఆ పాత ఫార్ములాకు స్వస్తి పలికి 'ఇన్స్టంట్' న్యాయం వైపు మొగ్గు చూపుతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రచారం కనుక నిజమైతే ప్రజాప్రతినిధుల పరిస్థితి 'కత్తి మీద సాము' లాంటిదే. ఎక్కడైనా ఏదైనా వివాదంలో చిక్కుకున్నా.. అవినీతి ఆరోపణలు వచ్చినా.. అధిష్ఠానం పిలిచి మాట్లాడేలోపే, విజయ్ దగ్గరున్న రాజీనామా లేఖపై తేదీ పడిపోతుందన్నమాట. అంటే పదవి అనేది శాశ్వత ఆస్తి కాదని.. అది కేవలం పార్టీ ఇచ్చిన తాత్కాలిక అద్దె ఇల్లు మాత్రమేనని నేతలకు ముందే అర్థమయ్యేలా చేస్తున్నారనే చర్చ నడుస్తోంది.
పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. ఇటీవల ఇద్దరు నేతల వ్యవహారశైలి అధినేతకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందట. ఒక ఎమ్మెల్యే మహిళా జిల్లా కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు రావడం.. మరో మంత్రి అసాంఘిక కార్యకలాపాల వివాదంలో చిక్కుకున్నట్లు ప్రచారం జరగడంతో పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అందుకే "ఇకపై తప్పు చేస్తే వివరణలు అడగడం ఉండదు.. నేరుగా ఇంటికి పంపడమే" అన్నట్లుగా ఈ అడ్వాన్స్ రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు నేతలను క్రమశిక్షణలో ఉంచడానికి.. అవినీతిని అరికట్టడానికి ఇదొక కఠినమైన.. అవసరమైన చర్య అని కొందరు సమర్థిస్తున్నారు. మరోవైపు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల రాజీనామా లేఖలను పార్టీ అధినేత ముందుగానే తన వద్ద ఉంచుకోవడం ప్రజాస్వామ్య విలువలకు ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇలాగైతే ఎమ్మెల్యేలు సొంతంగా ఆలోచించే స్వేచ్ఛ కోల్పోయి.. కేవలం అధినేత ఆదేశాలకు తలూపే స్థితికి చేరుకుంటారనే విమర్శలు కూడా లేకపోలేదు.
ఈ వార్తలపై టీవీకే నాయకత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విజయ్ నిజంగానే అందరి దగ్గర సంతకాలు తీసుకుని ఫైల్ సిద్ధం చేసుకున్నారా? లేక పార్టీ నేతల్లో కొంత భయం పుట్టించి.. వారిని అదుపులో ఉంచడానికి ఇలాంటి లీకులు వదులుతున్నారా? అన్నది తేలాల్సి ఉంది.
ఈ అడ్వాన్స్ రాజీనామాల వ్యవహారం తమిళ రాజకీయాల్లో ఆసక్తికరమైన సస్పెన్స్ థ్రిల్లర్‌గానే కొనసాగనుంది. సీఎం విజయ్ తీరు చూసి ఏంటయ్యా ఇదీ అంటూ అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది.
