Begin typing your search above and press return to search.

జయలలిత బాటలో త్రిష.. సీఎం విజయ్ కు షాకేనా? అసలు వ్యూహమేంటి?

తమిళనాడులో హీరోయిన్ త్రిష పేరు మరోసారి రాజకీయ చర్చల్లో వినిపిస్తోంది. ఈ నెల 24న తిరునల్వేలిలో ‘త్రిష పేరవై’ పేరుతో అభిమాన సంఘం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆమెకు ‘ఇళయ పురట్చితలైవి’ బిరుదు ఇవ్వనున్నారనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై త్రిష లేదా ఆమె టీమ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

By:  A.N.Kumar   |   23 Nov 2026 10:30 PM IST
జయలలిత బాటలో త్రిష..  సీఎం విజయ్ కు షాకేనా? అసలు వ్యూహమేంటి?
X

తమిళనాడు రాజకీయాలంటేనే సినిమా.. ఆ సినిమా వెనుక ఉండే అభిమాన సంఘాల హంగామా.. ఎంజీఆర్ నుంచి మొదలై జయలలిత వరకు వెండితెర వెలుగులు రాజకీయ తెరపై సంచలనాలు సృష్టించిన చరిత్ర తమిళనాట ఉంది. ఇటీవలే దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తొలి ప్రయత్నంలోనే సీఎం అయిపోయాడు. కోలీవుడ్ ఈ దెబ్బకు షేక్ అయ్యింది. అందరూ రాజకీయాల్లోకి రావాలన్న ఉబలాటం మొదలైపోయింది. ఇప్పుడు ఆ వేడిని మరింత పెంచడానికి స్టార్ హీరోయిన్ త్రిష పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈసారి చర్చకు కారణం ఆమె కొత్త సినిమా కాదు.. ఆమె పేరుతో ఏర్పాటవుతున్న అభిమాన సంఘం..

తమిళనాడు రాజకీయాల్లో 'పురట్చితలైవి' అంటే విప్లవ నాయకురాలు అంటే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మాత్రమే గుర్తొస్తారు. అలాంటిది ఇప్పుడు త్రిష అభిమానులు ఏకంగా 'ఇళయ పురట్చితలైవి' అని యువ విప్లవ నాయకురాలు అనే బిరుదుతో 'త్రిష పేరవై' అభిమాన సంఘం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 24న తిరునల్వేలిలో జరగనున్న ఈ ప్రారంభోత్సవ వార్త ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అటు రాజకీయ విశ్లేషకులు కూడా ఇది కేవలం అభిమానుల అత్యుత్సాహమా లేక తెరవెనుక ఏదైనా పెద్ద వ్యూహమే నడుస్తోందా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఇటీవల కాలంలో టీవీకే అధినేత, సీఎం విజయ్‌తో త్రిష సాన్నిహిత్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు విజయ్ తన రాజకీయ ప్రయాణంలో దూసుకుపోతుంటే మరోవైపు త్రిష పేరుతో ఇలాంటి సంఘాలు పుట్టుకురావడం ఆసక్తికరంగా మారింది. త్రిష నిజంగానే రాజకీయాల్లోకి వస్తే విజయ్ పార్టీ తో సాగుతారా? లేక జయలలిత బాటలో నడుస్తూ సొంతంగా మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నం చేస్తారా? అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. గతంలో 'త్యాగ సుడర్ త్రిష పేరవై' పేరుతో ఫొటోలు వైరల్ అవ్వడం.. ఇప్పుడు ఏకంగా జయలలిత బిరుదును పోలిన పేరు పెట్టడం చూస్తుంటే ఫ్యాన్స్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

తమిళనాడులో ఎవరైనా స్టార్ హీరో లేదా హీరోయిన్ రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేది అభిమాన సంఘాలే. సామాజిక సేవ పేరుతో మొదలయ్యే ఈ సంఘాలే ఆ తర్వాత రాజకీయ కేడర్‌గా మారిపోతాయి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఈ వ్యవహారంపై త్రిష నుంచి కానీ.. ఆమె టీమ్ నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అసలు ఈ యువ విప్లవ నాయకురాలు బిరుదు గురించి త్రిషకు తెలుసో లేదో.. లేక అభిమానులే తమ అభిమాన నటిని కాబోయే నాయకురాలిగా ఊహించుకుని సంబరపడిపోతున్నారో ఈ నెల 24 తర్వాతే తేలనుంది. అప్పటివరకు తమిళ తంబీల రాజకీయ చర్చలకు త్రిష హాట్ టాపిక్‌గా మారడం మాత్రం ఖాయం..