కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?
తమిళనాడులోని తేనీలో ఓ భక్తురాలు ఆలయంలో పూజించిన కొబ్బరికాయను వేలంలో ఏకంగా రూ.2.50 లక్షలకు దక్కించుకుంది. మురుగన్ కల్యాణోత్సవం అనంతరం నిర్వహించిన వేలంలో దేవుడి ఆశీస్సుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించింది. గతంలో కర్ణాటకలో ఓ భక్తుడు ఇదే తరహాలో కొబ్బరికాయను రూ.6.50 లక్షలకు కొనుగోలు చేయడం విశేషం.
By: Madhu Reddy | 17 Nov 2026 11:03 PM ISTకాలం మారినా భక్తుడికి భగవంతుడిపై ఉండే అచంచలమైన భక్తిలో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు. తమను నడిపించే ఒక అపూర్వ శక్తి భగవంతుడని ఎంతోమంది జనాల విశ్వాసం. ఆ విశ్వాసంలో భాగంగానే కొబ్బరికాయకి కూడా ప్రత్యేకమైన స్థానం కల్పించబడింది. ముఖ్యంగా హిందువులకు అత్యంత పవిత్రమైనది మాత్రమే కాదు ప్రత్యేకమైనది కూడా.. ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా సరే కొబ్బరికాయ కొట్టాల్సిందే. అటువంటి కొబ్బరికాయ సాధారణంగా ధర ఎంత ఉంటుంది. రూ.30 లేదా రూ. 50.. కానీ ఇక్కడ ఒక కొబ్బరికాయ ధర తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. ఆ ఒక్క కొబ్బరికాయ ఏకంగా రూ.2.5 లక్షల ధర పలికిందని తెలిస్తే ఎవరైనా నమ్మగలరా? అది కొబ్బరికాయ ధర లేక కొబ్బరి తోట ఖర్చా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి రూ.2.5 లక్షల ధర పలికిన ఆ కొబ్బరికాయ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే ..తమిళనాడులోని తెనీలో ఒక భక్తురాలు ఒక్క కొబ్బరికాయను ఏకంగా రూ.2.50లక్షలు ఖర్చుపెట్టి సొంతం చేసుకుంది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంత ఖర్చు పెట్టడం వెనక అసలు కారణం ఏమిటి ? అనే విషయానికి వస్తే.. అక్కడ తిరుకళ్యాణం దీనినే మురుగన్ వివాహం అని కూడా అంటారు..ఈ వేడుక నిర్వహించిన తర్వాత పూజారులు కలశం లో ఉపయోగించిన కొబ్బరికాయను వేలం వేస్తారు. ఆ వేలంలో భాగంగానే ఒక భక్తురాలు దానిని ఏకంగా రూ.2.50. లక్షలు వెచ్చించి మరీ దక్కించుకుంది.అయితే ఇంత ధర వెచ్చించడానికి కారణం దేవుడి ఆశీస్సుల కోసమే.
ఇకపోతే ఈ ధర కాస్త ఆశ్చర్యంగా అనిపించినా.. గతంలో ఏకంగా రూ.5 నుండి రూ.6 లక్షల వరకు ధర పలికిన కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. మరి వాటి విషయానికి వస్తే.. 2021లో కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా జంఖండి తాలూకాలోని చిక్కలఖి గ్రామంలో ప్రతి ఏడాది మలింగరాయ జాతర శ్రావణమాసంలో జరిగే వివిధ పండుగల ముగింపు సమయంలో నిర్వహిస్తారు. జాతర ముగింపు సమయంలో దేవత సింహాసనం పై ఉంచిన వస్తువులను వేలం వేసే సంప్రదాయం ఉంది. అందులో భాగంగానే మలింగరాయ సింహాసనం పై పూజించే కొబ్బరికాయకి కూడా ఇక్కడ ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అందులో భాగంగానే ఆ కొబ్బరికాయను వేలం వేయగా.. విజయపుర జిల్లాలోని టికోటా గ్రామానికి చెందిన మహావీర్ హర అనే భక్తుడు ఏకంగా రూ.5,71,001 లకు దక్కించుకున్నాడు. అయితే అంతకుముందు 2020లో కూడా ఇదే భక్తుడు ఈ స్వామివారి కొబ్బరికాయను ఏకంగా రూ 6,50,001 కి దక్కించుకున్నారు. ఏది ఏమైనా స్వామి వారిపైన ఉన్న ప్రగాఢ విశ్వాసంతో ఆ కొబ్బరికాయను దక్కించుకోవడానికి భక్తులు లక్షల రూపాయలు ఖర్చు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
