Begin typing your search above and press return to search.

యూట్యూబర్ ను సెల్ఫీ పేరుతో దగ్గరకొచ్చి ఏకంగా 'లిప్ కిస్' అడిగాడు.. తర్వాత చూడాలి..

ఉదయ్‌పూర్‌లో థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్ జస్ట్ కెత్‌ను లిప్ కిస్ అడిగి వేధించిన ఆటో డ్రైవర్ అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా సెల్ఫీ పేరుతో వచ్చి పదేపదే ముద్దు అడిగిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనంతరం అఫ్తాబ్ తన ప్రవర్తనకు క్షమాపణ చెబుతూ మరో వీడియో విడుదల చేశాడు.

By:  A.N.Kumar   |   17 Nov 2026 12:21 PM IST
యూట్యూబర్ ను సెల్ఫీ పేరుతో దగ్గరకొచ్చి ఏకంగా లిప్ కిస్ అడిగాడు.. తర్వాత చూడాలి..
X

విదేశీ ముద్దుగుమ్మలను చూడగానే మనోళ్లకు ఎక్కడి లేని మోహం వచ్చిపడుతుందేమో.. విదేశాల్లో వీళ్లంతా రెచ్చిపోతారని భావించి ఓ ఆటోడ్రైవర్.. మన దేశంలో పర్యటిస్తున్న ఓ యూట్యూబర్ దగ్గరకు సెల్ఫో కోసం వెళ్లి ఓ లిప్ టు లిప్ కిస్ అడిగాడు.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

‘అతిథి దేవోభవ’ అనే మన గొప్ప సంస్కృతిని కొందరు ప్రబుద్ధులు పెడదోవ పట్టిస్తున్నారు. రాజస్థాన్‌లోని అందమైన పర్యాటక నగరం ఉదయ్‌పూర్‌లో ఓ ఆటో డ్రైవర్ చేసిన నిర్వాకం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అతిథిని దేవుడిలా చూసుకోమంటే ఈయనగారు ఏకంగా హద్దులు దాటి ‘లిప్ కిస్’ అడిగే స్థాయికి వెళ్లిపోయారు.

థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్.. ఐఆర్ఎల్ స్ట్రీమర్ 'జస్ట్ కెత్' మన దేశ అందాలను చూద్దామని ఎంతో ముచ్చటపడి ఉదయ్‌పూర్‌కు వచ్చారు. అక్కడి కోటలు, సరస్సులను చూపిస్తూ తన ఫాలోవర్ల కోసం లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అఫ్తాబ్ అనే స్థానిక ఆటో డ్రైవర్ పరిచయమయ్యాడు. రెండు రోజుల పాటు ఆమెను తన ఆటోలో తిప్పిన అఫ్తాబ్.. ఆమెకు బాగా క్లోజ్ అయిపోయానని ఫీల్ అయ్యాడో ఏమో కానీ ఒకరోజు రాత్రి అసలు స్వరూపం బయటపెట్టాడు.

ఆమె రోడ్డుపై నడుస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా హీరోలా ఎంట్రీ ఇచ్చిన అఫ్తాబ్.. మొదట సెల్ఫీ అన్నాడు. సరే కదా అని ఆమె ఆగితే వెంటనే అసలు కోరిక బయటపెట్టాడు. ఏమాత్రం మొహమాటం లేకుండా ‘లిప్ కిస్ ప్లీజ్’ అంటూ అసభ్యంగా అడగడం మొదలుపెట్టాడు. ఆమె సున్నితంగా తిరస్కరించినా ఏదో సినిమాలో హీరోలా మళ్ళీ మళ్ళీ అదే మాట అడుగుతూ విసిగించాడు. పాపం ఆ సమయంలో తన వెనుక వేలాది మంది లైవ్‌లో చూస్తున్నారన్న కనీస జ్ఞానం కూడా ఆ ప్రబుద్ధుడికి లేకుండా పోయింది.

ఇక ఆ వీడియోను జస్ట్ కెత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మనోడి ‘ఆతిథ్యానికి’ ఫిదా అయిపోయి ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. ఈ వ్యవహారం కాస్తా ఉదయ్‌పూర్ పోలీసుల దృష్టికి వెళ్లింది. ఇంకేముంది ఖాకీలు తమదైన శైలిలో ఆతిథ్యం ఇవ్వడానికి అఫ్తాబ్‌ను స్టేషన్‌కు పిలిపించి అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

పోలీసుల ‘మార్క్ ట్రీట్‌మెంట్’ రుచి చూశాక కానీ అఫ్తాబ్‌కు జ్ఞానోదయం కాలేదు. ఆ తర్వాత విడుదల చేసిన వీడియోలో మనోడి యాక్షన్ మొత్తం మారిపోయింది. చెవులు పట్టుకుని వినయవిధేయతలతో "నా పేరు అఫ్తాబ్.. నేను చేసిన పనికి చాలా సిగ్గుపడుతున్నాను. బయట నుంచి వచ్చే అతిథులను.. మహిళలను గౌరవించాలి. నా లాగా ఎవరూ తప్పు చేయకండి" అంటూ నీతులు వల్లించాడు.

సెల్ఫీతో మొదలైన కథ కాస్తా పోలీస్ స్టేషన్‌లో చెవులు పట్టుకునే వరకు వెళ్లింది. పర్యాటక ప్రాంతాలకు వచ్చే విదేశీయులకు మనం ఇవ్వాల్సింది గౌరవం.. భద్రత మాత్రమే.. ఇలాంటి వింత కోరికలు కాదని ఈ ఘటన మరోసారి గట్టిగా గుర్తుచేసింది.