Begin typing your search above and press return to search.

పింకీ సార్ పింకీ అంతే.. దీని ముందు బాహుబలి బర్రెలన్నీ పక్కకు బలాదూర్

రాజస్థాన్‌లోని పుష్కర్ పశువుల సంతలో రెండు అడుగుల ఎత్తున్న మినీ గేదె ‘పింకీ’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాని యజమాని కోటి రూపాయల ధర చెబుతుండటంతో అందరి దృష్టి దానిపైనే పడింది. పాల దిగుబడి కంటే దాని ముద్దైన రూపమే ప్రత్యేకతగా మారింది. పింకీతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు సందర్శకులు పోటీపడుతున్నారు.

By:  A.N.Kumar   |   25 Nov 2026 3:41 PM IST
పింకీ సార్ పింకీ అంతే.. దీని ముందు బాహుబలి బర్రెలన్నీ పక్కకు బలాదూర్
X

సాధారణంగా పశువుల సంతకు వెళ్తే ఏం కనిపిస్తాయి? కొండల్లాంటి ఎద్దులు.. బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి రథాన్ని లాగే రేంజ్‌లో ఉండే బలిష్టమైన గేదెలు కనిపిస్తాయి.. అక్కడికి వెళ్లిన రైతులు.. వ్యాపారులు.. దీని బరువెంత? రోజుకు ఎన్ని బకెట్లు పాలు పిండుకోవచ్చు? అని లెక్కలేస్తుంటారు. కానీ రాజస్థాన్‌లోని పుష్కర్ పశువుల సంతలో మాత్రం ఆ పాత చింతకాయ పచ్చడి లెక్కలన్నీ తలకిందులయ్యాయి. అక్కడ ఇప్పుడు పాలకు కాదు.. బరువుకు కాదు.. కేవలం క్యూట్‌నెస్ కు మాత్రమే కోట్లు కుమ్మరిస్తున్నారు. ఆ సంతలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగుతోంది.. అదే పింకీ.. పింకీ.. అసలు ఏంటీ పింకీ కథ..

ఈ పింకీ ఎవరో కాదు సుమీ.. అచ్చంగా రెండు అడుగుల ఎత్తున్న ఒక మినీ గేదె. చూడటానికి అచ్చం పిల్లలు ఆడుకునే బొమ్మలా ఉండే ఈ చిన్నారి గేదె.. పుష్కర్ సంతలో అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడున్న భారీ బర్రెలన్నింటికీ ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ తెప్పిస్తోంది. అయితే అసలు ట్విస్ట్ దాని ఎత్తులో లేదు.. దాని యజమాని చెప్పిన ధరలో ఉంది. ఈ పింకీ విలువ అక్షరాలా ఒక కోటి రూపాయలట..

ఈ రేటు విన్న సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. కోటి రూపాయలు పెడితే హైదరాబాద్‌లో ఓ మంచి ఫ్లాట్.. లేదంటే ఓ లగ్జరీ కారు కొనుక్కోవచ్చు. కానీ ఈ మినీ గేదె ముందు అవన్నీ దిగదుడుపే అంటున్నారు యజమాని. పాల దిగుబడి ఎంత? అని ఎవరైనా పొరపాటున అడిగితే యజమాని సీరియస్ అయ్యేలా ఉన్నారు. ఎందుకంటే పింకీని కొనేది పాలు పిండుకోవడానికి కాదు.. పక్కన నిలబడి సెల్ఫీలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకోవడానికి..

పుష్కర్ ఫెయిర్‌లో ఇప్పుడు పశువుల మధ్య పోటీ కంటే పింకీతో ఫొటో దిగేందుకు జనం మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ఇంత శాంతస్వభావం ఉన్న గేదెను ఎక్కడా చూడలేదు అంటూ జనం మురిసిపోతున్నారు. నిజమే మరి రెండు అడుగుల ఎత్తున్న గేదె కోపం తెచ్చుకున్నా మాత్రం ఏం చేస్తుంది? మహా అయితే మన మోకాలికి తల బాదుకుంటుందేమో.. అందుకే జనం భయం లేకుండా దాని చుట్టూ చేరి ఫొటోషూట్లు చేస్తున్నారు.

ఒకప్పుడు పెద్దది అయితేనే గొప్పది అనే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు జమానా మారింది. పెద్ద ఫోన్ల కంటే కాంపాక్ట్ ఫోన్లకు.. పెద్ద కార్ల కంటే మినీ కూపర్లకు క్రేజ్ పెరిగినట్లు.. పశువుల మార్కెట్‌లోనూ మినీ ట్రెండ్ మొదలైంది. నిజంగానే పింకీకి కోటి రూపాయలు పెట్టి కొనే మహానుభావుడు దొరుకుతాడా? లేదా అనేది పక్కన పెడితే.. ఫ్రీ పబ్లిసిటీ మాత్రం పీక్స్‌కు చేరింది.

ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. రేపు ఎవరైనా ఒక అడుగు ఎత్తున్న దూడను సంతకు తీసుకొచ్చి దీని రేటు రెండు కోట్లు అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పాల డబ్బాతో సంబంధం లేకుండా కేవలం పాపులారిటీతో కోటి రూపాయల మార్కును తాకిన పింకీ.. నేటి తరం ఇన్‌ఫ్లుయెన్సర్లందరికీ గట్టి పోటీ ఇస్తోంది.. అట్లుంటదీ మన పింకీతోని అనిపిస్తోంది..