Begin typing your search above and press return to search.

100 మంది బౌన్సర్లు.. కరెన్సీ నోట్లతో స్వాగతం.. ఈ గుర్రం రాచరికం వెనుక అసలు కథ

రాజస్థాన్‌లోని పుష్కర్ పశువుల సంతలో ‘బాదల్’ అనే గుర్రం రాచరికపు ఎంట్రీతో అందరినీ ఆశ్చర్యపరిచింది. 24 నెలల వయసున్న ఈ గుర్రం వెంట 100 మంది బౌన్సర్లు రాగా, కరెన్సీ నోట్లు వెదజల్లి స్వాగతం పలికారు. దీని పోషణకు నెలకు రూ.50 వేలు ఖర్చవుతుండగా, యజమాని దగ్గరున్న మూడు గుర్రాల విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

By:  A.N.Kumar   |   17 Nov 2026 3:31 PM IST
100 మంది బౌన్సర్లు.. కరెన్సీ నోట్లతో స్వాగతం..  ఈ గుర్రం రాచరికం వెనుక అసలు కథ
X

మన దేశంలో సామాన్యుడికి ఆస్పత్రికి వెళ్లాలన్నా.. ఆఫీసుకి వెళ్లాలన్నా ట్రాఫిక్ కష్టాలు తప్పవు. కాస్త పేరున్న సెలబ్రిటీకో.. పొలిటీషియన్‌కో అయితే నలుగురు గన్‌మెన్‌లు.. ఓ పది మంది బౌన్సర్లు ఉంటారు. కానీ రాజస్థాన్‌లోని పుష్కర్ పశువుల సంతలో ఓ తెల్లటి గుర్రం ఇచ్చిన ఎంట్రీ చూస్తే ‘మనం మనుషులుగా పుట్టి ఏం సాధించాం రా బాబూ ‘ అని ఎవరికైనా అనిపించక మానదు.

ఆ వీఐపీ గుర్రం పేరు బాదల్. సాధారణంగా సంతకు పశువులను యజమానులు తాడు కట్టి తీసుకొస్తారు. కానీ బాదల్ కోసం ఏకంగా 100 మంది బౌన్సర్లు రక్షణ వలయంగా నడిచారు. అది చాలదన్నట్లు ఆ గుర్రం అడుగుపెడుతుంటే గాల్లోకి కరెన్సీ నోట్లను వెదజల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఆ దృశ్యం చూస్తుంటే ఏదో పాన్ ఇండియా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హీరో ఎంట్రీ ఇచ్చినట్లు ఉందే తప్ప పశువుల సంతలా అస్సలు కనిపించలేదు.

బాదల్ వయసు కేవలం 24 నెలలే. కానీ ఎత్తు మాత్రం ఏకంగా 66 అంగుళాలు.. దాని ఠీవి.. రాజసం చూస్తుంటే సంతకు వచ్చిన మిగతా గుర్రాలన్నీ కాంప్లెక్స్‌తో తలదించుకునేలా ఉన్నాయి. ఇక దీని మెయింటెనెన్స్ ఖర్చు వింటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జీతాలు కూడా చిన్నబోతాయి. బాదల్ డైట్, ఆరోగ్యం, బ్యూటీ కేర్ కోసం నెలకు అక్షరాలా రూ. 50 వేలు ఖర్చవుతుందట. అంటే ఏడాదికి రూ. 6 లక్షలు.. నెల జీతం ముప్పై వేలు రాక మనం పడరాని పాట్లు పడుతుంటే బాదల్ మాత్రం నెలకు యాభై వేల ప్యాకేజీతో దర్జాగా బతికేస్తోంది.

బాదల్ ఒక్కటే ఇలా ఉందనుకుంటే పొరపాటే. దీని యజమాని దగ్గర ఇలాంటి "సెలబ్రిటీ" గుర్రాలు మొత్తం మూడు ఉన్నాయట. ఆ మూడింటి మార్కెట్ విలువ కలిపి ఏకంగా రూ. 5 కోట్లకు పైమాటే.. ఒకప్పుడు గుర్రంలా పనిచేస్తున్నాడు అంటే కష్టానికి గుర్తుగా అనేవారు. కానీ ఈ రోజుల్లో గుర్రంలా బతుకుతున్నాడు అంటే వీటిని చూసి కోటీశ్వరుడిలా విలాసవంతంగా బతుకుతున్నాడని అర్థం మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

పుష్కర్ సంతలో బాదల్ చేసిన హంగామా చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "వచ్చే జన్మలోనైనా మనిషిగా కాకుండా ఇలాంటి కోటీశ్వరుడి ఇంట్లో గుర్రంగా పుడితే బాగుండు" అని నిట్టూరుస్తున్నారు. కరెక్టే కదా మరి.. 100 మంది బౌన్సర్లు.. నెలకు 50 వేల మెయింటెనెన్స్.. కరెన్సీ నోట్ల వర్షం.. ఈ మాత్రం లగ్జరీ ఉంటే ఎవరికైనా గుర్రం జన్మే బెటర్ అనిపిస్తుంది.