కూతురు పెళ్లిలో అన్నీ మరిచిపోయి కొడుకుతో కలిసి డ్యాన్స్ చేసిన వైఎస్ షర్మిల.. వైరల్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేడుక బెంగళూరు సమీపంలోని నందిహిల్స్లో జరిగింది. సంగీత్ కార్యక్రమంలో షర్మిల తన కుమారుడితో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజకీయ హోదాను పక్కనపెట్టి కుటుంబంతో సందడి చేసిన షర్మిలను నెటిజన్లు అభినందిస్తున్నారు.
By: A.N.Kumar | 29 Nov 2026 9:16 PM ISTనిత్యం రాజకీయ వ్యూహాలు.. ప్రత్యర్థులపై విమర్శలు.. ప్రజా సమస్యలపై పోరాటాలతో తీరిక లేకుండా గడిపే నాయకుల జీవితంలో కుటుంబ వేడుకలు ఒక మధురమైన విరామం లాంటివి. ఆ క్షణాల్లో వారు తమ హోదాలను.. బాధ్యతలను పక్కనపెట్టి సాధారణ మనుషులుగా మారిపోతారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జీవితంలోనూ అలాంటి అత్యంత భావోద్వేగపూరితమైన ఆనందకరమైన సందర్భం చోటుచేసుకుంది. తన గారాలపట్టి కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేడుకలో షర్మిల ఒక రాజకీయ నాయకురాలిగా కాకుండా ఒక సగటు తల్లిగా.. ప్రేమగల కుటుంబ సభ్యురాలిగా మారిపోయి వేడుకలో ప్రాణం పోశారు.
బెంగళూరు సమీపంలోని ప్రకృతి రమణీయమైన నందిహిల్స్ వద్ద అత్యంత సన్నిహితులు.. బంధుమిత్రుల సమక్షంలో అంజలి రెడ్డి వివాహ వేడుక కన్నుల పండువగా జరిగింది. ఈ పెళ్లి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమం అందరి హృదయాలను హత్తుకుంది. సాధారణంగా మీడియా సమావేశాల్లో బహిరంగ సభల్లో ఎంతో గంభీరంగా.. దూకుడుగా కనిపించే షర్మిల.. ఈ వేడుకలో పూర్తిగా భిన్నమైన కోణంలో కనిపించారు. కుమార్తెను అత్తారింటికి సాగనంపే ముందు ప్రతి తల్లి మనసులో ఉండే ఆనందం, ఆత్మీయత ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించాయి.
సంగీత్ వేడుకలో భాగంగా షర్మిల తన కుమారుడితో కలిసి వేసిన డ్యాన్స్ ఈ వేడుకకే హైలైట్గా నిలిచింది. ఎలాంటి మొహమాటం లేకుండా ఒక తల్లి తన పిల్లల ఆనందంలో ఎలా మమేకమవుతుందో చాటిచెబుతూ ఆమె వేసిన ఉత్సాహభరితమైన స్టెప్పులు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచాయి.. ఆకట్టుకున్నాయి. తల్లీకొడుకుల మధ్య ఉన్న స్వచ్ఛమైన ఆప్యాయత, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వేసిన అడుగులు చూస్తుంటే రాజకీయ ఒత్తిడులకు దూరంగా ఒక అందమైన కుటుంబ చిత్రం కళ్లముందు కదలాడినట్లయింది.
ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారాయి. రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా నెటిజన్లు, అభిమానులు ఈ వీడియోలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా పిల్లల సంతోషం ముందు ఏ హోదా అయినా చిన్నదే అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఒకవైపు కూతురి పెళ్లి జరిపిస్తున్న తల్లిగా బాధ్యతను నిర్వర్తిస్తూనే మరోవైపు కొడుకుతో కలిసి చిన్నపిల్లలా సందడి చేసిన షర్మిల తీరు అందరి మనసులను గెలుచుకుంది.
నిత్యం వార్తల్లో నిలిచే వైఎస్ షర్మిల.. ఈసారి తన కుటుంబంలోని మధుర క్షణాలతో.. ఒక తల్లి ప్రేమతో అందరి హృదయాలను తాకారు. ఈ వేడుక తాలూకు జ్ఞాపకాలు ఆమె జీవితంలోనే కాకుండా.. అభిమానుల మదిలోనూ చిరకాలం నిలిచిపోతాయి.
