Begin typing your search above and press return to search.

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

బిహార్‌కు చెందిన ప్రేమ్ కుమార్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ రామకథ కార్యక్రమానికి 6.3 కిలోల బంగారు ఆభరణాలతో హాజరయ్యారు. రూ.7 కోట్లకు పైగా విలువైన బంగారంతో వచ్చిన ఆయనను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఆయన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  A.N.Kumar   |   20 Nov 2026 11:07 PM IST
నడిచే బంగారు దుకాణంలా గోల్డ్ మ్యాన్.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్
X

సాధారణంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు భక్తులు మనశ్శాంతి కోసం.. దేవుడి దర్శనం కోసం వెళ్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన రామకథకు వెళ్లిన భక్తులకు మాత్రం దేవుడి కంటే ముందే ఒక నడిచే బంగారు గని దర్శనమిచ్చింది.. ఆయనే బిహార్‌కు చెందిన ప్రేమ్ కుమార్ సింగ్. జనం ఆయన్ను ప్రేమగా గోల్డ్ మ్యాన్ అని పిలుచుకుంటున్నారు కానీ అసలు విషయం ఏంటంటే.. ఆయన ఒంటిపై ఉన్న బంగారం చూస్తే ఏ పెద్ద జ్యువెలరీ షాపు ఓనర్ అయినా కాంప్లెక్స్ ఫీల్ అవ్వాల్సిందే.

మనం పెళ్లిళ్లకు.. పేరంటాలకు వెళ్తే ఒకటి రెండు తులాల గొలుసు వేసుకుని.. అది ఎక్కడ తెగిపోతుందో అని పది నిమిషాలకు ఒకసారి తడుముకుంటూ ఉంటాం. కానీ ప్రేమ్ కుమార్ సింగ్ మాత్రం ఏకంగా 6.3 కిలోల బంగారాన్ని ఒంటిపై వేసుకుని.. అది ఏదో పత్తి మూట అన్నంత తేలికగా తిరిగేస్తున్నారు. మార్కెట్ లెక్కల ప్రకారం దీని విలువ రూ.7 కోట్లకు పైమాటే..

ఆయన మెడలో వేసుకున్న గొలుసులను చూస్తే బహుశా ఆయన ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లి మెడ కండరాలకు వ్యాయామం చేస్తారేమో అన్న సందేహం కలగకమానదు. ఇక చేతివేళ్లకు ఉన్న ఉంగరాలు, మణికట్టుకు ఉన్న బ్రేస్లెట్లు చూస్తే.. ఆయన చేయి ఎత్తి ఎవరికైనా 'హాయ్' చెప్పాలన్నా కనీసం ఒక డంబెల్ ఎత్తినంత శక్తి కావాలి.

ప్రతాప్‌గఢ్‌ రామకథలో అసలు కథ కంటే ప్రేమ్ కుమార్ సింగ్ గారి బంగారు కథే హైలైట్ అయింది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు సంప్రదాయ దుస్తుల్లో నిరాడంబరంగా వస్తారు. కానీ మన గోల్డ్ మ్యాన్ ఎంట్రీ ఇవ్వగానే.. అక్కడున్న లైట్ల వెలుతురు కూడా ఆయన ఒంటిపై ఉన్న బంగారం మెరుపు ముందు వెలవెలబోయింది. ఇక జనం సంగతి చెప్పేదేముంది? ప్రవచనాలు వినడం కాసేపు పక్కన పెట్టి ఈ కదిలే 7 కోట్ల ఆస్తితో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. కనీసం ఆయన పక్కన నిలబడి ఫొటో దిగితే ఆ బంగారం గాలి తగిలైనా తమ దరిద్రం పోతుందేమోనని కొందరు ఆశపడి ఉంటారు..

సెలబ్రిటీలు ఖరీదైన కార్లలో తిరుగుతారు.. బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు. కానీ ప్రేమ్ కుమార్ సింగ్ మాత్రం బట్టలు చిరిగిపోతాయి.. కార్లు పాతబడిపోతాయి.. బంగారమే శాశ్వతం అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మినట్టున్నారు. అందుకే బంగారాన్నే తన ఆధార్ కార్డుగా మార్చుకున్నారు.

అయితే ఈ వార్త చూసిన నెటిజన్లకు మాత్రం ఒకటే డౌట్ వస్తోంది. ఇంత బంగారం వేసుకుని బయట తిరుగుతున్నారంటే ఆయనకు నిజంగానే అంత ధైర్యం ఉందా? లేక ఆయన వెనుక ఒక మినీ పోలీస్ స్టేషన్ నడుస్తోందా? అని... కొందరికి బంగారం ఒక పెట్టుబడి.. మరికొందరికి అలంకారం.. కానీ మన ప్రేమ్ కుమార్ సింగ్ కి మాత్రం అది ఒక 'హెవీ వెయిట్' లైఫ్‌స్టైల్..