Begin typing your search above and press return to search.

భార్య ఉసురు తీసిన సీక్రెట్ ఫోన్... తెరపైకి 'దృశ్యం' సినిమా ఘటన!

ఈ సమయంలో కోపంతో అర్జున్ తన భార్యను గొంతు కోసి చంపి, ఆమె మృతదేహాన్ని మంచంతో పాటు మడతపెట్టి, వారి ఇంటి వెనుక తవ్విన లోతైన గోతిలో పాతిపెట్టాడు.

By:  Raja Ch   |   26 Dec 2025 12:21 PM IST
భార్య ఉసురు తీసిన సీక్రెట్  ఫోన్... తెరపైకి దృశ్యం సినిమా ఘటన!
X

ఇటీవల కాలంలో దాంపత్య జీవితంలో నెలకొంటున్న దారుణ హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ప్రతీ రోజు దేశంలో ఏదో ఒక మూల ఈ తరహా ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయని అంటున్నారు. ఇద్దరి మధ్యా అవగాహన లేకో, అనుమానం పెరిగో, మూడో మనిషి ఎంట్రీ తోనో.. కారణం ఏదైనా, కారకులు ఎవరైనా.. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న హత్య ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ప్రియుడితో కలిసి భర్తను చంపి, డ్రమ్మ్ లో పెట్టి, పైన సిమెంట్ వేసిన భార్య ఒకరైతే.. ప్రియుడితో కలిసి ఏకంగా భర్త తల, కాళ్లూ చేతులు, మొండెం వేరు చేసి, కవర్లో ప్యాక్ చేసి వేర్వేరు ప్రదేశాల్లో పాడేసిన భార్య కథ మరొకటి. ఇదే సమయంలో.. భార్యను చంపి, ఇంట్లో పాతిపెట్టి, పైన టైల్స్ కప్పిన ఘటన ఒకటైతే... పర్యాటకానికని తీసుకెళ్లి భార్యను పైనుంచి కిందకు తోసేసి, ప్రమాదం అని నమ్మించే ప్రయత్నం చేసిన భర్త వ్యవహారం మరొకటి అని అంటున్నారు!

ఇలా వరుస ఘటనలు వెలుగులోకి వస్తోన్న నేపథ్యంలో.. ఇష్టమైతే కలిసి ఉండాలి.. వద్దను కుంటే విడిపోవాలి.. ఎవరి బ్రతుకు వాళ్లు బ్రతకాలి.. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో నచ్చిన, నమ్మకమైన, అర్ధం చేసుకున్న ఓ తోడు దొరకరా అనుకోవాలి కానీ.. అనవసరమైన ఆవేశానికి పోయి, హత్యల వరకూ వెళ్లి, జీవితాన్ని కటకటాలపాలు చేసుకోవడం ఎందుకని పలువురు సూచిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా యూపీలో ‘దృశ్యం’ సినిమా తరహా ఘటన ఒకటి చోటు చేసుకుంది.

అవును... తనకు తెలియకుండా రహస్యంగా మొబైల్ ఫోన్ వాడుతుందనే కారణం వల్ల జరిగిన వాగ్వాదం అనంతరం.. తన భార్యను చంపి, మంచంతో సహా మతడపెట్టి, ఇంటి వెనుక పెద్ద గొయ్యి తీసి పాతిపెట్టి, అనంతరం తన భార్య కనిపించడం లేదని, ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయిందని, ఆత్మహత్య చేసుకుందని రకరకాల కబుర్లు చెప్పిన వ్యక్తి.. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి వాస్తవం చెప్పాడు. ఈ సమయంలో చాలా మందికి 'దృశ్యం' సినిమా మెదిలిందని అంటున్నారు!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన అర్జున్ కు రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఈ క్రమంలో లుథియానాలో అతడు కూలీగా పనిచేస్తున్న అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో.. అతని భార్య ఖుష్బూ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కనిపించింది. వాస్తవానికి ఆమె దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నట్లు భర్త అర్జున్ కి తెలియదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆ రాత్రి ఇంట్లో ఇద్దరి మధ్యా ఈ విషయంపై వాగ్వాదం జరిగిందని అంటున్నారు. ఈ సమయంలో కోపంతో అర్జున్ తన భార్యను గొంతు కోసి చంపి, ఆమె మృతదేహాన్ని మంచంతో పాటు మడతపెట్టి, వారి ఇంటి వెనుక తవ్విన లోతైన గోతిలో పాతిపెట్టాడు. అనంతరం.. కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా ఖుష్బూ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని ప్రచారం చేస్తూ, అందరినీ నమ్మిచే ప్రయత్నం చేశాడు.

అయితే.. ఎన్ని రోజులైనా ఆమె ఆచూకీ దొరక్కపోవడం, కనీసం తల్లితండ్రులకు కూడా ఆమె ఫోన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తండ్రి.. పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు! మరోవైపు తన అల్లుడే ఆమెను చంపేసి ఉంటాడనే అనుమానాలనూ వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో అర్జున్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. ఈ సమయంలో తన భార్య చెప్పకుండా వెళ్లిపోయిందని మొదలుపెట్టాడు అర్జున్.

అనంతరం.. ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆమె మృతదేహాన్ని నదిలోకి విసిరేశానని పేర్కొన్నాడు. దీంతో.. గ్రామం వెలుపల ఉన్న నదిలో గంటలు తరబడి గజ ఈతగాళ్లతో వెతికించారు పోలీసులు. అయినా నో యూజ్! ఈ క్రమంలో పోలీసులు అర్జున్ ను ఇంకాస్త "గట్టిగా" విచారించినట్లు తెలుస్తోంది. దీంతో... ఇంటి వెనుక పాతిపెట్టిన విషయాన్ని ఒప్పుకున్నాడు. దీంతో.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టానికి తరలించారు.

ఈ సందర్భంగా స్పందించిన గోరఖ్ పూర్ సర్కిల్ ఆఫీసర్ శిల్పా కుమారి... తన భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే అర్జున్ ఈ దారుణానికి పాల్పడ్డాడని.. వీరికి రెండేళ్ల క్రితం వివాహం అయ్యిందని.. వీరికి ఇంకా సంతానం లేరని తెలిపారు!