తనిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబర్ అరెస్ట్!
మదురైలోని తనిష్క్ షోరూమ్‌లో రూ.31 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాల చోరీ కేసులో యూట్యూబర్ మీనాక్షి, ప్రధాన నిందితుడు నిశాంత్ తండ్రి సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగిలించిన సొత్తులో ఇప్పటివరకు 6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిశాంత్ కోసం తొమ్మిది ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
By: Sivaji Kontham | 15 Nov 2026 1:03 PM ISTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తనిష్క్ బంగారం దొంగతనం కేసులో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. దొంగిలించిన బంగారం విలువ సుమారు 31 కోట్లు కావడంతో ఇది సంచలనంగా మారింది. తమిళనాడులోని మదురైలో జరిగిన ఈ భారీ దోపిడీ కేసులో తమిళ ఇన్‌ఫ్లుయెన్సర్ కం యూట్యూబర్ మీనాక్షిని.. ప్రధాన నిందితుడు నిశాంత్ తండ్రి సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో విలాసవంతమైన రీల్స్ చేస్తూ పాపులర్ అయిన సెలబ్రిటీలు ఇలాంటి ఘోరమైన నేరంలో భాగం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మదురై బైపాస్ రోడ్డులోని తనిష్క్ షోరూమ్‌లో జరిగిన ఈ భారీ చోరీ అందరినీ విస్మయానికి గురిచేసింది. రాత్రి సమయంలో జరిగిన ఈ దోపిడీలో ఏకంగా రూ. 16 కోట్ల విలువైన 11.65 కిలోల బంగారం.. రూ. 15 కోట్ల విలువైన డైమండ్ ఆభరణాలు మాయమయ్యాయి. లాకర్లలో ఉన్న నగలు సురక్షితంగా ఉన్నా.. కేవలం డిస్‌ప్లే సెక్షన్‌లో ఉన్న అత్యంత విలువైన ఆభరణాలనే దుండగులు ఎత్తుకెళ్లారని కథనాలొచ్చాయి.
ఈ దోపిడీకి మాస్టర్ మైండ్‌గా ఉన్న యూట్యూబర్ కం బైక్-టాక్సీ డ్రైవర్ నిశాంత్ పక్కాగా ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. షోరూమ్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను ఆసరాగా చేసుకుని.. బిల్డింగ్ పై నుంచి తాడు సాయంతో లోపలికి ప్రవేశించిన నిశాంత్.. సుమారు గంటపాటు దుకాణంలోనే గడిపి నగలను సంచులలో సర్దుకుని స్కూటర్‌పై పరారయ్యాడు. అంతకుముందు కూడా నవంబర్ 5న ఒకసారి రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నిశాంత్ కోసం పోలీసులు 9 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిశాంత్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో పోలీసులు అతడి ఆచూకీ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు జరిపిన సోదాల్లో దొంగిలించిన సొత్తులో దాదాపు 6 కిలోల బంగారాన్ని రికవరీ చేయగలిగారు. దొంగిలించిన బంగారాన్ని దాచేందుకు యూట్యూబర్ మీనాక్షి సహకరించడంతో మదురై పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తనిష్క్‌లో ఈ ఊహించని ఘటనకు కస్టమర్లు బెంబేలెత్తారు. వివాహాలు, శుభకార్యాల నిమిత్తం ముందస్తుగా నగలు బుక్ చేసుకున్న వినియోగదారులు తీవ్రంగా ఆందళన చెందగా.. షోరూమ్ సిబ్బంది స్పందించి.. బాధితులకు ఇతర బ్రాంచ్‌ల ద్వారా అదే రకమైన ఆభరణాలను అందజేస్తామని హామీ ఇవ్వడంతో కొంత ఊరట లభించింది.
