పసితనమే పగతనంగా...భావితరం భయపెడుతోంది !
నేటి బాలలే రేపటి పౌరులు అన్నది సూక్తి. దేశానికి పనికి వచ్చే పౌరులు తయారు అయ్యేది పాఠశాలలోనే. వారి నుంచే దేశాన్ని ఏలే వారు ప్రతిభావంతులు ఆవిష్కర్తలు వస్తారు
By: Satya P | 20 Aug 2026 9:09 AM ISTనేటి బాలలే రేపటి పౌరులు అన్నది సూక్తి. దేశానికి పనికి వచ్చే పౌరులు తయారు అయ్యేది పాఠశాలలోనే. వారి నుంచే దేశాన్ని ఏలే వారు ప్రతిభావంతులు ఆవిష్కర్తలు వస్తారు. వారే రేపటి ప్రతినిధులు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే వారి చేతులలోనే దేశం ఉండబోతోంది. అలాంటి భావి పౌరులు తయారవుతున్నారా అన్నదే ధర్మ సందేహం. విద్యార్ధి దశలోనే విద్వంశం మనస్తత్వం. పసితనంలోనే కసాయి తనం. ఏకంగా గురువునే హతమర్చేసే క్రూరత్వం. ఇది ఎలా వచ్చింది, ఎక్కడ నుంచి వచ్చింది అన్నదే సమాజం ముందున్న ప్రశ్నలు.
విద్యాబుద్ధులు చెప్పే వారినే :
తాజాగా జరిగిన ఇక ఘాతుకం యావత్తు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ కే. రూపారెడ్డిని ఇద్దరు విద్యార్ధులు దారుణంగా హత్య చేశారు. ఈ ఇద్దరు అదే పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థులు. వీరే హంతకులు అని తేలడంతో సమాజం నివ్వెరపోయే పరిస్థితి. వీరు చెడు అలవాట్లకు బానిస అయ్యారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆగస్టు 11న డబ్బుల కోసం ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఇంటికి వెళ్లిన విద్యార్థులు ఆమె వారిని గుర్తించడంతో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి నగదు దోచుకెళ్ళారు. ఇదంతా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు.
పగ ప్రతీకారంతోనే :
ఇక్కడ ప్రిన్సిపాల్ కే రూపారెడ్డి యాభై ఏళ్ళ మహిళ. నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ గా ఆమె విధులు నిర్వహిస్తునారు. వీరు ఆ ప్రిన్సిపాల్ పై పగ పెంచుకున్నారు. వీరి చెడు అలవాట్లను ఆమె చూసి మందలించింది అన్నది కక్ష పెంచుకున్నారు. ఇందులో ఒక విద్యార్ధి మీద గతంలో హాస్టల్‌లో జరిగిన కొన్ని ఘటనల కారణంగా ప్రిన్సిపాల్ మందలించి చర్యలు తీసుకోవడం జరిగింది. అంతే కాదు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన వీరు రూపా రెడ్డిని చంపాలని డబ్బు కోసం ఐదు రోజుల ముందే పథకం వేశారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు.
బాల్యంలోనే నేరం మరకలు :
బాలలు బంగారం లాంటి వారు అన్నది నిన్నటి మాట. ఇపుడు వారి మెదళ్ళు చెదిరిపోయాయి. వారి చేతుల్లో లేవు. వారి చేతలు కూడా వారిని కావు. వారిని సోషల్ మీడియా నియంత్రిస్తోంది. అందులో కంటెంట్ నెగిటివ్ గా ఉన్నదే వారిని ఆకట్టుకుంటోంది. అంతే కాదు ఒంటరిగా గడపడం చెడు సావాసాలకు లోను కావడం కూడా వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తోంది. ఇక నేరం నిండిన బుర్రలకు గురువులు పెద్దలు తేడా తెలియడం లేదు, డ్రగ్స్ గంజాయి ఇతర మత్తు పదార్ధాల రవాణా కూడా ఏకంగా పాఠశాలల స్థాయి దాకా వచ్చేస్తోంది. ఇలా అన్నీ కలసి బాల్యాన్ని నేరమయం చేస్తున్నాయి. మత్తెక్కిన మొద్దుబారిన బుర్రలకు మంచి చెప్పే వారు శత్రువులు అవుతున్నారు. అది తల్లిదండ్రులు అయినా గురువులు అయినా వారికి ఒక్కటే అన్నది చాలా సంఘటనల ద్వారా తెలుస్తోంది.
టెక్నాలజీతో చెడు వైపు :
టెక్నాలజీ ఎపుడూ రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిదే. అలాంటి దానిని మంచి కోసం వాడాలి. కానీ భావి పౌరుల చేతిలో అది పడి వారి విచక్షణకు పరీక్ష పెడుతోంది. అందులో ఓడి వాడిన వారే అధిక శాతంగా ఉంటున్నారు. ఇక మంచి పాఠశాలలో తమ బిడ్డలను వేశామని వారు అక్కడ బాగా చదువుకుంటున్నారు అని భ్రమపడుతూ తమ బిజీ లైఫ్ తో గడిపే తల్లిదండ్రులు కూడా ఈ నేరగాళ్ళ విషయంలో పాత్రధారులే అని చెప్పక తప్పదు. భౌతిక అవసరాలు సుఖాలు డబ్బు సంపాదన కుటుంబంలో బంధాలను బాధ్యతలను ఏమీ కాకుండా చేసేస్తున్న నేపథ్యంలో బాల్యం నుంచి భావి పౌరులు తయారు కావడం లేదు, పగతో రగులుతున్న కఠినాత్ములు వస్తున్నారు. వీరి చేతులలో చేతలలో భావి భారతం ఎలా ఉండబోతోందో తలచుకుంటేనే భయం వేస్తోంది. మరి దీనిని నియంత్రించి సరైన దారిలో పెట్టేది ఉందా అంటే పరిష్కారం ఎపుడూ ఉంటుంది. కానీ అది అత్యంత కఠినంగా ఉంటుంది. అందరూ కలిసి కృషి చేస్తేనే రేపటి పౌరులను కాపాడుకోగలం అన్నది ఈ దుర్ఘటనల నుంచి అందుతున్న సారాంశం.
