బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..
అరాచకానికి పరాకాష్ఠగా నిలిచిన రాప్తాడు ఘటన సమాజాన్ని నిశ్చేష్టం చేసింది.
By: A.N.Kumar | 3 Nov 2026 3:05 PM ISTఅరాచకానికి పరాకాష్ఠగా నిలిచిన రాప్తాడు ఘటన సమాజాన్ని నిశ్చేష్టం చేసింది. పచ్చటి భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న ఓ పదో తరగతి పసిపాపపై రంపంతో అంతటి అమానుషానికి ఒడిగట్టడం ప్రతి గుండెను పిండివేసింది. తాజాగా రాప్తాడు నిందితుడి కుడి కాలును వైద్యులు పూర్తిగా తొలగించారు. అయితే రక్తమోడిన ఆ చిన్నారి ఆక్రందనలకు, ఆమె కుటుంబం అనుభవిస్తున్న నరకానికి న్యాయస్థానంలో నిందితుడికి పడే కఠిన శిక్ష మాత్రమే ఉపశమనం ఇవ్వగలదు.
తీవ్ర కలకలం రేపిన అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిని గోపికపై రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన 21 ఏళ్ల నిందితుడు హేమంత్‌కు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కీలక శస్త్రచికిత్స నిర్వహించారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా దెబ్బతిన్న అతడి కుడి కాలుకు రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోవడంతో మోకాలి పైభాగం వరకు తొలగించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడికి అత్యవసర ఆపరేషన్ నిర్వహించినట్లు అనంతపురం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపినా వినకుండా సీఐపై ఎదురుదాడికి దిగడంతో పోలీసులు హేమంత్ కాళ్లపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హేమంత్ కుడి కాలి రక్తనాళాలు చిధ్రమై కణజాలం పూర్తిగా దెబ్బతిన్నదని.. ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు వ్యాపించకుండా ఉండేందుకు మోకాలి పైవరకు కాలును తొలగించాల్సి వచ్చిందని వివరించారు. అలాగే అతడి ఎడమ కాలికి కూడా గాయాలవ్వడంతో రక్తనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం నిందితుడిని ఏఎంసీకి తరలించి చికిత్స అందిస్తున్నామని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
పదో తరగతి విద్యార్థినిపై జరిగిన ఈ క్రూరమైన దాడి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. పసిపాపపై రంపంతో దాడికి తెగబడటం పట్ల ప్రజలు, మహిళా సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వైద్యుల శస్త్రచికిత్స వల్ల నిందితుడి కాలు తొలగించినప్పటికీ ఇది చట్టపరమైన శిక్ష కాదని.. న్యాయస్థానం ద్వారా అతడికి కఠినమైన శిక్ష అమలైనప్పుడే బాధితురాలికి పరిపూర్ణ న్యాయం జరుగుతుందని బాధితురాలి కుటుంబ సభ్యులు, ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.
