'మోసాలకు ప్రపంచ రాజధాని'.. ఇంతమంది భారతీయులు ఎలా చిక్కుకున్నారు?
'మోసాలకు ప్రపంచ రాజధాని'గా పిలవబడే మయన్మార్ లోని కేకే పార్క్ లో చైనా మాఫియా నడుపుతున్న కాంపౌండ్ పై బర్మీస్ సైనిక జుంటా దాడి చేసింది
By: Raja Ch | 25 Oct 2025 7:00 AM IST'మోసాలకు ప్రపంచ రాజధాని'గా పిలవబడే మయన్మార్ లోని కేకే పార్క్ లో చైనా మాఫియా నడుపుతున్న కాంపౌండ్ పై బర్మీస్ సైనిక జుంటా దాడి చేసింది. దీంతో.. అక్కడ పనిచేస్తున్న భారతీయులతో సహా సుమారు 700 మంది విదేశీ పౌరులు పారిపోవాల్సి వచ్చింది! వారిలో చాలామంది మోయి నదిని ఈదుతూ పొరుగున ఉన్న థాయిలాండ్ కు పారిపోయారని థాయ్ సైన్యం తెలిపింది.
అవును... మయన్మార్ లో చైనా మాఫియా నడుపుతున్న కాంపౌండ్ పై బర్మీస్ సైనిక జుంటా జరిపిన దాడి ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ దాడిలో.. అక్కడకు అక్రమ రవాణా ద్వారా వెళ్లిన సుమారు 700 మంది విదేశీ పౌరులు మోయీ నదిని ఈదుతూ పొరుగుతున్న ఉన్న థాయిలాండ్ కు చేరుకున్నారు. ఈ సమయంలో నదీప్రవాహం కారణంగా కొంతమంది మునిగిపోయారని చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన థాయ్ సైన్యం... మయన్మార్ నుంచి పారిపోయిన అక్రమరవాణా విదేశీపురులు 677 మంది థాయిలాండ్ లోని ఉత్తర తక్ ప్రావిన్స్ లోకి ప్రవేశించారని తెలిపింది. వారిలో 618 మంది పురుషులు, 59 మంది మహిళలు ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకున్నామని థాయ్ సైన్యం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఈ సందర్భంగా... అక్కడ నుంచి పారిపోయి దారి తప్పిన ఎనిమిది మంది భారతీయులను రక్షించి, చట్టబద్ధంగా థాయిలాండ్ లోకి ప్రవేశించే ముందు తాత్కాలిక ఆశ్రయంలో ఉంచామని.. అనేక మంది విదేశీ కార్మికులు మయన్మార్ లోని మైవాడి, చుట్టుపక్కల దాక్కున్నారని స్థానికుడు ఒకరు తెలిపారని మీడియా నివేదించింది!
మరో నివేదిక ప్రకారం... ఆ స్థలంలో సైనిక దళాలు 200కి పైగా భవనాలను కనుగొన్నాయని.. వాటిలో 2,200 మంది కార్మికులను కనుగొన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో... శరణార్థుల సహాయక బృందాలు కెకె పార్క్ నుండి పారిపోతున్న కార్మికులకు ఆహారం అందించడానికి సిద్ధమవుతున్నాయి. మరోవైపు.. థాయ్ అధికారులు ఇప్పటికీ సరిహద్దు వైపున స్వాగత ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నారు.
మయన్మార్ లోని సైబర్ క్రైమ్ హబ్ లో భారతీయులు ఎలా..?:
మయన్మార్ లోని చైనీస్ మాఫియా నడుపుతున్న కెకె పార్క్.. థాయ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న మైవాడిలో ఉన్న సైబర్ నేరాల కేంద్రం. ఇక్కడ భారతదేశంతో సహా అనేక దేశాల నుండి అక్రమంగా రవాణా చేయబడిన వేలాది మంది వ్యక్తులు.. అమెరికా, యూరప్, చైనాలోని జనాలను లక్ష్యంగా చేసుకుని మోసపూరిత కార్యకలాపాలలో పాల్గొనేలా బలవంతం చేయబడతారు.
వీరిలో గణనీయమైన సంఖ్యలో భారతీయులతో సహా చాలా మంది వ్యక్తులు.. నకిలీ ఉద్యోగ ఆఫర్ల ద్వారా ఆకర్షితులవుతూ ఇక్కడ చిక్కుకుపోతున్నారు. అనంతరం.. బలవంతపు శ్రమ, నిర్భందం, దుర్వినియోగం వంటి కఠినమైన పరిస్థితులకు గురవుతున్నారు.
కాగా... 2021లో మయన్మార్ లో తిరుగుబాటు, కోవిడ్-19 మహమ్మారి తర్వాత థాయిలాండ్, మయన్మార్, లావోస్, కంబోడియా సరిహద్దు ప్రాంతాలలో ఆన్ లైన్ మోసాలను నిర్వహించే స్కామ్ హబ్ లు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో... మయన్మార్ లోనే ఇటువంటి స్కామ్ కేంద్రాలు కనీసం 30 ఉన్నాయని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి!
