Begin typing your search above and press return to search.

మంచం బాక్స్ లో మనవడి మృతదేహం.. పైన అమ్మమ్మ పడక..!

వివరాళ్లోకి వెళ్తే... చిన్నారి అదృశ్యం గురించి శుక్రవారం అర్థరాత్రి సమాచారం అందడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

By:  Raja Ch   |   1 Feb 2026 4:02 PM IST
మంచం బాక్స్  లో మనవడి మృతదేహం.. పైన అమ్మమ్మ పడక..!
X

ఓ బాలుడిని నైలాన్ తాడుతో సుమారు ఎనిమిది సార్లు గొంతు కోసి, అనంతరం ఇటుకతో అతని ముఖంపై గట్టిగా బాది, ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్ బాక్స్ లో దాచి పెట్టు.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికన్నట్లు అనారోగ్యంతో ఉన్న తన అమ్మమ్మను నిందితుడు ఆ మంచంపై పడుకోబెట్టిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఈ దారుణానికి గల కారణాలు తెరపైకి వస్తున్నా.. నిందితుడు చేసిన పని మాత్రం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అవును... మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దాదాపు 13 ఏళ్ల బాలుడు దారుణంగా హత్యకు గురవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో బాలుడు ఇంటి బయట నుంచి కనిపించకుండా పోవడంతో పాటు రాత్రి ఎంత సమయమైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా వెతికి, అతడు ఎప్పటికీ కనిపించకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం.. వ్యవహారం వెలుగులోకి వచ్చింది!

వివరాళ్లోకి వెళ్తే... చిన్నారి అదృశ్యం గురించి శుక్రవారం అర్థరాత్రి సమాచారం అందడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మరుసటి రోజు తెల్లవారుజామున పోలీసులకు కొత్త సమాచారం అందింది. దీంతో.. వారు సమీపంలోని భవనం పైకప్పుకు చేరుకోగా.. అక్కడ అదృశ్యమైన బాలుడి జాకెట్ కనిపించింది. అదే స్థలంలో రక్తపు మరకలు కూడా కనిపించాయి. ఈ సమయంలో.. పోలీసులు ఇద్దరు కీలక అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

చిన్నారి అదృశ్యానికి ముందు ఆ భవనంపైనే ఆడుకుంటున్నట్లు కనిపించాడని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు బాలుడి గురించి వెతుకుతున్న సమయంలో వారితో పాటు ప్రధాన నిందితుడు రెహాన్ (21) కూడా వారితో తిరుగుతూ హడావిడి చేసినట్లు చెబుతున్నారు. అయితే.. అతడి ప్రవర్తన తప్పించుకునేలా కనిపించిందని.. అతని చేతులు, మెడపైనా గీతలు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు.

దీంతో... తమదైన శైలిలో విచారించేసరికి నేరం అంగీకరించాడని చెబుతున్నారు. అనంతరం.. బాలుడి మృతదేహాన్ని బెడ్ బాక్స్ లోపల దాచిపెట్టి, దానిపై తన అమ్మమ్మను పడుకోబెట్టినట్లు చెప్పాడు. అక్కడకు వెళ్లిన పోలీసులు.. అనారోగ్యంతో ఉన్న నిందితుడి అమ్మమ్మను మంచంపై నుంచి దింపి, ఆ మంచం తెరిచిచూస్తే... అదృశ్యమైన బాలుడి మృతదేహం దుప్పటిలో చుట్టి ఉంది. దీంతో.. వెంటనే హత్య కేసు నమోదు చేసిన పోలీసులు రెహాన్ ను అరెస్ట్ చేశారు.

అయితే... నిందితుడు మైనర్ బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించిన తర్వాత ఈ నేరం జరిగిందని అంటున్నారు. ఆ సమయంలో బాలుడు ప్రతిఘటించి కేకలు వేయడంతో.. నిందితుడు అతన్ని దారుణంగా చంపేశాడని చెబుతున్నారు. బాలుడి ఇంటి నుంచి కేవలం 30 మీటర్ల దూరంలో ఉన్న ఆరు అంతస్తుల భవనంపై ఈ హత్య జరిగింది. నేరాన్ని దాచి పెట్టడానికి బాలుడి మృతదేహాన్ని నాలుగొ అంతస్తులోకి తీసుకెళ్లి, మంచం బాక్స్ లో దాచి పెట్టారు! ఈ సమయంలో నిందితుడికి మరొ మైనర్ బాలుడు సహకరించినట్లు చెబుతున్నారు!