భర్త మహాశయులూ....జర జాగ్రత్త !
విశాఖ నగరంలోని మధురవాడ పరిధిలో నివసిస్తున్న ఒక వివాహిత తన భర్త డిసెంబర్ 9నుంచి కనిపించడం లేదని ఆ నెల 17న పోతినమల్లయ్య పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By: Satya P | 9 Jan 2026 7:00 AM ISTభర్తలు అంటే భరించేవారు అని అర్ధం. అలా అని ఏవైనా ఎన్ని అయినా భరించాలా అంటే దానికి జవాబు అయితే లేదు. జరుగుతున్నది చూస్తే భర్తలు అన్నీ భరించాలి అన్నట్లుగానే ఉంది మరి ఆఖరుకి ప్రాణాలు హరిస్తున్నా హ్యాపీగా ఇచ్చేయాల్సిందేనా అన్న చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో భర్తల మీద హత్యా యత్నాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న వాడిని కడతేరుస్తున్న దారుణ ఘాతుకాలు అన్ని చోట్లా జరుగుతున్నాయి. ఏ పాపమూ తెలియని భర్త అలా అసువులు పోగోట్టుకున్నాడు అని మిగిలిన సమాజం జాలి చూపడమే తప్ప ఆ ప్రాణాలను తిరిగి తెచ్చి ఇవ్వలేని దుస్థితి.
మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు :
విశాఖ నగరంలోని మధురవాడ పరిధిలో నివసిస్తున్న ఒక వివాహిత తన భర్త డిసెంబర్ 9నుంచి కనిపించడం లేదని ఆ నెల 17న పోతినమల్లయ్య పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆమె భర్త కేసుని మిస్సింగ్ గా నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఆమె భర్త భీమిలీ బీచ్ రోడ్డులోని తిమ్మాపురంలో శవంగా లభ్యమయ్యాడు. దాంతో ఈ కేసులో మరింత పురోగతి కోసం పోలీసులు చేసిన దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలను విశాఖ నార్త్ ఏసీపీ నాగరాజు మీడియాకు తెలియచేస్తూ తన భర్తను సదరు వివాహిత చంపిందని దిగ్భ్రాంతికరమైన విషయాలను బయటపెట్టారు. నవంబర్ 29నే తన భర్తని ఆమె కొందరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి మరీ చంపించి 17న ఆమె ఫిర్యాదు చేసింది అని ఆయన చెప్పారు.
నగదుతో పాటు బంగారంతో భర్త పరారు :
ఫిర్యాదులో మాత్రం డిసెంబర్ 9 నుంచి కనిపించడం లేదు అని పేర్కొనడం విశేషం అన్నారు. ఇక ఆమె చెప్పిన వివరాలను పోలీసుల దర్యాప్తులో ట్రాక్ చేసి చూడగా ఆమె తాను అంతకు ముందు ఉంటున్న ఇంటిని భర్త లేకుండానే వేరే చోటకు మార్చేసిందందని ఆ ఇంట్లో ఆమె ఇద్దరు పిల్లలతో పాటు ఆమె ప్రియుడు కూడా ఉండడాన్ని పోలీసులు గుర్తించారని ఇరుగు పోరుగు వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా చేసుకుని కేసుని మరింత లోతుగా విచారిస్తే అసలు నిజాలు వెల్లడి అయ్యాయని ఆయన చెప్పారు. ఈ కేసులో మరో చిత్రమేంటి అంటే నగదుతో పాటు బంగారంతో భర్త పరారు అయ్యాడని కూడా తీవ్ర ఆరోపణలు చేయడం. సభ్య సమాజంలో భర్తలకే భయం కలిగించేలా ఈ కేసు ఉంది. ఇది విశాఖలో సంచలనం రేపుతోంది.
బహు పరాక్ సుమా :
ఇలా అనేక సంఘటనలు నిత్యం జరుగుతున్నాయి. కేవలం తాత్కాలిక వ్యామోహంతో ఈ రకంగా కొందరు చేస్తున్న వికృత చేష్టలకు భర్తలు బలి అవుతున్నారు. అడ్డు ఉన్నారని తొలగించుకోవాలని చూస్తున్నారు. తాము ఎక్కడా తప్పుకు దొరకమని కూడా చేస్తున్నారు. అయితే పోలీసులు తమ కంటే తెలివైన వారు అని ఏదో తీగ దొరికితే తమ గుట్టు మొత్తం బయటపడుతుందని ఇలా చేస్తున్న వారికి అర్థం కావడం లేదు అని అంటున్నారు. ఈ రకమైన నేరాలు చేయడం వల్ల అనాధలుగా బిడ్డలు మారిపోతున్నారు అని అంటున్నారు. మొత్తానికి భర్త మహాశయులు జాగ్రత్త అన్న సూచనలు అయితే సామాజిక విశ్లేషకుల నుంచి వస్తోంది. ఎంతసేపూ ఉద్యోగం కెరీర్. లేదా తాము చేస్తున్న పనిలో పడి ఇంట్లో ఏమి జరుగుతోంది అన్నది కనిపెట్టక పోతే మాత్రం తామే చివరికి బలి అవుతామని వారు గుర్తుంచుకోవాలని అంటున్నారు. వైవాహిక బంధంలో ఎడబాట్లూ పొరపాట్లకు తావు ఇవ్వకుండా ఉంటే ఇలాంటివి జరగవని కూడా సూచిస్తున్నారు.
