Begin typing your search above and press return to search.

ఫోన్ కోసం కన్నబిడ్డను అమ్మేశారు.. ఇంతకంటే ఘోరం ఉంటుందా?

కేవలం ఒక స్మార్ట్‌ఫోన్, బంగారు గొలుసు కొనుగోలు చేయడం కోసం కన్నబిడ్డనే అమ్మేసిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసి మానవాళిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

By:  A.N.Kumar   |   30 Sept 2026 10:18 AM IST
ఫోన్ కోసం కన్నబిడ్డను అమ్మేశారు.. ఇంతకంటే ఘోరం ఉంటుందా?
X

ప్రపంచంలో కన్నపేగు అనుబంధాన్ని మించిన తీపి జ్ఞాపకం.. గొప్ప బంధం మరొకటి ఉండదు. తమ బిడ్డ ఆకలి తీర్చడం కోసం.. వారి భవిష్యత్తును దిద్ది తీర్చడం కోసం తల్లిదండ్రులు తమ సర్వస్వాన్ని ధారపోస్తారు. కానీ నేటి సమాజంలో కొంతమంది మానవత్వాన్ని పూర్తిగా మరచిపోతున్నారు. క్షణికానందాలు.. విలాసవంతమైన కోరికల కోసం నవమాసాలు మోసి కన్న పసికందును వ్యాపార వస్తువులా మార్చేస్తున్నారు. కేవలం ఒక స్మార్ట్‌ఫోన్, బంగారు గొలుసు కొనుగోలు చేయడం కోసం కన్నబిడ్డనే అమ్మేసిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసి మానవాళిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

అసలేం జరిగింది?

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో సహజీవనం చేస్తున్న ఓ జంటకు ఇటీవల ఒక మగశిశువు జన్మించాడు. ఆ ఆనందాన్ని ఆస్వాదించి బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తల్లిదండ్రులు.. తమ విలాసాల కోసం దారుణమైన ఆలోచన చేశారు. కొత్త స్మార్ట్‌ఫోన్, బంగారు గొలుసు కొనాలనే కోరికతో నెలరోజుల పసికందును విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆ పసిపాపను రూ.1.20 లక్షలకు అమ్మేశారు. కన్న బిడ్డను నట్టేట ముంచి.. ఆ వచ్చిన డబ్బుతో తమ కోరికలు తీర్చుకున్నారు.

48 గంటల్లో నలుగురి చేతులు మారిన పాప

ఈ అమానుష వ్యవహారం కొంతకాలం రహస్యంగానే సాగినా మధ్యవర్తులు.. నిందితుల మధ్య తలెత్తిన గొడవలతో అసలు విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఆ విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 48 గంటల వ్యవధిలోనే ఆ నెలరోజుల పసికందు నలుగురి చేతులు మారాడు.. చివరికి ఆ పాప హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి వద్దకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి ఈ చిన్నారి కోసం రూ.3.5 లక్షలు చెల్లించినట్లు తేలింది. ఒక పసిపాపను వస్తువులా మారుస్తూ లక్షల రూపాయల వ్యాపారం చేయడం చూసి పోలీసులు సైతం విస్తుపోయారు.

చిన్నారిని రక్షించిన పోలీసులు.. ఏడుగురి అరెస్ట్

ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు.. ప్రస్తుతం చిన్నారిని సురక్షితంగా రక్షించి, చైల్డ్ కేర్ సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ అక్రమ విక్రయానికి ఒడిగట్టిన కన్న తల్లిదండ్రులతో పాటు.. బిడ్డను కొనుగోలు చేసిన వ్యక్తిని.. ఇందుకు సహకరించిన మధ్యవర్తులను కలిపి మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు.

కన్నబిడ్డ కంటే క్షణిక సుఖాలు, వస్తువులే ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో.. ఇలాంటి ఘటనలు సమాజంలో నైతిక విలువల పతనానికి అద్దం పడుతున్నాయి. అమ్మప్రేమ, నాన్న బాధ్యత అనే మాటలకే అర్థం లేకుండా చేసిన ఈ తల్లిదండ్రుల వైఖరిపై స్థానికులు, పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని పలువురు కోరుతున్నారు.