Begin typing your search above and press return to search.

ఐదేళ్ల చిన్నారి తల నరికిన పాతికేళ్ల వ్యక్తి.. ఏం జరిగిందంటే..!

ఈ క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్‌ లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి, కన్న తల్లి ముందే అక్కడున్న ఐదేళ్ల చిన్నారి తల నరికేశాడు.

By:  Raja Ch   |   27 Sept 2025 6:00 PM IST
ఐదేళ్ల చిన్నారి తల నరికిన పాతికేళ్ల వ్యక్తి.. ఏం జరిగిందంటే..!
X

కారణం ఏదైనా, కారకులు ఎవరైనా ఇటీవల కాలంలో ఓ మనిషి ప్రాణం తీయడం అనేది అత్యంత సహజమైన విషయంగా మారిపోయిందనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్‌ లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి, కన్న తల్లి ముందే అక్కడున్న ఐదేళ్ల చిన్నారి తల నరికేశాడు.

అవును... మధ్యప్రదేశ్‌ లో ఓ వ్యక్తి వికాస్ అనే ఐదేళ్ల బాలుడిని అతని తల్లి ముందే తల నరికి చంపాడు. అనంతరం ఆ తల్లి అరుపులతో అక్కడికి చేరుకున్న గ్రామస్థులు దాడి చేయడంతో.. నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నిందితుడు మహేష్ (25) బైక్‌ పై వచ్చి కలు సింగ్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఆ కుటుంబ సభ్యులు అతన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఆ సమయంలో మహేష్ ఏమీ మాట్లాడకుండా అకస్మాత్తుగా ఇంట్లో పడి ఉన్న పదునైన ఆయుధాన్ని తీసుకొని అక్కడున్న ఐదేళ్ల బాలుడిపై దాడి చేశాడు.

ఇందులో భాగంగా ఆ పదునైన ఆయుధంతో ఆ బాలుడి మెడను అతని మొండెం నుండి వేరు చేశాడు. ఆ తర్వాత భుజంపై కొట్టడంతో బాలుడి శరీరం ముక్కలైంది. దాడి సమయంలో గమనించి అడ్డుపడేందుకు ప్రయత్నించిన బాలుడి తల్లిని కూడా గాయపరిచాడు. ఆ సమయంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు.

తీవ్ర ఆగ్రహంతో నిందితుడిపై వారంతా దాడి చేశారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ధార్ పోలీసు సూపరింటెండెంట్ మయాంక్ అవస్థీ.. నిందితుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడని ధృవీకరించారు. అతడి మరణానికి అసలు కారణం పోస్ట్ మార్టం తర్వాత తెలుస్తుందని తెలిపారు. నిందితుడు అలీరాజ్‌ పుర్‌ జిల్లాకు చెందిన మహేశ్‌ (25)గా గుర్తించామని, ప్రాథమిక దర్యాప్తులో అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని వెల్లడైందని వెల్లడించారు. ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.