Begin typing your search above and press return to search.

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఏడాదిలోనే చంపేశాడు

మంగళవారం ఉదయానికి వైష్ణవి రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న వైనాన్ని గుర్తించారు. అప్పటికే భర్త హరిబాబు టూవీలర్ మీద పరారైన విషయాన్ని గుర్తించారు.

By:  Garuda Media   |   18 March 2026 9:34 AM IST
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఏడాదిలోనే చంపేశాడు
X

ప్రేమించి పెళ్లి చేసుకున్న టీన్ యూట్యూబర్ ను దారుణంగా హత్య చేసిన భర్త ఉదంతమిది. చలాకీగా వీడియోలు చేసే ఆమె జీవితం.. అర్థాంతరంగా ముగిసింది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమె ఇప్పుడు నాలుగు నెలల గర్భిణి. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఉదంతం గురించి తెలిసినంతనే అయ్యో అనిపించటం ఖాయం. ఇంతకూ అసలేం జరిగిందంటే.. కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల వైష్ణవి.. కోరుట్ల టౌన్ కు చెందిన 26 ఏళ్ల చిత్తరి హరిబాబును ప్రేమించి పెళ్లాడింది.

పెళ్లైన ఎనిమిది నెలలకే వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి. దీనికి కారణం.. భర్త కట్నం ఆశించటమే. యూట్యూబర్ గా పని చేసే వైష్ణవి ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. కొద్ది రోజులుగా ఇరువురి మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం వైష్ణవి భర్తతో కలిసి తన తల్లివారింట్లో ఉంటోంది. సోమవారం అర్థరాత్రి తర్వాత వీరి గదిలో పెద్ద ఎత్తున శబ్దాలు రావటంతోకుటుంబ సభ్యులు వెళ్లి చూడగా.. వారు నిద్ర పోతున్నట్లుగా గుర్తించి.. తిరిగి తమ గదుల్లోకి వెళ్లిపోయారు.

మంగళవారం ఉదయానికి వైష్ణవి రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న వైనాన్ని గుర్తించారు. అప్పటికే భర్త హరిబాబు టూవీలర్ మీద పరారైన విషయాన్ని గుర్తించారు. ఈ దారుణ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. అదనపు కట్నం కోసం వైష్ణవిని గడిచిన కొంతకాలంగా హరిబాబు వేధిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే వీరి మధ్య గొడవలు పెరిగినట్లుగా చెబుతున్నారు. తాజాగా వైష్ణవి గొంతు నులిమి.. చేతులు.. నుదిటి మీద కత్తితో పొడిచి.. హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. తన కంటే ఏడేళ్లు చిన్నదైన భార్య.. అందునా 19 ఏళ్లకే నాలుగు నెలల గర్భిణిగా ఉన్న భార్యను అంతలా ఎలా చంపుతాడన్నది హాట్ టాపిక్ గా మారింది.