డబ్బుల కోసం దాచేసి .. దొరికిపోతానని !
బీహార్ రాష్ట్రం నలందా జిల్లాకు చెందిన విక్రమ్ కుమార్ ఈ నెల 6 వరకు అక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు.
By: Garuda Media | 13 Oct 2026 1:22 PM ISTహైదరాబాద్ శివారు కౌకూర్ లో దారుణం జరిగింది. డబ్బుల కోసం ఒక చిన్నారిని కిడ్నాప్ చేసి, ఆ విషయం బయటపడి దొరికిపోతానని భావించి ఐదేళ్ల చిన్నారిని దుర్మార్గుడు హత్య చేశాడు. పోలీసులు ఈ విషయంలో వేగంగా స్పందించి 24 గంటల్లో చేయించారు.
2019లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వలస వచ్చిన సైంటిస్ట్ మిల్టన్ ఫెర్నాండెజ్ మోసెస్, డేజీ ఇవాంజెలియా కుటుంబం కౌకూరులోని విల్లా ఆర్కిడ్స్ లో నివసిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమార్తె ఆరేలియా మోజెస్ ఆలియాస్ మోనుతో పాటు, జేడెన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.
బీహార్ రాష్ట్రం నలందా జిల్లాకు చెందిన విక్రమ్ కుమార్ ఈ నెల 6 వరకు అక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. దీంతో తరచుగా అక్కడి క్లబ్ హౌస్ కు వచ్చే ఐదేళ్ల ఆరేలియాను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్టోబరు 10న సైకిల్ తొక్కుతూ క్లబ్ హౌస్ కు వెళ్లిన ఆరేలియాను చాక్లెట్ ఆశ చూపి అక్కడే అండర్ గ్రౌండ్ లోకి తీసుకెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత బాలిక అతని మాట వినకపోవడంతో నైలాన్ తాడు గొంతుకు బిగించి చంపేసాడు. అక్కడే ఉన్న నీళ్లలో రాళ్లు కట్టి శవాన్ని వేశాడు. ఆ తర్వాత చిన్నారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పాపను విడిచిపెట్టాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీ కెమెరాలను పరిశీలించగా పాప గేటెడ్ కమ్యూనిటీ బయటకు వెళ్లినట్లు కనిపించలేదు. క్లబ్ హౌస్ లోని సెల్లార్ సంపులో పాప మృతదేహం లభ్యమైంది.
కేసును సీరియస్ గా తీసుకున్న మల్కాజిగిరి కమీషనర్ సుమతి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 130 సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. చిన్నారితో కనిపించిన నిందితుడు ఒంటరిగా బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కాల్ రికార్డులు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని చిన్నారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరపాలని కోర్టుకు విజ్ఞప్తి చేస్తామని, కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
