Begin typing your search above and press return to search.

బీమా చేయించి అన్నను చంపేశాడు.. ఇంత దుర్మార్గమా?

బంధాలు.. అనుబంధాల మధ్య గాఢత అంతకంతకూ తగ్గిపోతున్న పరిస్థితులు ఇటీవల కాలంలో చూస్తున్నదే.

By:  Garuda Media   |   3 Dec 2025 9:39 AM IST
బీమా చేయించి అన్నను చంపేశాడు.. ఇంత దుర్మార్గమా?
X

బంధాలు.. అనుబంధాల మధ్య గాఢత అంతకంతకూ తగ్గిపోతున్న పరిస్థితులు ఇటీవల కాలంలో చూస్తున్నదే. తాత్కాలిక ఆనందాలు.. సంతోషాల కోసం బంధాల్ని బలిపెడుతున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. వివాహేతర సంబంధాల కోసం భర్తల్ని చంపేసే భార్యలు.. పాడు డబ్బుల కోసం రక్తం పంచుకుపుట్టినోళ్లను తుదముట్టించే దుర్మార్గాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న దారుణం చూస్తే.. ఇదే కోవకు చెందిందన్నది అర్థమవుతుంది.

చేసిన అప్పులు తీర్చటానికి ఒక తమ్ముడు వేసిన దుర్మార్గమైన ప్లాన్ చూస్తే.. షాక్ కు గురి కావాల్సిందే. బీమా సంస్థ ప్రతినిధులకు వచ్చిన అనుమానం.. పోలీసుల విచారణలో తప్పుడు మార్గంలో నడిచిన బాధితుడి సోదరుడ్ని.. అతడికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకున్న ఈ దుర్మార్గంలోకి వెళితే..

రామడుగుకు చెందిన 30 ఏళ్ల నరేశ్ మూడేళ్ల క్రితం రెండు టిప్పర్ లు కొనుగోలు చేసి వాటిని అద్దెకు ఇచ్చేవాడు. కొంతకాలంగా వ్యాపారం సరిగా సాగకపోవటంతో ఈఎంఐలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. దీనికి తోడు స్టాక్ మార్కెట్ లోనూ పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. దాదాపు రూ.15 కోట్ల వరకు అప్పులయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా పరిపక్వత లేని.. పెళ్లి కాని అన్న వెంకటేశ్ ను చంపాలని కుట్రకు తెర తీశాడు. తన ప్లాన్ లో భాగంగా రెండు నెలల క్రితం వెంకటేశ్ పేరుతో నాలుగు ప్రైవేటు బీమా సంస్థలతో పాటు ప్రభుత్వ బీమా సంస్థల నుంచి వేర్వేరుగా రూ.4.14 కోట్ల బీమా చేయించాడు. అదే సమయంలో తనకు రూ.7లక్షల అప్పు ఇచ్చిన రాకేశ్ అనే వ్యక్తిని తనకు సహకరిస్తే.. అప్పుతో పాటు అదనంగా రూ.13 లక్షలు ఇస్తానని.. తనకు వచ్చే బీమా డబ్బుల ప్లాన్ చెప్పాడు.

తన అన్నను హత్య చేసే ప్లాన్ కు సహకరిస్తే రూ.2 లక్షలు ఇస్తానని టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ ను సైతం ఒప్పించాడు. అదే సమయంలో తాము వేసుకున్న ప్లాన్ తేడా కొట్టి బయటకు వస్తే అందరం శిక్ష భరించాలని ముగ్గురు కనపడే విధంగా ఒక వీడియో తీసుకున్నారు. ప్లాన్ లో భాగంగా తన తిప్పర్ ఆగిందని డ్రైవర్ ఫోన్ చేసి నరేశ్ కు చెప్పారు. తన అల్లుడు సాయి బైక్ పై అన్న వెంకటేశ్ ను టిప్పర్ వద్దకు పంపారు. టిప్పర్ చక్రం కింద జాకీ పెట్టాలని.. వెంకటేశ్ ను కింద పడుకోపెట్టి నరేశ్ టిప్పర్ ను నడుపుతూ ముందుకు కదిలించాడు.

దీంతో వెంకటేశ్ టైర్ల కింద పడి అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులకు చెప్పాడు. అనంతరం బీమా సంస్థ ప్రతినిధులు వచ్చి నరేశ్ చెప్పిన సమాచారంపై అనుమానించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు.. పూర్తిస్థాయిలో విచారణ చేయగా.. హత్య చేసినట్లుగా తేలటంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ క్రమంలో తాము చేసిన దుర్మార్గాన్ని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.