వద్దని చెబుతున్నా వెంట పడుతున్నోడ్ని పుట్టింటికి పిలిచి ఏసేసింది
అదే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల సాయినాథ్ సింగ్ ఆమె వెంట పడేవాడు. అంతకంతకూ అతడి వేధింపులు ఎక్కువ అవుతున్నాయే తప్పించి.. అతడిలో మార్పు రావట్లేదు.
By: Garuda Media | 29 Sept 2026 6:00 PM ISTప్లీజ్ వెంటపడొద్దు. ఫ్యామిలీ ఉంది. పిల్లలు ఉన్నారంటూ ఎంత చెప్పినా అతడి ఏ మాత్రం వినలేదు. అదే పనిగా వేధింపులకు పాల్పడుతూ ఇబ్బంది పెడుతున్నోడిని పుట్టింటికి పిలిచి.. చున్నీతో ఉరేసిన వివాహిత ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. శివలాల్ నగర్ లో నలుగురు పిల్లలున్న మహిళ ఒకరు నివసిస్తున్నారు.
అదే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల సాయినాథ్ సింగ్ ఆమె వెంట పడేవాడు. అంతకంతకూ అతడి వేధింపులు ఎక్కువ అవుతున్నాయే తప్పించి.. అతడిలో మార్పు రావట్లేదు. తనను వదిలేయాలని.. తనకు కుటుంబం ఉందని చెప్పినా వినకపోగా.. వేధింపుల పర్వాన్ని మరింత పెంచాడు. దీంతో.. ఆమె తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి భర్త.. కుటుంబ సభ్యులకు చెప్పింది.
వారంతా సదరు యువకుడ్ని వేధింపులకు పాల్పడొద్దని హెచ్చరించారు. అయినప్పటికి.. అతడు మాత్రం ఆమెను వేధించటం మానలేదు సరికదా.. మరింత మోతాదు పెంచాడు. దీంతో విసిగిపోయిన ఆమె షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహీంనగర్ లోని తన పుట్టింటికి రావాలని సదరు యువకుడిని పిలిచింది బాధితురాలు.
దీంతో సాయినాథ్ సింగ్ వెంటనే ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ అతడ్ని చంపేందుకు ప్లాన్ చేసిన బాధిత యువతి.. తన చున్నీతో సాయినాథ్ సింగ్ మెడకు ఉరిలా వేసి చంపేసింది. ఈ ఉదంతంలో ఆమెకు మరికొందరు సహకరించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో భర్త ర్యాపిడో కెప్టెన్ గా పని మీద బయటకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. సదరు యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
