Begin typing your search above and press return to search.

అనుమానం పెనుభూతమైంది.. పెట్రోల్ పోసి చంపేశాడు

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో దారుణంగా చంపేసిన ఉదంతం షాకింగ్ గా మారింది.

By:  Garuda Media   |   27 Dec 2025 11:13 AM IST
అనుమానం పెనుభూతమైంది.. పెట్రోల్ పోసి చంపేశాడు
X

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో దారుణంగా చంపేసిన ఉదంతం షాకింగ్ గా మారింది. భార్య మీద అనుమానం పెంచుకొని.. ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగా నిద్ర పోతున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో కన్నుమూసింది. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల త్రివేణి.. వెంకటేశ్ లు పదేళ్ల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ల కొడుకు.. ఆరేళ్ల కుమార్తెలు ఉన్నారు. ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చిన వీరు..కొన్నేళ్లుగా భార్య మీద అనుమానాన్ని పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఆమెను చిత్రహింసలు పెట్టేశాడు. దీంతో.. అతడి ఆగడాలు భరించలేని త్రివేణి.. సరూర్ నగర్ లో భర్తపై కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదిలా ఉండగా.. ఏడాది క్రితం వీరిద్దరూ దిల్ సుఖ్ నగర్ నుంచి తిలక్ నగర్ కు వచ్చి ఉంటున్నారు. కేసు నమోదైన తర్వాత కూడా కలిసే ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవలు పెరగటంతో ఎనిమిది నెలల క్రితం వెంకటేశ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. త్రివేణి ఒక హోటల్ లో పని చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. రెండు నెలల క్రితం అయ్యప్ప మాల వేసుకొని వచ్చిన వెంకటేశ్.. తాను మారిపోయినట్లుగా చెప్పాడు.

వారం క్రితం మాల తీసిన అతను ఎలాంటి పని చేయకుండా ఉండిపోయాడు. ఉద్యోగంలో భాగంగా త్రివేణి రోజు ఉదయం హోటల్ లో పనికి వెళ్లి రాత్రి తిరిగి వచ్చేది. ఈ క్రమంలో ఆమెపై మరింత అనుమానం పెంచుకున్న వెంకటేశ్.. ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 23న అర్థరాత్రి వేళ కొడుకును నిద్ర లేపి బయటకు తీసుకొచ్చాడు.

అనంతరం ఇంట్లోకి వెళ్లి.. తాను అప్పటికే సిద్ధం చేసుకున్న పెట్రోల్ ను భార్యపై పోసి నిప్పు అంటించాడు. అక్కడి నుంచి పారిపోయాడు. త్రివేణి అరుపులతో నిద్ర లేచిన ఆమె కుమార్తె భయంతో బయటకు పరుగులు తీసి.. చుట్టుపక్కల వారిని నిద్ర లేపగా.. వారు మంటలు ఆర్పి ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలు ఎక్కువగా ఉండటంతో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇదిలా ఉండగా భార్యను హత్య చేసిన వెంకటేశ్ ను పోలీసులు అమీన్ పూర్ లో పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.