Begin typing your search above and press return to search.

లైంగిక వేధింపులు... 14 ఏళ్ల బాలుడి దాడిలో 40 ఏళ్ల మహిళ మృతి!

ఇది కదా రెగ్యులర్ గా ఆ వయసులో బాలుడికి ఉండే రొటీన్ లైఫ్! కానీ ఇప్పుడు చెప్పుకోబోయే కుర్రాడు అందరిలాంటి వాడు కాదు!

By:  Raja Ch   |   8 Nov 2025 9:00 PM IST
లైంగిక వేధింపులు... 14 ఏళ్ల బాలుడి దాడిలో 40 ఏళ్ల మహిళ మృతి!
X

14 ఏళ్ల బాలుడు ఏమి చేయాలి.. / ఏమి చేస్తాడు..? స్కూల్ కి వెళ్లి చదువుకుంటాడు.. స్కూల్ అయిపోయాక ఆటలాడుకుంటాడు.. సాయంత్రం పూట ట్యూషన్ కి వెళ్తాడు.. నైట్ ఇంటికొచ్చి భోజనం చేసి, కాసేపు మొబైల్ చూసో, టీవీ చూసో నిద్రపోతాడు! ఇది కదా రెగ్యులర్ గా ఆ వయసులో బాలుడికి ఉండే రొటీన్ లైఫ్! కానీ ఇప్పుడు చెప్పుకోబోయే కుర్రాడు అందరిలాంటి వాడు కాదు!

అవును... కాలం మారిపోయిందనుకోవాలా..? లేక, నేటి సమాజంలో చిన్న పిల్లలపై సినిమాలు, ఇంటర్నెట్ లో కనిపించే పలు దృశ్యాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయనుకోవాలా..? అదీకాకపోతే తల్లితండ్రుల పెంపకంలో లోపం అనుకోవాలా..? తెలియదు కానీ.. తాజాగా ఓ 14 ఏళ్ల బాలుడు దాదాపు తన తల్లి వయసున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు!

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని హమీర్ పూర్ లో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు, 40 ఏళ్ల మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ దాడిలో సదరు మహిళ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో ఆమె ప్రతిఘటించడంతో కొడవలి, కర్రతో దాడి చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు!

నవంబర్ 3వ తేదీన పొలంలో ఓ మహిళ గడ్డికోస్తోంది.. ఆ సమయంలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడు.. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది.. ఈ నేపథ్యంలో... అతడు కొడవలి, కర్రతో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు! అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

దీంతో ఆ మహిళ పొలంలో శరీరం నుంచి రక్తం కారుతున్న సమయంలో కూలబడిపోయింది. ఆ సమయంలో ఆమెను గ్రామస్తులు గమనించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చండీగఢ్ లోని హాస్పటల్ కు తరలించారు! ఈ క్రమంలో.. చికిత్స పొందుతూ ఆ మహిళ మరణించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మరోవైపు... నేరం జరిగిన ప్రదేశం నుంచి ఒక కొడవలి, ఒక కర్రతో పాటు పోలీసులు.. విరిగిన స్కేలు, పెన్ను ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలు సదరు బాలుడు నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని అబ్జర్వేషన్ హోమ్ లో ఉంచారు! ఈ సందర్భంగా స్పందించిన పోలీసు అధికారి రాజేష్ ఉపాధ్యాయ్.. దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు.

ఈ ఘటన సమాజం ఎటువైపు పోతోంది అనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏమిటంటే... తన 17 ఏళ్ల వికలాంగుడైన కొడుకును పెంచుతున్న ఆ మహిళ తన కుటుంబానికి ఉన్న ఏకైక ఆధారం!