Begin typing your search above and press return to search.

కదిలే కారులో 2 గంటల పాటు సామూహిక అత్యాచారం.. దేశంలో మరో దారుణం

తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ‘నిర్భయ’ ఉదంతాన్ని తలపిస్తూ యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

By:  A.N.Kumar   |   31 Dec 2025 4:25 PM IST
కదిలే కారులో 2 గంటల పాటు సామూహిక అత్యాచారం.. దేశంలో మరో దారుణం
X

దేశ రాజధాని ప్రాంతంలో మహిళల భద్రత గాలిలో దీపంగా మారింది. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. ఎన్ని నిఘా నేత్రాలు కాపలా కాస్తున్నా మృగాళ్ల వికృత చేష్టలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ‘నిర్భయ’ ఉదంతాన్ని తలపిస్తూ యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఓ యువతిని కారులో ఎక్కించుకున్న దుండగులు.. రెండు గంటల పాటు నరకం చూపించారు.

ఆటో కోసం వేచి చూస్తుండగా..

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు తన తల్లితో గొడవపడి స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. తిరిగి ఇంటికి చేరుకునేందుకు అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో మెట్రో చౌక్ వద్ద ఆటో కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో కారులో వచ్చిన ఇద్దరు యువకులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని నమ్మబలికారు. పాపం.. వారి మాటలు నమ్మిన ఆ యువతి కారు ఎక్కడంతో ఆమె పాలిట నరకం మొదలైంది.

కదిలే కారులో నరకయాతన

నిందితులు కారును ఫరీదాబాద్ నుంచి గురుగ్రామ్ రోడ్డు వైపు మళ్లించారు. సుమారు రెండు గంటల పాటు నగరం చుట్టూ తిప్పుతూ ఒకరు కారు నడుపుతుండగా.. మరొకరు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలు ప్రాణభయంతో కేకలు వేస్తూ గట్టిగా అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. నిందితులు ఆమెను విచక్షణారహితంగా కొట్టారు. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డుపై పడేసి పరార్

తమ పాశవిక ఆకలి తీర్చుకున్న అనంతరం.. తీవ్రంగా గాయపడి ఉన్న యువతిని కదిలే కారులో నుంచి నిర్దాక్షిణ్యంగా రోడ్డుపైకి తోసేసి నిందితులు పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న బాధితురాలు ఎలాగోలా తన సోదరికి సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆమెను సివిల్ ఆసుపత్రికి తరలించగా.. తలకు తీవ్ర గాయం కావడంతో 12 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

నిందితుల అరెస్ట్

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫరీదాబాద్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని.. ప్రస్తుతం ఫరీదాబాద్‌లోనే నివసిస్తున్నారని పోలీసులు ధృవీకరించారు.

మహిళల రక్షణ కేవలం కాగితాల మీద చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదని.. నేరస్థులకు తక్షణమే కఠిన శిక్షలు పడినప్పుడే ఇలాంటి మృగాళ్లలో వణుకు పుడుతుందని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.