Begin typing your search above and press return to search.

బెంగళూరులో త్రిపుల్ మర్డర్ కలకలం : ప్రియుడి కోసం కన్నవారిని, తోబుట్టువును కాటేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని!

బాధితుల శరీరాలపై దాదాపు 30 నుంచి 40 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీన్ని బట్టి నిందితులు ఎంతటి కసిగా.. కిరాతకంగా ఈ హత్యలకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు.

By:  A.N.Kumar   |   24 Jun 2026 10:47 PM IST
బెంగళూరులో త్రిపుల్ మర్డర్ కలకలం : ప్రియుడి కోసం కన్నవారిని, తోబుట్టువును కాటేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని!
X

ప్రేమ గుడ్డిదంటారు.. కానీ ఇక్కడ ఆ ప్రేమ కన్న ప్రేమను.. తోడబుట్టిన బంధాన్ని కూడా గుర్తుపట్టలేనంత గుడ్డిగా, కిరాతకంగా మార్చేసింది. బెంగళూరు సిటీలో వెలుగుచూసిన ఒక త్రిపుల్ మర్డర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. తన లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కు అడ్డు వస్తున్నారనే కోపంతో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తన ప్రియుడితో కలిసి కన్న తల్లిదండ్రులను, సొంత చెల్లిని అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఆస్తి వివాదాలు, కుటుంబ వ్యతిరేకత, అప్పుల భారం, స్వేచ్ఛ లేదనే సాకు.. ఇలా ఎన్నో కోణాలు ఈ ఘాతుకం వెనుక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

బీటెక్ ప్రేమ.. లివ్-ఇన్ రిలేషన్‌షిప్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 25 ఏళ్ల శ్వేత, కెన్నెత్ అనే యువకుడు బీటెక్ చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. చదువు పూర్తయ్యాక ఇద్దరూ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. గత రెండు నెలలుగా బెంగళూరులోని 'సాయి గ్రీన్ అపార్ట్‌మెంట్'లో ఇద్దరూ కలిసి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. అయితే వీరి సహజీవనాన్ని శ్వేత తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. పద్ధతి మార్చుకుని ఇంటికి తిరిగి వచ్చేయాలని ఆమెను పలుమార్లు హెచ్చరించారు.

అప్పుల గొడవలు.. పెరిగిన విభేదాలు

ఇదిలా ఉండగా శ్వేత దాదాపు రూ. 30 లక్షల వరకు బ్యాంకు రుణం తీసుకుంది. దానికి సంబంధించిన ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకు నుంచి నోటీసులు నేరుగా ఆమె తండ్రి ఇంటికి వెళ్లాయి. అసలే ప్రేమ వ్యవహారంతో గుర్రుగా ఉన్న కుటుంబంలో ఈ ఆర్థిక సమస్యలు మరిన్ని వివాదాలకు దారితీశాయి.

పక్కా ప్లాన్‌తో దారుణ హత్యలు

ఆదివారం రోజున శ్వేత తల్లి ముత్తులక్ష్మి కూతురు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. అక్కడ కెన్నెత్‌తో కలిసి ఉండటాన్ని చూసి తీవ్రంగా మందలించింది. వెంటనే ఆ బంధాన్ని తెంచుకోవాలని స్పష్టం చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన శ్వేత, ప్రియుడు కెన్నెత్‌తో కలిసి కన్నతల్లిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి, అక్కడికక్కడే హత్య చేశారు. అక్కడితో వీరి ఘాతుకం ఆగలేదు. తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచి.. ఏమీ తెలియనట్లు శ్వేత తన తండ్రి సోమసుందర్, 19 ఏళ్ల చెల్లెలు సుప్రియలను ఫోన్ చేసి ఇంటికి భోజనానికి పిలిచింది. కన్నకూతురి పిలుపు నమ్మి వచ్చిన తండ్రి, చెల్లిపై కూడా ఇద్దరూ కలిసి కత్తులతో విరుచుకుపడ్డారు.

పోస్ట్‌మార్టం నివేదిక షాకింగ్ నిజాలు

బాధితుల శరీరాలపై దాదాపు 30 నుంచి 40 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీన్ని బట్టి నిందితులు ఎంతటి కసిగా.. కిరాతకంగా ఈ హత్యలకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు.

తండ్రి ఇచ్చిన చివరి వాంగ్మూలం

తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న తండ్రి సోమసుందర్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే మరణించడానికి ముందు ఆయన పోలీసులకు ఇచ్చిన మరణ వాంగ్మూలం ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. కూతురు, ఆమె ప్రియుడే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆయన పోలీసులకు వివరించారు.

నిందితుల కోసం గాలింపు.. శ్వేత అరెస్ట్

హత్యల అనంతరం నిందితులిద్దరూ ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.. సాంకేతిక ఆధారాల సహాయంతో శ్వేతను పుదుచ్చేరి రైల్వే స్టేషన్ సమీపంలో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నాయి. ప్రాథమిక విచారణలో శ్వేత చెప్పిన సమాధానాలు విని పోలీసులే షాకయ్యారు. "నా తల్లిదండ్రులు నా జీవితాన్ని పూర్తిగా నియంత్రించారు. నాకు అస్సలు స్వేచ్ఛ ఇవ్వలేదు. అందుకే వారిని వదిలించుకున్నా" అంటూ ఆమె నిర్వేదంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రధాన నిందితుడు కెన్నెత్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి కోసం తమిళనాడు సహా పొరుగు రాష్ట్రాల్లో పోలీసులు గాలిస్తున్నారు. క్షణికావేశం, ఆర్థిక ఇబ్బందులు, మితిమీరిన స్వేచ్ఛా కాంక్ష ఒక నిండు సంసారాన్ని ఎలా రోడ్డున పడేసాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.